Aug 2 2021 @ 18:40PM

‘మనం’ తరహా చిత్రానికి మొదలైన మూడోతరం వారసుడి డబ్బింగ్‌

కోలీవుడ్‌ సినీ పరిశ్రమలో ఒకే కుటుంబానికి చెందిన మూడు తరాల నటీనటులు చాలా అరుదుగా ఉన్నారు. అలాంటి వారిలో సీనియర్‌ నటుడు విజయకుమార్‌ ఫ్యామిలీ ఒకటి. విజయకుమార్‌ ఇప్పటికీ సినిమాల్లో నటిస్తున్నారు. ఆయన కుమారుడు అరుణ్‌ విజయ్‌ కూడా హీరోగా రాణిస్తున్నారు. ఇప్పుడు ఈ కుటుంబం నుంచి మూడో తరం వారసుడు సినీ పరిశ్రమకు వచ్చాడు. ఆ బుడతడి పేరు ఆర్నవ్‌ విజయ్‌. ఈ ముగ్గురితో కలిసి ఒక చిత్రం తెరకెక్కింది. ప్రముఖ హీరో సూర్య సొంత నిర్మాణ సంస్థ 2డి ఎంటర్‌టైన్మెంట్‌ పతాకంపై శరవ్‌ షణ్ముగం దర్శకత్వంలో తాత - తండ్రి - కొడుకు కలిసి ఈ చిత్రంలో నటించారు. టాలీవుడ్‌లో అక్కినేని ఫ్యామిలీకి ‘మనం’ రూపంలో ఈ ఘనత ఉంది.  


ఇప్పటికే షూటింగ్‌ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం డబ్బింగ్‌ పనులతో పోస్ట్‌ప్రొడక్షన్‌ నిర్మాణ పనులను జరుపుకుంటోంది. ఇందులో భాగంగా ఆర్నవ్‌ విజయ్‌ తన పాత్రకు డబ్బింగ్‌ చెప్పుకున్నాడు. శరవ్‌ షణ్ముగం కథను సమకూర్చి దర్శకత్వం వహించిన ఈ చిత్రం వంద శాతం ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపుదిద్దుకుంది. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సినీ అభిమానులంతా ఈ మూవీని ఆదరిస్తారన్న నమ్మకాన్ని చిత్ర బృందం వ్యక్తం చేసింది. నివాస్‌ కె. ప్రసన్న సంగీతం సమకూర్చారు.


Otherwoodsమరిన్ని...