Abn logo
Mar 26 2020 @ 03:22AM

ఒకేమాట, ఒకేబాట

కరోనా మీద యుద్ధం–3


కరోనా వైరస్‌ను కట్టడి చేయడానికి పకడ్బందీ చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్‌ పాలిత రాష్ట్రాలకు సోనియాగాంధీ ఆదేశాలిచ్చినట్టు వార్తలు వచ్చాయి. ఏ పార్టీకి ఆ పార్టీ తను పాలించే రాష్ట్రాల శ్రేయస్సు మాత్రమే చూసుకోవాలా? పెనువిపత్తు వచ్చినప్పుడయినా, ప్రజాప్రయోజనాలరీత్యా వ్యవహరించడం రాజకీయపక్షాలు ఎప్పుడు నేర్చుకుంటాయి? నెదర్లాండ్స్‌లో కరోనా నేపథ్యంలో ప్రధానమంత్రి మార్క్‌ రుట్‌ ప్రతిపక్ష ఎంపిని దేశ ఆరోగ్యమంత్రిగా నియమించారు. నిజానికి, విశాలమైన ఛాతీ వెనుక అంతే విశాలమైన హృదయముంటే, ప్రధానమంత్రి కూడా అన్ని పక్షాల నాయకులతో కలసి జాతిని ఉద్దేశించి ప్రసంగించి ఉండవలసింది. ఆ పని నరేంద్రమోదీ చేయలేదు, మరి సోనియాగాంధీయో రాహుల్‌గాంధీయో ఒక జాతీయ ప్రెస్‌మీట్‌ ఏర్పాటు చేసి, ఈ విపత్తును ఎదుర్కొనడంలో తమ సహకారముంటుందని, ప్రజలు కూడా సహకరించాలని, విమర్శనాత్మకమైన సూచనలు కూడా చేస్తామని చెప్పవచ్చును కదా? లేదు. కేవలం తాము అధికారంలో ఉన్న రాష్ట్రాల విషయం మాత్రమే వారు పట్టించుకున్నారు. ఇక జాతీయదృష్టి ఎక్కడ? 


ప్రమాదం ఆవరించిన వేళ, అనేక పర్యాయాలు చెప్పినట్టు, ఏకపక్ష చర్యలు, అవి ఎంతటి బలమైనవైనా, సత్సంకల్పంతో కూడినవైనా, ఆశించిన ఫలితాలను ఇవ్వవు. కొన్ని ప్రత్యేక సందర్భాలలో జాతీయ ప్రభుత్వాలను ఏర్పాటు చేయడం అందుకే. అంతర్గతంగా అందరమూ ఒకటే అనే సందేశంతో పాటు, అందరం కలసి, సహభాగస్వాములుగా పనిచేస్తామని ప్రతిజ్ఞ తీసుకోవడం కూడా అవసరం. ఇందులో అధికార, ప్రతిపక్షాలన్న భేదభావం ఉండకూడదు.


తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్‌, బిజెపి, ఎంఐఎం తదితర పార్టీలన్నీ కరోనాకట్టడి లక్ష్యంపై ఒకే మాట మీద ఎందుకు ఉండకూడదు? ప్రభుత్వం ద్వారా అమలు జరిగే కార్యక్రమాల్లో, అధికార యంత్రాంగం తీసుకునే చర్యల్లో తప్పకుండా కొన్ని అసమగ్రతలు, ఖాళీలు, అతిగా వ్యవహరించడాలు ఉంటాయి. వాటిని ప్రతిపక్షాలు బయటపెట్టవచ్చు. అందుకు అభ్యంతరం ఉండనక్కరలేదు. పౌరసమాజంలోని వివిధ శ్రేణులు, సంస్థలు, మీడియా వంటి వ్యవస్థలు కరోనా నివారణ–నియంత్రణ క్రమంలో ఉన్న లోపాల గురించి తప్పనిసరిగా చెప్పాలి. అప్పుడు మాత్రమే ఆశించిన లక్ష్యాన్ని చేరుకునే ప్రక్రియ ప్రజాస్వామికంగాను, సమగ్రంగాను ఉంటుంది. చంద్రబాబు నాయుడు రాజకీయాల మీద ఎవరి అభిప్రాయాలు వారికి ఉండవచ్చును కానీ, విపత్తుల నిర్వహణ విషయంలో ఆయన అనుభవాన్ని, పనితీరును అందరూ గుర్తిస్తారు. అధికారం కోల్పోయి, ప్రతిపక్షంలో ఉన్నంత మాత్రాన ఆయన అనుభవం అక్కడి ప్రజలకు పనికిరాకుండా పోవాలా? ప్రజలలోని అపోహలను తొలగించేందుకు, లాక్‌డౌన్‌ కష్టాలను ఎదుర్కొనేందుకు, ఎదురయ్యే సమస్యలను పరిష్కరించుకునేందుకు ఏమి చేయాలో, చంద్రబాబు, ఆయన పార్టీ కూడా ఒక కార్యక్రమాన్ని చేపట్టాలి. రాజకీయనేతలే కాదు, సమాజంలో ఉండే వివిధ ప్రభావశాలి రంగాలను విశ్వాసంలోకి తీసుకోవడం, వాటి ద్వారా ప్రజలకు మంచి సందేశం అందేట్టు చూడడం, యావత్‌ సమాజానికి సంబంధించిన భవితవ్యాన్ని చర్చించేటప్పుడు, విస్తృత ప్రాతినిధ్యాన్ని పరిగణనలోకి తీసుకోవడం మంచి ప్రజాస్వామ్యం లక్షణాలు.


పత్రికాస్వేచ్ఛపై, మీడియా ప్రతిపత్తిపై గొప్ప కట్టుబాటు ఉన్న వ్యక్తిగా ప్రధాని మోదీని గుర్తించేవాళ్లు పెద్దగా ఉండరు. కానీ, ఆయన కరోనా సందర్భంగా దేశవ్యాప్తంగా ఉన్న ప్రింట్‌, విజువల్‌ మీడియా పెద్దలతో స్వయంగా మాట్లాడారు, సలహాలు, సూచనలు కోరారు. అది ఒక సంకేతాత్మక చర్య. సంప్రదించి, మంచిచెడ్డలు తెలుసుకుని వ్యవహరిస్తున్నారన్న భావనను ప్రభుత్వ పెద్దలపై ఈ ప్రక్రియ కలిగిస్తుంది. మరి, తెలుగురాష్ట్రాల పెద్దలు పత్రికాసమావేశాలు పెట్టి, ఏకపక్ష ప్రసంగాలు ఇవ్వడం, ప్రశ్నలడిగిన పాత్రికేయులను అదిలించడం తప్ప, ఆ రంగాన్ని విపత్తునిర్వహణలో ఎట్లా వినియోగించుకోవాలన్న ఆలోచన చేయరేమి? ఈ అంశంలోనే కాదు, పత్రికారంగం ఒక్కటనే కాదు, పెను పర్యవసానాలున్న ఏ పరిణామానికి సంబంధించిన అంశంపైన అయినా, వివిధ రంగాల ప్రతినిధులను, మేధావులను, క్రియాశీల కార్యకర్తలను, ప్రజాహిత సంస్థలను విశ్వాసంలోకి తీసుకుని విధానాలను రూపొందించడం తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు అలవాటు లేదు. కరోనా పరిస్థితిని ఎదుర్కొనడానికి తన సొంత పార్టీ యంత్రాంగాన్ని, వివిధ అంచెల ప్రాతినిధ్య వ్యవస్థలను రంగంలోకి దించాలనుకున్నందుకు, ప్రజాప్రమేయంతోనే అవగాహన పెరుగుతుందన్న సత్యాన్ని గుర్తించినందుకు మాత్రం తెలంగాణ ముఖ్యమంత్రిని అభినందించవచ్చు. స్థానికసంస్థల ఎన్నికలను వాయిదా వేసినందుకు ఇంకా బాధపడుతున్న అమాత్యులు, అర్ధమనస్కంగా కట్టడిచర్యలు తీసుకుంటున్న నాయకత్వం ఆంధ్రప్రదేశ్‌లో కనిపిస్తున్నది.


ప్రధాని స్థాయి వ్యక్తి, ఇటువంటి విపత్తుల సందర్భంలో విశ్వసనీయ సమాచారం ఇవ్వగల వ్యవస్థగా పత్రికల ప్రాముఖ్యం గురించి చెబుతున్నా, కెసిఆర్‌ మంగళవారం నాటి పత్రికాసమావేశంలో మీడియావారిని ఇబ్బంది పెట్టవద్దని పోలీసులను అనేకమార్లు కోరినా, క్షేత్రస్థాయిలో మార్పు రాలేదు. ప్రభుత్వాధినేతలు చెప్పిన మాటలు, ఆ ప్రభుత్వయంత్రాంగంలోని వారే అర్థం చేసుకోలేకపోతే, ఇక సామాన్యులు ప్రభుత్వ ప్రయాసను అర్థం చేసుకోవడం లేదని, సహకరించడం లేదని బాధపడడం ఏమి సబబు? చివరకు వైద్యులను కూడా పోలీసులు వదలడం లేదు. లాక్‌డౌన్‌ బాధితులకు సహాయం చేయడానికి ప్రయత్నిస్తున్న ఒక సామాజిక కార్యకర్తను కూడా పోలీసులు తీవ్రంగా హింసించినట్టు వార్తలు వస్తున్నాయి. ఇది మంచి ధోరణి కాదు. లాక్‌డౌన్‌ కానీ, సుదీర్ఘకాలపు కర్ఫ్యూ కానీ, ప్రజలకు అలవాటైన పరిస్థితులు కావు. పోలీసులకు, అధికారయంత్రాంగానికీ కూడా అనుభవమున్న సందర్భాలు కావు. వీటి అమలులో తప్పనిసరిగా కొన్ని లోపాలు, అవకతవకలు, బాధాకరమైన సంఘటనలు జరుగుతాయి.


కానీ అవి అనివార్యమైనవి కావు. జరిగినవాటిని వెంటవెంటనే సరిదిద్దుకోవడం ద్వారా, ప్రక్రియను మెరుగుపరచడం సాధ్యపడుతుంది. దేశవ్యాప్త లాక్‌డౌన్‌ మొదలయి ఒకరోజే అయింది. తెలుగు రాష్ట్రాల్లో జనతాకర్ఫ్యూ నాటి నుంచి లాక్‌డౌన్‌ కొనసాగుతోంది. అయినా, నిత్యావసరాల లభ్యత గురించిన ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. తెల్లకార్డు దారులకు రేషను పంపిణీ ఇంకా ఆరంభం కాలేదు. జనంలో అనేక అనుమానాలు, సంశయాలు. ఇవన్నీ క్రమంగా సద్దుమణిగేవే. కానీ, నిర్వహణ సరిగా లేకపోతే, ఆశ్వాసనలో బలం లేకపోతే, గందరగోళానికి, ఒక్కోసారి శాంతిభద్రతల పరిస్థితులకు దారితీస్తాయి. హైదరాబాద్‌లో చదువుల కోసం, పరీక్షల తయారీకోసం, ఉద్యోగపరీక్షల కోసం హాస్టళ్లలో, పేయింగ్‌ హాస్టళ్లలోఉంటున్న వేలాది విద్యార్థులు అకస్మాత్‌ లాక్‌డౌన్‌ కారణంగా ఇబ్బందులు పడుతున్నారు. స్వగ్రామాలకు పోవడానికి, నగరంలోనే కొనసాగడానికి వీలులేని పరిస్థితి. అట్లాగే, హైదరాబాద్‌లో ఉంటున్న వలసకార్మికుల పరిస్థితి. వారికి రేషన్‌కార్డులు ఇక్కడ ఉండవు. ఇక హైదరాబాద్‌లో ఉంటున్న వేలాది శరణార్థుల పరిస్థితి ఏమిటో తెలియదు.


ఈ పరిస్థితిలో ప్రభుత్వమూ ఉదారంగా వ్యవహరించాలి, సమాజంలోని దాతలు, దాతృత్వ సంస్థలు ప్రభుత్వ పంపిణీల్లోని ఖాళీలను భర్తీచేసే ప్రయత్నం చేయాలి. 


ఈ కరోనా కట్టడి మహా ప్రయత్నంలో చాలా మందిని కలుపుకోవాలని కోరడం అందుకే.