Abn logo
Oct 24 2020 @ 05:18AM

ఏపీపీజీఈసెట్‌లో సత్తా

వివిధ విభాగాల్లో జిల్లా విద్యార్థులకు టాప్‌ ర్యాంకులు 


శ్రీకాకుళం,ఆంధ్రజ్యోతి, అక్టోబరు 23 : రాష్ట్రవ్యాప్తంగా ఇంజనీరింగ్‌, ఫార్మసీ పోస్టు గ్రాడ్యుయేషన్‌ (ఎంటెక్‌, ఎంఫార్మసీ) కోర్సుల్లో ప్రవేశాలు కల్పించేందుకు ఆంధ్రాయూనివర్సిటీ ఆధ్వర్యంలో ఇటీవల నిర్వహించిన ఏపీపీజీఈసెట్‌ ఫలితాలు శుక్రవారం వెలువడ్డాయి. ఇందులో వివిధ విభాగాల్లో జిల్లా విద్యార్థులు టాప్‌ ర్యాంకులను కైవసం చేసుకుని సత్తా చాటారు. శ్రీకాకుళం రీజనల్‌ సెంటర్‌ నుంచి 730 మంది దరఖాస్తు చేసుకోగా.. 603 మంది పరీక్షకు హాజరయ్యారు. 530 మంది(87.89శాతం) ఉత్తీర్ణత సాధించారు. మెటలర్జీ విభాగంలో 1, 2, 3 ర్యాంకులు, ఇన్‌స్ట్రుమెంటేషన్‌ విభాగంలో 1, 2, 5వ ర్యాంకులను, కంప్యూటర్‌ సైన్స్‌ అండ్‌ ఇన్‌ఫర్మేషన్‌ టెక్నాలజీ(సీఎస్‌) విభాగంలో ఫస్ట్‌ర్యాంకును జిల్లావాసులే సాధించడం ఆనందించదగ్గ విషయం. 


టాప్‌ ర్యాంకర్లు వీరే.. :  

బయో టెక్నాలజీ విభాగంలో.. శ్రీకాకుళం నగరం అరసవల్లి ప్రాంతానికి చెందిన మెండ జయశ్రీసాయి 2వ ర్యాంకు సాధించారు.

కెమికల్‌ ఇంజనీరింగ్‌ విభాగంలో శ్రీకాకుళం నగరం పీఎన్‌ కాలనీకి చెందిన రౌతు గౌరీశంకర్‌ 7వ ర్యాంకు సాధించారు. 

కంప్యూటర్‌ సైన్స్‌ అండ్‌ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ(సీఎస్‌) విభాగంలో రాగోలు ఆర్టీసీ కాలనీకి చెందిన జీవీవీఎస్‌ఆర్‌ఎల్‌డీవీపీ భరద్వాజ్‌ ఫస్ట్‌ ర్యాంక్‌ సాధించారు.

జియో-ఇంజనీరింగ్‌ అండ్‌ జియో- ఇన్ఫర్మేటిక్స్‌ విభాగంలో ఆమదాలవలస మండలం పార్వతీశ్వరునిపేట ప్రాంతానికి చెందిన మొజ్జాడ కార్తికేశ్వరబాబు 8వ ర్యాంకు సాధించారు. 

ఇన్‌స్ట్రుమెంటేషన్‌ ఇంజనీరింగ్‌ విభాగంలో సింగుపురం ప్రాంతానికి చెందిన పాతర్ల వినయ్‌సాయికుమార్‌ మొదటి ర్యాంకు, లావేరు మండలం పెద్దవీధికి చెందిన బాసిన స్వాతి 2వ ర్యాంకు, పలాస కాశీబుగ్గలో వివేకానంద కాలనీకి చెందిన తాళపద్ర సాయిప్రశాంత్‌ 5వ ర్యాంకు సాధించారు. 

మెటలర్జీ విభాగంలో శ్రీకాకుళం నగరం వంశధార కాలనీకి చెందిన రత్నాల సాయిజశ్వంత్‌ మొదటి ర్యాంకును, బలగలో బుచ్చిపేటకు చెందిన పోతురాజు కావ్య 2వ ర్యాంకును, టెక్కలిలో సాల్ట్‌ లేబర్‌ కాలనీకి చెందిన షావుకారి నాగమణి 3వ ర్యాంకు సాధించారు. 

Advertisement
Advertisement