Abn logo
Jun 4 2020 @ 02:34AM

పంచాయతీ భవనాలకు.. వైసీపీ రంగులు తొలగించాల్సిందే!

  • ఏపీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు ఆదేశం
  • నాలుగు వారాలు గడువిస్తున్నాం
  • హైకోర్టు తీర్పులో ఎలాంటి సందిగ్ధం లేదు
  • అందులో మేం జోక్యం చేసుకోనక్కర్లేదు
  • కోర్టు తీర్పులను ప్రభుత్వం పాటించి తీరాలి
  • లేదంటే చట్టపాలనకే విఘాతం: బెంచ్‌
  • సీఎస్‌పై ధిక్కరణ చర్యలు నిలిపివేత

గ్రామ పంచాయతీ భవనాలకు ఏ పార్టీ పతాకాన్నీ పోలిన రంగులు వేయరాదని హైకోర్టు ఇచ్చిన ఆదేశాల్లో ఎలాంటి సందిగ్ధతా లేదు. హైకోర్టు తీర్పులో మేం జోక్యం చేసుకోవలసిన అవసరం లేదు.

తన ఆదేశాలను తప్పుదోవ పట్టించేందుకు ప్రతివాదులు ఉద్దేశపూర్వకంగా ప్రయత్నించారని హైకోర్టు కరెక్టుగానే చెప్పింది.

కోర్టుల తీర్పులే అంతిమం. వాటిని పాటించాల్సిందే. అమలు చేసేందుకు నిరాకరిస్తే.. చట్టపాలనకే విఘాతం కలుగుతుంది. న్యాయవ్యవస్థపై ప్రజల విశ్వాసం సన్నగిల్లుతుంది.

హైకోర్టు మార్చి 10న ఇచ్చినదే తుది తీర్పు. దానిని కచ్చితంగా అమలు చేసి తీరాలి. గ్రామ పంచాయతీ భవనాలకు వేసిన రంగులను నేటి నుంచి నాలుగు వారాల్లో తొలగించాలి.

- సుప్రీంకోర్టు

న్యూఢిల్లీ, జూన్‌ 3 (ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్‌లో గ్రామ పంచాయతీ భవనాలకు వేసిన వైసీపీ జెండాను పోలిన రంగులను తొలగించాల్సిందేనని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఇందుకు రాష్ట్రప్రభుత్వానికి నాలుగు వారాల గడువిచ్చింది. దీనికి సంబంధించి రాష్ట్ర హైకోర్టు ఇచ్చిన తీర్పులో ఎలాంటి సందిగ్ధం లేదని తేల్చిచెప్పింది. కోర్టు తీర్పులను తప్పనిసరిగా పాటించాలని.. లేదంటే ప్రజల్లో న్యాయవ్యవస్థపై విశ్వాసం సన్నగిల్లుతుందని స్పష్టం చేసింది.


పంచాయతీ భవనాలకు వేసిన వైసీపీ పతాకంలోని మూడు రంగులను మూడు వారాల్లో తొలగించాలని రాష్ట్ర హైకోర్టు మార్చి 10వ తేదీన తీర్పు ఇచ్చింది. దానికి విరుద్ధంగా.. ఉన్న మూడు రంగులకు అదనంగా మట్టి రంగు వేయాలని రాష్ట్రప్రభుత్వం 622, 623 జీవోలను జారీచేయడంతో హైకోర్టు ఆగ్రహించి వాటిని కొట్టివేసిన సంగతి తెలిసిందే. ఈ తీర్పును సవాల్‌ చేస్తూ రాష్ట్రప్రభుత్వం సుప్రీంకోర్టులో దాఖలు చేసిన స్పెషల్‌ లీవ్‌ పిటిషన్‌పై జస్టిస్‌ లావు నాగేశ్వరరావు, జస్టిస్‌ కృష్ణ మురారి, జస్టిస్‌ ఎస్‌.రవీంద్ర భట్‌లతో కూడిన త్రిసభ్య ధర్మాసనం బుధవారం విచారణ జరిపింది. ఈ జీవోలను అమలు చేయకముందే రిట్‌ పిటిషన్‌ వేయడం సరికాదన్న రాష్ట్రప్రభుత్వం తరపు సీనియర్‌ న్యాయవాది పీఎస్‌ నరసింహ వాదనతో తాము ఏకీభవించడం లేదని స్పష్టం చేసింది. హైకోర్టు తీర్పు చాలా స్పష్టంగా ఉందని తేల్చిచెప్పింది. ‘ఈ అంశాన్ని జాగ్రత్తగా పరిశీలించాం. హైకోర్టు తీర్పులో జోక్యం చేసుకోవలసిన అవసరమే లేదని అభిప్రాయపడుతున్నాం. ఏ రాజకీయ పార్టీ పతాకాన్నీ పోలిన రంగులను పంచాయతీ భవనాలకు వేయరాదని మార్చి 10న హైకోర్టు ఇచ్చిన ఈ తీర్పులో ఎలాంటి సందిగ్ధతా లేదు. తన ఆదేశాలను తప్పుదోవ పట్టించేందుకు ప్రతివాదులు ఉద్దేశపూర్వకంగా ప్రయత్నించారని హైకోర్టు కరెక్టుగానే చెప్పింది. కార్యనిర్వాహక శాఖ ఆదేశాలు న్యాయసమీక్ష పరిధిలోకే వస్తాయి. కోర్టుల తీర్పులే అంతిమం. వాటిలో ఇచ్చిన ఆదేశాలను తప్పనిసరిగా పాటించాల్సిందే. వాటి అమలును నిరాకరిస్తే.. చట్టపాలనకే విఘాతం కలుగుతుంది. తీర్పులను అమలు చేయకుంటే న్యాయవ్యవస్థపై ప్రజల విశ్వాసమే సన్నగిల్లుతుంది’ అని ధర్మాసనం హెచ్చరించింది. హైకోర్టు మార్చి 10న ఇచ్చినదే తుది తీర్పు అని తేల్చిచెప్పింది. దీనిని అమలు చేయకుండా తప్పించుకోవడానికి.. తీర్పులోని ఆదేశాలను సంపూర్ణంగా ఉల్లంఘిస్తూ రాష్ట్రప్రభుత్వం 622, 623 జీవోలు ఇచ్చిందన్న హైకోర్టు నిర్ధారణలను ఆమోదిస్తున్నామని తెలిపింది. ఈ నేపథ్యంలో హైకోర్టు తీర్పు మేరకు పంచాయతీ భవనాలకు వేసిన రంగులను బుధవారం నుంచి 4 వారాల్లో తొలగించాలని ఆదేశించింది. 


మీరు రంగులు వేసేదాకా వేచిచూడాలా?

అంతకుముందు సీనియర్‌ న్యాయవాది నరసింహ వాదనలు వినిపిస్తూ.. మట్టి రంగు జోడిస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసినా.. ఇంకా రంగులు వేయలేదని తెలిపారు. దీనికి ధర్మాసనం తీవ్రంగా స్పందించింది. ‘జీవో అయితే ఇచ్చారు కదా..! మీరు రంగులు వేసే దాకా వేచిచూడాలా..’ అని నిలదీసింది. ‘మట్టి రంగు జోడించినంత మాత్రాన రంగులు మార్చినట్లు కాదు. ఇది హైకోర్టు ఉత్తర్వులను అమలు చేయకుండా ఉండేందుకు అన్వేషించిన తెలివైన మార్గం. ఒక వ్యవస్థ తన విధులను చట్టపరంగా నిర్వర్తించకపోతే కోర్టులు జోక్యం చేసుకోవచ్చు. హైకోర్టు ఒకసారి ఉత్తర్వులిచ్చిన తర్వాత వాటిని అమలు చేయాల్సిందే’ అని స్పష్టం చేసింది. 


గడువులోపే ధిక్కార పిటిషన్‌ 

సీఎ్‌సతో పాటు ఇతర అధికారులపై హైకోర్టు ప్రారంభించిన కోర్టు ధిక్కరణ చర్యల గురించి నరసింహ ప్రస్తావించారు. రంగుల తొలగింపునకు హైకోర్టు తమకిచ్చిన గడువులోపే ధిక్కార పిటిషన్‌ దాఖలు చేశారని తెలిపారు. లాక్‌డౌన్‌ ఎత్తేసిన తర్వాత మూడు వారాల్లో రంగులు తొలగించాలని న్యాయస్థానం గడువిచ్చిందని.. అది ఇంకా ముగియలేదని పేర్కొన్నారు. అయితే రెండు వారాల్లో రంగులు తొలగిస్తామంటే.. ధిక్కరణ చర్యలను నిలిపివేసే అంశాన్ని పరిశీలిస్తామని సుప్రీంకోర్టు ధర్మాసనం తెలిపింది. అయితే మరింత గడువు కావాలని, కనీసం నాలుగు వారాల సమయమైనా ఇవ్వాలని నరసింహ విజ్ఞప్తి చేయగా.. అందుకు కోర్టు అంగీకరించింది. బుధవారం నుంచి నాలుగు వారాల్లో రంగులు తొలగించాలని ఆదేశిస్తూ సీఎస్‌, ఇతర అధికారులపై హైకోర్టులో కోర్టు ధిక్కరణ చర్యలను నిలిపివేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.


ఆ ఖర్చు వైసీపీ భరించాలి: చంద్రబాబు

‘‘రాష్ట్రంలో ప్రభుత్వ కార్యాలయాలకు మూడు రంగులు వేసి మళ్ళీ వాటిని చెరపడానికి అయ్యే ఖర్చును వైసీపీ నుంచే వసూలు చేయాలి. గతంలో కోర్టులు కూడా ఇదే చెప్పాయి. వృఽథా చేసిన ప్రజా ధనాన్ని వైసీపీ నుంచి, అలాగే వాళ్ళ తప్పులకు తందాన అన్న అధికారుల నుంచీ రాబట్టాలి.’’ అని టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు డిమాండ్‌ చేశారు.  ఈ మేరకు ఆయన బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. 



Advertisement
Advertisement
Advertisement