Advertisement
Advertisement
Abn logo
Advertisement

ఆర్రోజులైనా పరిహారమేదీ?

ప్రభుత్వ తీరు బాధ కలిగిస్తోంది.. ఇచ్చేదాకా ప్రభుత్వంపై పోరాటం

అసెంబ్లీ సమావేశాలు రద్దుచేసి బాధితులను ఆదుకునే ఆలోచనే లేదు

నేనే సీఎంగా ఉండి ఉంటే తిరుపతిలోనే ఉండి పరిస్థితిని చక్కదిద్దేవాడిని

నా కుటుంబాన్ని నిండు సభలో అవమానించారు

దుఃఖాన్ని దిగమింగుకుని ప్రజల కోసమే వచ్చా.. చిత్తూరులో చంద్రబాబు 

ముఖ్యమంత్రిపై చంద్రబాబు ఫైర్‌

చిత్తూరు జిల్లా వరద ప్రాంతాల్లో పర్యటన


తిరుపతి/నెల్లూరు, నవంబరు 24 (ఆంధ్రజ్యోతి): వరదలొచ్చి ఆర్రోజులు గడచినా ఇప్పటికీ బాధితులకు పరిహారం అందలేదని టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు ధ్వజమెత్తారు. పలు జిల్లాల్లో వరదల ప్రభావం ఎక్కువగా ఉన్న నేపథ్యంలో అసెంబ్లీ సమావేశాలను రద్దు చేసి, అందరం వెళ్లి బాధితులను ఆదుకుందామన్న మాటే లేకుండా సమావేశాలను కొనసాగించడం బాధ కలిగిస్తోందన్నారు. వరదల వల్ల పంటలు, ఆస్తులు కోల్పోయిన వారికి నష్టపరిహారం అందేవరకూ ప్రభుత్వంతో పోరాడతానని భరోసా ఇచ్చారు. బుధవారం ఆయన చిత్తూరు జిల్లా ఏర్పేడు, తిరుపతి రూరల్‌, రామచంద్రాపురం, తిరుపతి అర్బన్‌ మండలాల్లోని వర్షాలు, వరద పీడిత ప్రాంతాల్లో పర్యటించారు. బాధితులను పరామర్శించి ఽవారిలో ధైర్యం నింపే ప్రయత్నం చేశారు. ఏర్పేడు మండలం పాపానాయుడుపేట, తిరుపతి రూరల్‌ మండలం తిరుచానూరు, రామచంద్రాపురం మండలం రాయలచెరువు తదితర ప్రాంతాల్లో ప్రజలనుద్దేశించి మాట్లాడారు. ‘నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు హుద్‌హుద్‌ తుఫాను సంభవిస్తే విశాఖలోనే మకాం వేసి వారం రోజుల్లో మళ్లీ మామూలు స్థితికి తీసుకొచ్చాను. ఇప్పుడు వర్షాలకు తిరుచానూరు బ్రిడ్జి కూలిపోయింది. 30 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ఈ ప్రభుత్వం ఏమైనా స్పందిస్తోందా? ప్రజావేదికతో మొదలుపెట్టి రెండున్నరేళ్లుగా రాష్ట్రమంతా విధ్వంసం కొనసాగిస్తోంది. అదే నేను గనుక ఇప్పుడు సీఎంగా ఉండి ఉంటే తిరుపతిలోనే మకాం వేసేవాడిని. పరిస్థితిని వెంటనే చక్కదిద్దేవాడిని’ అని చెప్పారు. ఎన్నికల ముందు అమరావతే ముద్దని చెప్పిన ముఖ్యమంత్రి తర్వాత మూడు రాజధానుల ప్రతిపాదన తెచ్చారని, ఇప్పుడు మళ్లీ ఆలోచిస్తున్నామంటూ రోజుకో రకంగా రాజధాని గురించి మాట్లాడుతున్నారని చంద్రబాబు మండిపడ్డారు. పరిపాలనానుభవం లేకపోతే ఇలాగే మాట్లాడతారన్నారు. ‘కొండపల్లి మున్సిపల్‌ ఎన్నికల్లో టీడీపీ గెలిచింది. ఎక్స్‌ అఫిషియో సభ్యుడు కూడా టీడీపీ వారే ఉన్నారు. అయినా చైర్మన్‌ ఎన్నిక జరగకుండా వైసీపీ వాళ్లు అడ్డుకున్నారు. కోర్టు ఆదేశాలతో ఎన్నికలు నిర్వహించారు. ప్రభుత్వ తీరు ఎంత దారుణంగా ఉందో మీరే చూడండి’ అని ప్రజలకు సూచించారు. ఇవన్నీ గుర్తు పెట్టుకుని టీడీపీకి మద్దతివ్వాలని కోరారు.


దుఃఖాన్ని దిగమింగుకుని వచ్చా... 

తన అనుభవమంత వయసు కూడా లేని జగన్‌ అసెంబ్లీలో తనను అవహేళన చేసి మాట్లాడుతున్నారని చంద్రబాబు ఆవేదన వ్యక్తంచేశారు. తన భార్య భువనేశ్వరిని కూడా అసెంబ్లీలో సీఎంతో పాటు వారి మంత్రులు, ఎమ్మెల్యేలు అసభ్య పదజాలంతో మాట్లాడారని వాపోయారు.  ‘భువనేశ్వరికి భర్తగా, కుటుంబానికి పెద్దగా అసెంబ్లీలో జరిగిన అవమానానికి కుంగి పోవాల్సి వచ్చింది. మీరే అలా కుంగిపోతే మా పరిస్థితేంటని ఎంతోమంది పెద్దలు సర్దిచెప్పారు. అయినా నేనూ మనిషినే కదా.. నాకూ కుటుంబం ఉంది కదా అని అన్నాను. నిండుసభలో ఇలా మాట్లాడడం అవమానంగా భావించి కొంత దుఃఖానికి లోనయ్యాను. కానీ ఈ ప్రభుత్వాన్ని ఇలాగే విడిచిపెట్టేస్తే ప్రజలను నానా రకాలుగా ఇబ్బంది పెడతారని గ్రహించి.. దుఖాన్ని దిగమింగుకుని బాధితులను పరామర్శించడానికి వచ్చాను’ అని తెలిపారు.


రాయలచెరువుకు వెళ్లకుండా..

రేణిగుంట వై కన్వెన్షన్‌ హాలులో బుధవారం ఉదయం జిల్లా టీడీపీ నేతలు ఏర్పాటు చేసిన వరద బాధిత ప్రాంతాలు, ప్రజల ఇబ్బందులకు సంబంధించిన ఫొటో ఎగ్జిబిషన్‌ను చంద్రబాబు సందర్శించారు. అనంతరం అక్కడ నుంచి బయల్దేరి ఏర్పేడు మండలం పాపానాయుడు పేట చేరుకున్నారు. స్వర్ణముఖి నదిపై కూలిపోయిన వంతెనను, పక్కనే నీటి ఉధృతికి పంటలు కొట్టుకుపోయిన పొలాలను పరిశీలించారు. బాధిత రైతులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. నష్టపరిహారం త్వరగా ఇప్పించాలని మహిళా రైతు ప్రభావతి కాళ్లమీద పడబోగా చంద్రబాబు వారించారు. పరిహారం ఇప్పించే దాకా నిద్రపోనని, ప్రభుత్వంపై పోరాడి పరిహారం అందేలా చూస్తానని హామీ ఇచ్చారు. అనంతరం పాపానాయుడుపేట బస్టాండు కూడలి చేరుకుని ప్రజలనుద్దేశించి మాట్లాడారు. ఆపై తిరుపతి రూరల్‌ మండలం తిరుచానూరు చేరుకుని స్వర్ణముఖి నదిపై కూలిపోయిన పాడిపేట బ్రిడ్జిని పరిశీలించారు. ఆ తర్వాత రామచంద్రాపురం మండలంలో ప్రమాదకర స్థితికి చేరుకున్న రాయలచెరువు కట్ట చేరుకుని మరమ్మతు పనులను పరిశీలించారు. అయితే చెరువు కట్ట ప్రమాదకర స్థితిలో ఉందని పోలీసులు తొలుత చంద్రబాబును, మీడియాను మాత్రమే అనుమతించారు. కానీ పోలీసుల ఆంక్షలను లెక్కచేయకుండా ఆ ప్రాంతవాసులు భారీగా తరలివచ్చారు. ధైర్యంగా చంద్రబాబు కోసం చెరువు కట్టపైకి చేరుకున్నారు. అనంతరం తిరుపతి చేరుకుని మహిళా యూనివర్సిటీ, ముత్యాలరెడ్డిపల్లి, లక్ష్మీపురం కూడలి, ఆటోనగర్‌ ప్రాంతాల్లో పర్యటించి వరద నష్టాలను పరిశీలించారు. ఎన్టీదర్‌ ట్రస్టు పరంగా కూడా వీలైన మేరకు సాయం అందిస్తామని భరోసా ఇచ్చారు. పర్యటన ముగించుకుని రాత్రికి తిరిగి రేణిగుంటలోని వై కన్వెన్షన్‌ సెంటర్‌ చేరుకుని అక్కడే బసచేశారు. గురువారం  నెల్లూరు జిల్లా పర్యటనకు బయల్దేరతారు. 


ఇక ఢీ అంటే ఢీ అనేవారికే!

ఇకపై రాజకీయ ప్రత్యర్థులతో ఢీ అంటే ఢీ అనేలా వ్యవహరించేవారికే పార్టీలో ప్రాధాన్య మిస్తానని చంద్రబాబు అన్నారు. రేణిగుంటలో బుధవారం ఉదయం తనను కలిసిన  పలువురు టీడీపీ ముఖ్య నేతలకు ఈ విషయం తేల్చిచెప్పారు. కాగా, వరద ప్రాంతాల్లో పర్యటించి బాధితులకు భరోసా ఇచ్చేందుకు చంద్రబాబు తన సొంత జిల్లాలో పర్యటించినప్పటికీ.. ఆయన్ను చూసేందుకు జిల్లా నలుమూలల నుంచీ కార్యకర్తలు, నాయకులు రేణిగుంటకు తరలి వచ్చారు. గంటన్నర ఆలస్యంగా ఉదయం 11 గంటలకు బస్సులో నుంచి వెలుపలికి వచ్చే వరకూ నినాదాలు చేస్తూ నిరీక్షించారు. 


  1. ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు ప్రభుత్వం అప్రమత్తంగా ఉంటే ప్రాణ, ఆస్తి నష్టాలు తగ్గుతాయి. నిర్లక్ష్యం, చేతగానితనంతో ఉంటే సమస్యలు పెరుగుతాయి.
  2. అవినీతి, రౌడీయిజంతో.. బయటి వ్యక్తులను తీసుకొచ్చి దొంగ ఓట్లు వేయించి చిన్న మున్సిపాలిటీ అయిన కుప్పంలో గెలిచి పెద్ద పుడింగుల్లా మేం చంద్రబాబును ఓడించామని చెప్పుకొంటున్నారు.
  3. దివంగత ఎన్టీఆర్‌, నేనూ 22 ఏళ్లు ముఖ్యమంత్రులుగా రాష్ట్రానికి సేవలు అందించాం. ఏనాడూ నా భార్య రాజకీయాల్లో జోక్యం చేసుకోలేదు. అలాంటి ఆమెను కూడా సభలో అసభ్యంగా మాట్లాడడం చాలా బాధ కలిగించింది.
  4. - చంద్రబాబు
Advertisement
Advertisement