Abn logo
Oct 19 2020 @ 05:36AM

ములాఖత్‌ల కోసం...

ఏడు నెలలుగా అయిన వారితో మాట్లాడుకోలేని పరిస్థితి

కడప కేంద్ర కారాగారంలో 750 మంది ఎదురుచూపు

విడుదలలో జాప్యంపై ఆవేదన


కడప(సిటీ), అక్టోబరు 18: కరోనా మహమ్మారి ప్రభావం ఖైదీలను వదలడం లేదు. వైరస్‌ బారిన పడకుండా జైలు అధికారుల సూచనలతో స్వీయ జాగ్రత్తలు తీసుకుంటున్న ఖైదీలు తమ తమ కుటుంబ సభ్యుల ఆరోగ్యంపై ఆందోళనలో ఉన్నారు. ములాఖత్‌ (అయిన వారిని కలుసుకోవడం) ఉంటే సాదక బాధలు పరస్పరం చర్చించుకునేవారు. కరోనా కట్టడిలో భాగంగా మార్చి 23 నుంచి లాక్‌డౌన్‌ నేపధ్యంలో ములాఖత్‌లు నిలిపివేశారు. దీంతో ఏడు నెలలుగా అయిన వారిని చూసుకోలేక, మనసు విప్పి మాట్లాడుకోలేక ఆవేదనతో గడుపుతున్నారు. సడలింపుల్లో భాగంగా కొవిడ్‌ నిబంధనలు అమలు చేస్తూ తమకు ములాఖత్‌ అవకాశం కల్పించాలని  కోరుకుంటున్నారు. బెయిలుపై బయటికి వచ్చే వారి మాటలను బట్టి ములాఖత్‌ల కోసం ఖైదీలు చెందుతున్న ఆవేదన వెలుగులోకి వస్తోంది. కడప సెంట్రల్‌ జైలులో దాదాపు 750 మంది ఖైదీలు ములాఖత్‌ కోసం ఎదురు చూస్తున్నారు. ఇదిలా ఉంటే సత్ప్రవర్తన కింద విడుదలలో జాప్యం అవుతుండడంతో అర్హులమని భావిస్తున్న ఖైదీలు మరింత ఆవేదన చెందుతున్నట్లు తెలుస్తోంది. శిక్ష పడ్డ, రిమాండుకు గురైన ఖైదీలకు వారి వారి కుటుంబ సభ్యులు, బంధువులకు జైలు ఆవరణంలోనే కలుసుకునేందుకు ములాఖత్‌ అమలు చేస్తున్నారు. శిక్ష పడ్డ ఖైదీలకు 15 రోజులకొకసారి 45 నిమిషాల పాటు జైలు నిబంధనల మేర కలుసుకోవచ్చు. అలాగే రిమాండ్‌ ఖైదీలైతే వారానికి రెండురోజుల పాటు ములాఖత్‌ అవకాశం ఉంటుంది. ములాఖత్‌కు రావాలంటే ఖైదీ సంబంధిత బంధువులు తమ బంధుత్వ వివరాలు తెలుపుతూ ఆధార్‌కార్డులను సమర్పించాల్సి ఉంటుంది. ఒక్కో ఖైదీకి సంబంధించి పెద్దలు ముగ్గురికి మాత్రమే ములాఖత్‌లో అవకాశం కల్పిస్తారు. పిల్లల విషయంలో మినహాయింపు ఉంటుంది. జైలు సెలవు దినాలు మినహా మిగతా రోజుల్లో జైలు నిబంధనల మేర ములాఖత్‌ సమయం ఖరారు చేస్తారు. ఈ ప్రక్రియ నిరంతరం కొనసాగుతూ వస్తుంది. కాగా కరోనా కట్టడిలో భాగంగా ఏడు నెలలుగా ములాఖత్‌లకు బ్రేక్‌ పడింది.


ములాఖత్‌తో ఒంటరితనం నుంచి ఉపశమనం

బెయిలుపై వచ్చిన వారి మాటలను బట్టి ములాఖత్‌ నిషేధంపై ఖైదీలు ఆవేదనతో ఉన్నట్లు స్పష్టమవుతోంది. కరోనా కట్టడి సడలింపులు అన్ని వర్గాలకు, రంగాలకు కల్పించారు. మా విషయంలో మాత్రం కరుణ చూపడం లేదు. మాస్కులు ధరించడం, భౌతిక దూరం పాటించడం లాంటి నిబంధనలు అమలు చేస్తూ మరికొన్ని సడలింపులతో ములాఖత్‌ అవకాశాలు కల్పించాలని కోరుకుంటున్నారు. నెలలో ఒకసారో, రెండుసార్లో అయిన వారిని కలిసి కాసేపు మాట్లాడుకుంటే ఒంటరితనం నుంచి కాసేపు ఉపశమనం పొందుతామంటూ చెప్పుకొస్తున్నారు. శిక్ష పడ్డ ఖైదీలు ములాఖత్‌పై మరింత ఆవేదనతో ఉన్నారు. పదిహేను రోజులకొకసారి ఫోనులో మాట్లాడే అవకాశం ఉన్నా సమయం అతి తక్కువగా ఉండడం వల్ల మాట్లాడినట్లుగా ఉండడం లేదని, ఎదురుగా చూస్తూ మాట్లాడుకుంటే కుటుంబ విషయాలు చర్చించుకునే అవకాశం ఉంటుందని తమ ఆవేదనను, ఆతృతను వెల్లబోసుకుంటున్నారు.


750 మంది ఖైదీల ఎదురు చూపులు

సెప్టెంబరు చివరి తేదీ నాటికి కడప కేంద్ర కారాగారంలో జీవిత ఖైదు పడ్డ 467తో పాటు ఇతర శిక్షలు పడ్డ 79 మంది ఉన్నారు. అప్పటికి రిమాండు ఖైదీల సంఖ్య 196గా ఉంది. అయితే ఈ సంఖ్య రోజురోజుకూ మారుతుంటుంది. ప్రస్తుతం దాదాపు 750 మంది ఖైదీలు ఉన్నట్లు తెలుస్తోంది. వీరందరూ ములాఖత్‌ల కోసం ఎదురు చూస్తున్నారు. జైళ్లకు కూడా సడలింపులు వస్తాయని వారంతా ఆశతో ఉన్నారు. ఇదిలా ఉంటే సత్ప్రవర్తన కింద విడుదలకు సంబంధించి జీవో విడుదల కాకపోవడం, జాప్యం అవుతుండడంతో ఆశావహ ఖైదీల బంధువులు అసంతృప్తికి గురవుతున్నారు. ములాఖత్‌, విడుదలపై ప్రభుత్వం కరుణ చూపాలని కోరుతున్నారు. ఈ విషయమై జైలు సూపరింటెండెంట్‌ రవికిరణ్‌ స్పందిస్తూ ములాఖత్‌పై ప్రభుత్వ ఆదేశాల మేరకు ముందుకు పోతామన్నారు. ములాఖత్‌లపై సానుకూల నిర్ణయం వస్తే తేదీ, సమయాలను అధికారికంగా వెల్లడిస్తామని తెలిపారు. 

Advertisement
Advertisement