Abn logo
Oct 19 2020 @ 05:34AM

ఉపాధి బిల్లులకు రాజకీయ రంగు

పనులు పూర్తయినా నిధులివ్వని ప్రభుత్వం

రెండేళ్లుగా అందని బిల్లులు

కాంట్రాక్టర్లలో అధిక శాతం సామాన్యులే

పెండింగ్‌ బిల్లులు రూ.109 కోట్లు


టీడీపీ హయాంలో ఉపాధి హామీ పథకం నిధులు సమర్థవంతంగా వినియోగించుకున్నారు. గ్రామాల్లో సీసీ రోడ్లు, పాఠశాలల ప్రహరీలు, అంగన్వాడీ భవనాలు, స్మశానాలు, మినీ గోకులాలు, ఆటస్థలాల అభివృద్ధి, చెక్‌డ్యాంలు, పండ్ల తోటల పెంపకం తదితర వాటిని చేపట్టారు. 2018-19 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి 109 కోట్ల 53 లక్షలా 49 వేల 690 రూపాయలు బకాయిలు రావాల్సి ఉంది. ప్రస్తుత ప్రభుత్వం మాత్రం బిల్లులు పెండింగ్‌ పెట్టింది. దీంతో కాంట్రాక్టర్లు ఇబ్బంది పడుతున్నారు. 


(కడప - ఆంధ్రజ్యోతి): గత ప్రభుత్వ హయాంలో చేపట్టిన పనులకు, నిర్మాణం పూర్తయిన గృహాలు, పాఠశాలల ప్రహరీలు ఇలా ఏదైనా సరే.. ప్రభుత్వాలు మారితే అధికారంలో ఉన్న ప్రభుత్వం చెల్లించడం జరుగుతుంది. ఏవైనా అక్రమాలు చోటు చేసుకుంటే విచారణ జరిపి నిధులు ఇస్తుంటారు. అయితే ప్రస్తుత ప్రభుత్వం మాత్రం అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తోందనే విమర్శ ఉంది. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా గత ప్రభుత్వ హయాంలో చేపట్టిన పనులకు ఇంతవరకు బిల్లులు ఇవ్వలేదు. అప్పట్లో టీడీపీ నేతలే పనులు చేశారన్న సాకుతో బిల్లులు ఇవ్వడం లేదన్న విమర్శలున్నాయి. కోటి.. రెండు కోట్లు కాదు.. రూ.109 కోట్లు కాంట్రాక్టర్లకు అందాల్సి ఉంది. అదీకాక పనులు చేసిన వారంతా సామాన్యులు కావడం గమనార్హం. ఈ పనులను కొన్నిచోట్ల వైసీపీ సానుభూతిపరులు కూడా చేపట్టారు. అయితే బిల్లులు రాకపోవడంతో కాంట్రాక్టర్ల పరిస్థితి దయనీయంగా మారుతోంది. బిల్లులు ఎప్పుడు మహాప్రభో... అంటూ ఎదురు చూడాల్సిన దుస్థితి నెలకొంది.


రాజకీయ రంగు

ఉపాధి హమీ పథకం పనుల్లో పెద్ద ఎత్తున అక్రమాలు చోటు చేసుకున్నాయంటూ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వైసీపీ ఆరోపిస్తూ వచ్చింది. అధికారం చేపట్టిన వెంటనే బిల్లులు చెల్లించకుండా కాలయాపన చేస్తూ వచ్చింది. అక్రమాలు జరిగాయంటూ విజిలెన్స్‌ విచారణకు ఆదేశించింది. బిల్లుల కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల దృష్టికి తేవడంతో పాటు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. బకాయిలు చెల్లించమని కోర్టు చెప్పినప్పటికీ ప్రభుత్వం మాత్రం లైట్‌ తీసుకుంటోంది. పనుల్లో అక్రమాలు జరిగి ఉండి ఉంటే చర్యలు తీసుకోవాలి తప్ప అందరికీ బిల్లులు నిలిపివేయడమేంటనే ప్రశ్న తలెత్తుతోంది. ప్రభుత్వంపై నమ్మకంతో పాడి రైతులు అప్పులు చేసి మరీ మినీ గోకులాల నిర్మాణాలను చేపట్టారు. ఇంతవరకూ బిల్లులు రాకపోవడంతో పాడి రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పనులు చేసిన కాంట్రాక్టర్లు అయితే కార్యాలయాల చుట్టూ తిరిగి అలసిపోయారు. 


పేరుకుపోయిన బకాయిలు

పంచాయతీరాజ్‌, పశు సంవర్థకశాఖ, అటవీశాఖ, డీఆర్‌డీఏ తదితర శాఖల ద్వారా పనులు చేపట్టారు. సీసీ రోడ్లకు సంబంధించి 71 కోట్ల 32 లక్షలా 39 వేల 658 రూపాయలు బకాయిలు రావాల్సి ఉంది. గోకులాలకు సంబంధించి 17 కోట్ల 15 లక్షలా 25 వేల 983, నీటి సంరక్షణ పథకం పనులకు సంబంధించి రూ.16 కోట్ల 49 లక్షలా 30 వేల 61, పండ్ల తోటలకు రూ.27.71 కోట్లు, అంగన్వాడీ, పాఠశాలల కాంపౌండు తదితర వాటికి మరో రూ.16 కోట్లకు పైగా బకాయిలు రావాల్సి ఉంది. అప్పట్లో పనులు పూర్తి చేయాలంటూ జిల్లా యంత్రాంగం వెంటబడింది. ఎన్నికల సమయం కావడంతో కాంట్రాక్టర్లు కూడా అప్పులు చేసి పనులు పూర్తి చేశారు. అయితే ఇప్పటికే పనులు పూర్తయి రెండేళ్లయినా తిరిగి చిల్లిగవ్వ ఇవ్వలేదు. బిల్లుల కోసం ప్రభుత్వంపై ఒత్తిడి చేసేందుకు టీడీపీ ఉద్యమానికి సిద్ధమవుతోంది. కరోనా తగ్గిన వెంటనే ప్రభుత్వ కార్యాలయాలకు తాళాలు వేసి నిరసన తెలుపుతామని ఇప్పటికే టీడీపీ కడప పార్లమెంటు అధ్యక్షుడు లింగారెడ్డి ప్రకటించారు. మొత్తానికి ఉపాధి పనుల బిల్లులకు రాజకీయ రంగు తోడవడంతో పనులు చేసిన వారు ఇబ్బందులు పడుతున్నారు.

Advertisement
Advertisement