Abn logo
Oct 19 2020 @ 05:35AM

చేనేత...అరకొర చేయూత

గత ప్రభుత్వాల పథకాలు రద్దు

కొందరికే నేతన్న నేస్తం

అవస్థలు పడుతున్న కార్మికులు


కడప (నాగరాజుపేట), అక్టోబరు 18: వృత్తినే నమ్ముకుని జీవనం కొనసాగిస్తున్న చేనేత కార్మికులు ఇటు కరోనా, అటు ముడిసరుకుల ధరలు పెరగడంతో ఉపాధి లేక చితికిపోతున్నారు. చేనేతలను ఆదుకునేందుకు గత ప్రభుత్వాలు ప్రవేశపెట్టిన కొన్ని సంక్షేమ పథకాలు ఈ ప్రభుత్వంలో రద్దయ్యాయి. నేతన్న నేస్తం పథకం కొందరికే వర్తించిందని తమకు అందలేదని కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం గతంలో చేపట్టిన సర్వే ప్రకారం జిల్లాలో దాదాపు 28 వేల చేనేత కుటుంబాలు ఉన్నాయి. వీరంతా కులవృత్తినే నమ్ముకుని రాత్రింబవళ్లు కష్టపడి పోగుకుపోగు అతికించి నేసిన వస్త్రాలు అమ్ముకుని జీవనం సాగిస్తున్నారు. ఎక్కువ వర్షాలు, కరోనా వంటి విపత్తులు వచ్చినా వీరి జీవనం అంధకారమే. వర్షాకాలంలో మగ్గాలు నేసుకోవడానికి షెడ్లు లేక, ఇతర పనులు దొరక్క చాలామంది మగ్గాలు మూలనపడవేసి అవస్థలు పడుతున్నారు. కార్మికుల సంక్షేమానికి ఏర్పాటు చేసుకున్న 193 సొసైటీల్లో కొన్నింటిలో అవినీతి పేరుకుపోయింది. అయినవారికి ఆకుల్లో, కానివారికి కంచాల్లో అన్న చందంగా మారింది. 


గత ప్రభుత్వ పథకాలు కనుమరుగు

దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి హయాంలో ముడిసరుకుకు కిలోపై రూ.600 రాయితీ వచ్చేది. చంద్రబాబు హయాంలో 600 నుంచి రూ.1000 పెంచారు. ప్రస్తుతం ఈ పథకం మూలనపడింది. కార్మికులకు షెడ్లు ఇస్తామని పెట్టిన పథకం ఊసేలేదు. కేంద్రం 70 శాతం, రాష్ట్రం 20 శాతం, 10 శాతం లబ్ధిదారుని వాటాలో గ్రూపు రుణాల పథకం కనుమరుగైంది. పింఛన్ల కోసం ఇచ్చే గుర్తింపు కార్డులు ఇవ్వడం లేదు. 


నేసిన వస్త్రాలపై ధరలు పతనం అయ్యాయని, ముడిసరుకు తెచ్చుకోవడానికి మదనపల్లె, ధర్మవరం ప్రాంతాలకు వెళితే దళారుల చేతుల్లో మోసపోయి నష్టపోతున్నట్లు కార్మికులు వాపోతున్నారు. నేతన్న నేస్తం మొదటి విడతలో రావాల్సిన డబ్బులు రెండవ విడతలో అందరికీ అందించి సంక్షేమ పథకాలు కొనసాగించి ఆదుకోవాలని కార్మికులు కోరుతున్నారు.


ప్రస్తుతానికి పథకాలేమీ లేవు - అప్పాజి, ఏడీఏ, చేనేత జౌళి శాఖ

జిల్లాలో సుమారు 15 వేల చేనేత కుటుంబాలు ఉన్నాయి. వీరిలో వలంటీర్లు, ఎంపీడీవోలు, మున్సిపల్‌ కమిషనర్లు సర్వే చేసి అందించిన నివేదిక ప్రకారం 9311 మంది కార్మిక కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.24 వేలు చొప్పున నేతన్న నేస్తం పథకం కింద  జూన్‌ నెలలో ఇవ్వడం జరిగింది. ప్రస్తుతానికి చేనేత కార్మికులకు సంబంధించి పథకాలు ఏమీ లేవు. 


కార్మికులను ఆదుకోవాలి - ఎం.వెంకటేశ్వర్లు, చేనేత జన సమాఖ్య జిల్లా అధ్యక్షుడు

50 సంవత్సరాలు నిండిన కార్మికులకు పింఛన్ల మంజూరుకు వలంటీర్లు గుర్తింపు కార్డులను వెంటనే ఇవ్వాలి. ఉపాధి లేక అవస్థలు పడుతున్న కార్మికులను వెంటనే ఆదుకోవాలి. గతంలో ఉన్న పథకాలను పునరుద్ధరించాలి. వర్షాల్లో దెబ్బతిన్న మగ్గాలకు నష్టపరిహారం అందించాలి. 


Advertisement
Advertisement