Abn logo
Oct 22 2020 @ 05:43AM

రైల్వే బొగ్గు లారీ దగ్ధం

ప్రాణాలతో బయటపడ్డ డ్రైవర్‌, క్లీనర్‌ 


చాగలమర్రి, అక్టోబరు 21: పట్టణ సమీపంలోని 40వ జాతీయ రహదారిపై టోల్‌ప్లాజా వద్ద బుధవారం తెల్లవారుజామున రైల్వే బొగ్గు తరలిస్తున్న ఓ లారీ దగ్ధమైంది. నెల్లూరు  జిల్లాలోని కృష్ణపట్నం ఓడరేవు నుంచి నంద్యాలలోని జిందాల్‌ ఫ్యాక్టరీకి బొగ్గును తరలిస్తుండగా ప్రమాదానికి గురైంది. చాగలమర్రికి 8 కి.మీ. దూరంలో టైర్‌ పంక్చర్‌ కావడంతో లారీని నిలిపివేశారు. పంక్చర్‌ వేసుకుని బయలుదేరి చాగలమర్రి టోల్‌ప్లాజా సమీపంలోకి రాగానే లారీకి వెనుకభాగాన మంటలు వ్యాపించాయి. దీంతో డ్రైవర్‌ లారీని నిలిపివేసి ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. కొద్దిసేపట్లోనే బొగ్గుతో పాటు లారీ దగ్ధమైంది. రూ.15 లక్షల విలువ చేసే రైల్వే బొగ్గు, రూ.10 లక్షల విలువ చేసే లారీ దహనమయ్యాయని డ్రైవర్‌ వెంకటేష్‌, క్లీనర్‌ శేఖర్‌ తెలిపారు. అగ్నిప్రమాదం ఎలా  జరిగిందో తెలియడం లేదని అన్నారు. మంటలు పెద్దగా రావడంతో భయపడి లారీలో నుంచి దూకి ప్రాణాలు దక్కించుకున్నామని వారు తెలిపారు. ఆళ్లగడ్డ నుంచి అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి వచ్చి మంటలను అదుపు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 


Advertisement
Advertisement