Abn logo
Oct 22 2020 @ 05:42AM

స్కందమాతగా భ్రమరాంబ

స్వామి అమ్మవార్లకు శేషవాహన సేవ

శ్రీగిరిపై ఘనంగా దేవీ నవరాత్రోత్సవాలు


కర్నూలు(కల్చరల్‌), అక్టోబరు 21: దసరా మహోత్సవాల్లో అయిదో రోజు శ్రీశైల భ్రమరాంబ అమ్మవారికి స్కందమాత అలంకారం చేశారు. స్వామి, అమ్మవారికి  శేషవాహన సేవ నిర్వహించారు. రాత్రి కాళరాత్రి పూజ, మంత్రపుష్పము, అమ్మవారి ఆస్థాన సేవ, సువాసినీ పూజలు చేశారు. బాలికల చేత కుమారీ పూజలను నిర్వహించారు. సాయంత్రం అమ్మవారి ఉత్సవ మూర్తికి స్కందమాత అలంకరణ చేశారు. నవదుర్గలలో ఐదో రూపమైన ఈ దేవికి చతుర్భుజాలు ఉంటాయి. ఒక చేతిలో స్కందుణ్ణి పట్టుకొని, మిగిలిన చేతులలో పద్మాలను, అభయ ముద్రలను ధరించి ఉంటుంది. అమ్మవారి ఒడిలో బాలుని రూపంలో స్కందుడు (కుమారస్వామి) కూర్చొని ఉంటాడు. స్కందదేవుని జనని కావడం వల్ల ఈ దుర్గా స్వరూపం స్కందమాతగా ప్రసిద్ధి చెందింది. స్కందమాతను ఉపాసించడం వల్ల స్కందదేవున్ని ఉపాసన చేసిన ఫలితం కూడా లభిస్తుందని పురాణాల్లో ఉంది. ఈ దేవిని ఆరాధించడం వల్ల కోరికలు నెరవేరడమే కాకుండా శాంతి సౌఖ్యాలు సిద్ధిస్థాయి. వాహన సేవల్లో భాగంగా బుధవారం రాత్రి శేషవాహన సేవ నిర్వహించారు. స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను ప్రత్యేకంగా అలంకరించి, వాహనంపై ఆసీనులు చేయించి పూజలు నిర్వహించారు. పూజా కార్యక్రమాల్లో దేవస్థానం ఈవో కేఎస్‌ రామరావు దంపతులు, ఆలయ వేద పండితులు, అర్చకులు పాల్గొన్నారు. 


గజ వాహనంపై స్కందమాతదుర్గ

మహానంది: మహానందిలో బుధవారం కామేశ్వరీదేవిని స్కందమాతదుర్గగా అలంకరించారు. అనంతరం సహస్ర దీపాలంకరణ సేవ నిర్వహించారు. రాత్రి స్కందమాతదుర్గ అలంకారంలో ఉన్న కామేశ్వరీదేవిని గజ వాహనంపై ఆశీనులను చేసి పూజలు చేశారు. చిన్నారుల కోలాటం నృత్యాలు ఆకట్టుకున్నాయి. వర్షం రావడంతో రాత్రి జరగాల్సిన అమ్మవారి గ్రామోత్సవాన్ని అధికారులు రద్దు చేశారు. 

Advertisement
Advertisement