Abn logo
Oct 22 2020 @ 05:26AM

నత్తతో పోటీ..!

Kaakateeya

నాడు-నేడు పనుల్లో మందగించిన పురోగతి

ఫేజ్‌-1లో 1040 పాఠశాలలు ఎంపిక

రూ.185 కోట్లు మంజూరు

పేరెంట్స్‌ కమిటీలకు విడుదలైన నిధులు రూ.92.68 కోట్లే

పలు పాఠశాలల్లో అసంపూర్తిగా మరుగుదొడ్లు, తాగునీటి పనులు

నవంబరు 2 నాటికి పూర్తయ్యేనా?


పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పన లక్ష్యంగా ప్రభుత్వం నాడు-నేడు కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా చేపట్టింది. మే నెలాఖరులోగా పనులు పూర్తి కావాల్సి ఉన్నా.. కరోనా కారణంగా ఎక్కడి పనులు అక్కడే ఆగిపోయాయి. అన్‌లాక్‌ తరువాత పనులు ప్రారంభమైనా పురోగతి నత్తకు నడక నేర్పుతోంది. కీలకమైన మరుగుదొడ్లు, తాగునీటి సరఫరా, మేజర్‌, మైనర్‌ సివిల్‌ పనులు అసంపూర్తిగా ఉన్నాయి. పలు పాఠశాలలకు ఫర్నీచర్‌ సరఫరా చేసినా ఏర్పాటు చేయలేదు. ప్రభుత్వం రూ.185 కోట్లు మంజూరు చేసినా పేరెంట్స్‌ కమిటీ ఖాతాల్లో జమ చేసింది రూ.92.68 కోట్లే. నవంబరు 2న పాఠశాలలు ప్రారంభమవుతాయని ముఖ్యమంత్రి జగన్‌ స్పష్టం చేశారు. మిగిలిన సమయం పది రోజులే. అప్పటిలోగా పనులు పూర్తి చేయడం సాధ్యమా...? నాడు-నేడు పనుల తీరుపై ఆంధ్రజ్యోతి క్షేత్రస్థాయి పరిశీలన కథనం.


(కడప-ఆంధ్రజ్యోతి): జిల్లాలో జడ్పీ, ప్రభుత్వ, మున్సిపల్‌, ఎయిడెడ్‌ పాఠశాలలు 3,255 ఉన్నాయి. 4.50 లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారు. పాఠశాలల అభివృద్ధికి వివిధ పథకాల ద్వారా యేటేటా రూ.వందల కోట్లు ప్రజాధనం ఖర్చు చేస్తున్నా.. నేటికీ ఆయా బడుల్లో విద్యార్థులకు సరిపడా మరుగుదొడ్లు లేవు. తాగునీరు, విద్యుత్‌, ఫర్నీచర్‌ తదితర సమస్యలు వేధిస్తూనే ఉన్నాయి. సీఎం జగన్‌ బాధ్యతలు చేపట్టాక ప్రభుత్వ పాఠశాలల్లో మరుగుదొడ్లు, తాగునీరు, ప్రతి తరగతి గదికి ఫ్యాన్‌, ట్యూబ్‌లైట్లు, విద్యార్థులు, ఉపాధ్యాయులకు ఫర్నీచర్‌, రంగులు, అవసరమైన మరమ్మతులు, ఆకుపచ్చ శుద్ధ బోర్డు, అదనపు తరగతి గదులు, ప్రహరీగోడ.. వంటి సౌకర్యాలు సమకూర్చేందుకు ‘నాడు-నేడు’ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా చేపట్టింది. జిల్లాలో ఫేజ్‌-1 కింద 1040 పాఠశాలలు ఎంపిక చేశారు. 7.868 పనులను గుర్తించారు. రూ.185 కోట్లు నిధులు మంజూరు చేశారు. ఇప్పటి వరకు విద్యార్థుల తల్లిదండ్రుల కమిటీ (పేరెంట్స్‌) ఖాతాల్లో రూ.92.68 కోట్లు జమ చేశారు.


కనిపించని పురోగతి

మే నెలాఖరులోగా నాడు-నేడు పనులు పూర్తి చేసి జూన్‌లో పాఠశాలలు పునఃప్రారంభం నాటికి విద్యార్థులకు మౌలిక వసతులు కల్పించాలని లక్ష్యం. అయితే.. కరోనా వైరస్‌ వ్యాప్తినిరోధానికి దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ ప్రకటించడంతో ఎక్కడి పనులు అక్కడే ఆగిపోయాయి. అన్‌లాక్‌ తరువాత పనులకు శ్రీకారం చుట్టారు. తొమ్మిది పనులు చేయాల్సి ఉంటే మరుగుదొడ్ల నిర్మాణం, తాగునీటి సరఫరా, మేజర్‌, మైనర్‌ మరమ్మతు పనులు పేరెంట్స్‌ కమిటీలు చేస్తే.. ఫర్నీచర్‌, ఫ్యాన్లు, ఆకుపచ్చ (గ్రీన్‌) బోర్డులు, మరుగుదొడ్లలో బేసిన్లు ప్రభుత్వమే సరఫరా చేస్తుంది. పేరెంట్స్‌ కమిటీలు చేయాల్సిన పనులు పలు పాఠశాలల్లో అసంపూర్తిగానే ఉన్నాయి. 1,040 పాఠశాలలకు గానూ 165 పాఠశాలలు డోనర్స్‌, 40 పాఠశాలల్లో నాబార్డు పనులు చేస్తే 833 పాఠశాలల్లో పేరెంట్స్‌ కమిటీ ద్వారా ప్రభుత్వం చేస్తోంది. రూ.185 కోట్లకు గానూ రూ.92.68 కోట్లు పేరెంట్స్‌ కమిటీ ఖాతాల్లో జమ చేశారు. రూ.77.60 కోట్లు మాత్రమే ఖర్చు చేసినట్లు అధికారిక వెబ్‌సైట్‌ ద్వారా తెలుస్తోంది. పలు పాఠశాలలకు ఫర్నీచర్‌ (డెస్క్‌లు), ఫ్యాన్లు వచ్చినా ఇంకా ఏర్పాటు చేయలేదు. కొన్ని పాఠశాలలకు నేటికీ సరఫరా కాలేదు. సివిల్‌ పనులు కూడా అసంపూర్తిగా ఉన్నాయి. నవంబరు 2వ తేదీ నాటికి పూర్తి చేయడం అసాధ్యమని పనులు పర్యవేక్షించే ఇంజనీర్లే అంటున్నారు. పురోగతి వేగం పెంచేందుకు ఇంజనీర్లు సచివాలయ ఇంజనీరింగ్‌ అసిస్టెంట్‌ సేవలను పూర్తిగా వినియోగించుకోవడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. 


ఆయా పాఠశాలల్లో పురోగతి తీరు


కడప నగరం జడ్పీ బాలికల ఉన్నత పాఠశాలలో 362 మంది విద్యార్థులున్నారు. రెండు మరుగుదొడ్లు ఉంటే నాడు-నేడు కింద మరో 10 మరుగుదొడ్లు ప్రతిపాదించారు. వివిధ పనులకు రూ.42.76 లక్షలు మంజూరు చేశారు. ఇప్పటికి చేసిన ఖర్చు రూ.12.98 లక్షలే. మరుగుదొడ్లు, తాగునీటి సరఫరా, మేజర్‌, మైనర్‌ పనులు అసంపూర్తిగా ఉన్నాయి. గాంధీ నగర్‌ మున్సిపల్‌ ఉన్నత పాఠశాలలో 350 మంది విద్యార్థులు ఉన్నారు. మౌలిక వసతులకు రూ.97.34 లక్షలు నిధులు ఇస్తే.. పనులు నత్తనడకన సాగుతున్నాయి. చేసిన ఖర్చు రూ.47.91 లక్షలే. ప్రగతి మందగించింది. 


రైల్వేకోడూరు బాలికల హైస్కూల్‌లో 750 మంది విద్యార్థులు చదువుతున్నారు. మౌలిక వసతుల కల్పనకు రూ.60.90 లక్షలు మంజూరు చేశారు. ఆరు మరుగుదొడ్ల నిర్మాణం, తాగునీటి పైపులైన్‌ పనులు అసంపూర్తిగా ఉన్నాయి. ఫ్లోరింగ్‌ పనులు చేసినా.. రంగులు వేయలేదు. డెస్క్‌లు 220 వచ్చాయి.. 


గాలివీడు మండలం నూలివీడు జడ్పీ ఉన్నత పాఠశాలకు రూ.26.44 లక్షలు వచ్చాయి. చేసిన ఖర్చు రూ.11.56 లక్షలే. కీలకమైన మరుగుదొడ్లు గోడలు కట్టి వదిలేశారు. తాగునీటి సరఫరా పనుల్లో జాప్యం కొనసాగుతోంది. ఇంగ్లీష్‌ ల్యాబ్‌ పనులు మొదలే కాలేదు. ఫర్నీచర్‌ వచ్చినా ఏర్పాటు చేయలేదు. వానొస్తే పైకప్పు జల్లెడలా కారుతోంది. మరమ్మతు పనులు చేపట్టలేదు. 


బద్వేలు జడ్పీ బాలుర ఉన్నత పాఠశాలలో 750 మంది విద్యార్థులు ఉన్నారు. వసతుల కల్పనకు రూ.1.16 కోట్లు నిధులు ఇచ్చారు. పనుల్లో పురోగతి లేకపోవడంతో ఇప్పటి వరకు చేసిన ఖర్చు రూ.30.59 లక్షలే. కిటికీలు, తలుపుల మరమ్మతు పనులు చేపట్టలేదు. మరుగుదొడ్లు, తాగునీటి పనులు ముందుకు సాగడం లేదు. ఫ్యాన్లు, డెస్క్‌లు వచ్చినా సగం కూడా ఏర్పాటు చేయలేదు. ఇంగ్లీష్‌ ల్యాబ్‌ పనులు అసంపూర్తిగా ఉన్నాయి.


వేంపల్లి జడ్పీ ఉర్దూ ఉన్నత పాఠశాలలో 395 మంది విద్యార్థులు ఉన్నారు. ఈ బడిలో నాడు-నేడు పనులు హెటిరో డ్రగ్స్‌ సంస్థ స్వచ్ఛందంగా చేస్తోంది. ఇక్కడ కూడా పనులు నత్తనడకన సాగుతున్నాయి. ఐదు తరగతి గదులు అవసరం ఉన్నా స్థల సమస్య వల్ల మొదలు పెట్టలేదు. ల్యాబ్‌ సౌకర్యం లేదు. విద్యార్థులకు ఫర్నీచర్‌ సరఫరా చేయలేదు. 


మైలవరం మండలం మైలవర డ్యాం ప్రాథమిక పాఠశాలలో 140 మంది విద్యార్థులు చదువుతున్నారు. నాడు-నేడు కింద రూ.19.72 లక్షలు వచ్చినా చేసిన ఖర్చు రూ.7.33 లక్షలే. మరుగుదొడ్డి గోడలు నిర్మించి వదిలేశారు. ఫర్నీచర్‌ సరఫరా చేయలేదు. ఇంగ్లీష్‌ ల్యాబ్‌ పూర్తి చేయాల్సి ఉంది. 


గడువులోగా పూర్తి చేస్తాం - అంబవరపు ప్రభాకర్‌రెడ్డి, సమగ్ర శిక్ష అడిషనల్‌ కో-ఆర్డినేటర్‌, కడప

నాడు-నేడు పనులు గడువులోగా పూర్తి చేస్తాం. ఫేజ్‌-1 కింద 1,040 పాఠశాలలు ఎంపిక చేశారు. నాబార్డు 40, డోనార్‌ సంస్థలు 165 పాఠశాలల్లో పనులు చేస్తే.. 833 పాఠశాలల్లో ప్రభుత్వం చేస్తోంది. రూ.185 కోట్లు మంజూరు చేస్తే ఇప్పటికే రూ.92.68 కోట్లు పేరెంట్స్‌ కమిటీ ఖాతాల్లో జమ అయింది. పలు పాఠశాలల్లో సివిల్‌ పనులు అసంపూర్తిగా ఉన్న మాట నిజమే. గడువులోగా పూర్తి చేసి విద్యార్థులకు ఏ ఇబ్బంది లేకుండా చూస్తాం. 


Advertisement
Advertisement