Abn logo
Dec 2 2020 @ 00:58AM

ఆంక్షల పుష్కరాలు

తుంగభద్ర నదిలో నిరసన చేస్తున్న బీజేపీ నాయకులు (ఫైల్‌)


  1.  అసౌకర్యాల ఘాట్లు  
  2. తొలి రోజున పని చేయని షవర్లు 
  3.  నదిలో స్నానం చేసిన భక్తుల అరెస్టు
  4.  నదిలో డ్రైనేజీ నీరు కలుస్తోందని అందోళన 

 

కర్నూలు, ఆంధ్రజ్యోతి: తుంగభద్ర పుష్కరాలు మంగళవారంతో ముగిశాయి. ఎప్పుడూ లేనట్లుగా ఈసారి పుష్కరాలకు కొవిడ్‌ వల్ల అననుకూల వాతావరణం ఏర్పడింది. దీంతో ఆంక్షలు, హడావిడి ఏర్పాట్లు, వైరస్‌ సోకుందని అంతంత మాత్రంగానే భక్తులు రావడం వంటి ప్రత్యేకతల నడుమ పుష్కరాలు ముగిశాయి. అయినా భక్తులు సంప్రదాయబద్ధంగా పాల్గొన్నారు. పుష్కరాలపట్ల ప్రభుత్వం తగిన శ్రద్ధ పెట్టలేదని, ఘాట్ల నిర్మాణంలో అవినీతి జరిగిందని, సౌకర్యాలు అస్తవ్యస్తంగా ఏర్పాటు చేశారనే ప్రతిపక్షాల విమర్శల నడుమ పుష్కరాలు ముగిశాయి. కొవిడ్‌ నిబంధనల వల్ల స్నానాలను రద్దు చేయడం వివాదాస్పదమైంది. అయితే పుష్కర ఘాట్ల నిర్మాణానికి, సౌకర్యాలకు ప్రభుత్వం రూ.230 కోట్లు విడుదల చేసింది. రెండు నెలలు కూడా లేకపోవడం, కొన్ని శాఖలు ఆలస్యంగా నిధులు కేటాయించడంతో పనులు సకాలంలో పూర్తి కాలేదు. పుష్కరాలను ప్రారంభించడానికి సీఎం జగన్‌ రాకను పురస్కరించుకుని అధికారులు ముందు మునగాలపాడును వీఐపీ ఘాట్‌గా ప్రకటించారు. ఆ ఘాట్‌కు వెళ్లే రోడ్లు, ఘాట్‌ నిర్మాణాలు పూర్తికాకపోవడంతో 19వ తేదీ రాత్రి వీఐపీ ఘాట్‌గా సంకల్‌బాగ్‌ను ప్రకటించారు. పుష్కరాలు ప్రారంభమైన ఏడు రోజుల దాకా జిల్లాలో ఏదో ఒక చోట పనులు జరుగుతూనే వచ్చాయి.  ఇదీ పరిస్థితి

 ఈ సంవత్సరం వర్షాలు పుష్కలంగా కురవడంతో తుంగభద్ర జలాశయం నిండింది. పుష్కరాలకు నెల ముందే శ్రీశైలం జలాశయానికి నీరు వదిలారు. పుష్కరాల ప్రారంభం నాటికి మాత్రం ఘాట్లలో నీరు కరువైంది. పైగా ఘాట్లు స్నానాలకు అనుకూలంగా లేవు. చివరి నిమిషంలో అధికారులు ఘాట్లకు రంగులు వేసి పని అయిందనిపించారు. ఘాట్ల లో పేరుకుపోయిన మట్టి, బురదతో భక్తులు ఇబ్బందిపడ్డారు. నగరేశ్వరస్వామి ఘాట్‌లో తొలి రోజే పందులు సంచరించడం విమర్శలకు దారి తీసింది. 


 పుష్కరాలు మొదలయ్యే నాటికి మునగాలపాడు, పంచలింగాల ఘాట్లకు వెళ్లే రోడ్ల నిర్మాణం పూర్తి కాలేదు. చాలా చోట్ల కంకర రాళ్లను పేర్చి వదిలేశారు. డిప్యూటీ సీఎం కోనా రఘుపతి పంచలింగాల ఘాట్‌ను పరిశీలించి తక్షణమే రోడ్డు నిర్మాణం పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. మంత్రాలయం ఎన్‌ఏపీ పంప్‌ హౌస్‌ సమీపంలోని వీఐపీ ఘాట్‌ పనులు పూర్తి కాలేదు. అప్రోచ్‌ రోడ్డు పనులు అధ్వానంగా మారాయి.  


 పుష్కరాల్లో జల్లు స్నానాలే శరణ్యం కావడంతో భక్తులు ఆసక్తి చూపలేదు. పుష్కర ప్రారంభానికి సంకల్‌బాగ్‌ ఘాట్‌కు సీఎం జగన్‌ వచ్చి నదికి చీర, సారె సమర్పించుకొని 20 నిమిషాల్లో వెళ్లిపోయారు. ఆ తర్వాతే భక్తులను ఘాట్లలోకి వదిలారు. అయితే సీఎం వెళ్లిన 15 నిమిషాలకు ఘాట్లోని షవర్లు మొరాయించాయి. దీంతో పూర్తిగా స్నానం చేయలేకపోయారు.  


  స్నానాల రద్దు, కొవిడ్‌ ప్రభావం, ఘాట్లలో సౌకర్యాల్లేవని తెలియడంతో స్థానికులు కూడా పెద్దగా స్నానాలపై ఆసక్తి చూపలేదు. కానీ, అధికారులు రెండో రోజు 26,173 మంది భక్తులు ఘాట్లకు వచ్చినట్లుగా తొలుత ప్రచారం చేసుకున్నారు. వాస్తవానికి కొన్ని ఘాట్లలో ఇన్‌చార్జులే కనిపించ లేదు. అయితే ఆ రిపోర్టును పరిశీలించిన రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులు జిల్లా యంత్రాంగం పనితీరుపై అసహనం వ్యక్తం చేశారు. కచ్చితమైన వివరాలు ఇవ్వాలని ఆదేశించారు. దీంతో 26 వేలను 10,469కు కుదించి పంపించాల్సి వచ్చింది. 


 నదీ స్నానాలకు అనుమతివ్వలేదని బీజేపీ, విశ్వ హిందూ పరిషత్‌ నాయకులు అసహనం వ్యక్తం చేసి 22వ తేదీన చలో తుంగభద్ర కార్యక్రమానికి పిలుపునిచ్చారు. ముందస్తుగా బీజేపీ నాయకులైన బైరెడ్డి శబరిని అరెస్టు చేశారు. సంకల్‌బాగ్‌ ఘాట్‌లో స్నానానికి ప్రయత్నించిన బీజేపీ నాయకులు, విశ్వ హిందూ పరిషత్‌, భజరంగదళ్‌ సభ్యులతో పాటు పలువురిని అరెస్టు చేశారు. అనంతరం షిరిడి సాయి బాబా ఘాట్‌ వద్ద పోలీసులపై భక్తులు ఎదురు తిరిగారు. దీంతో వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. జల్లు స్నానాలు పూర్తి చేసుకున్న భక్తులను కూడా నిర్దాక్షిణ్యంగా పోలీసులు వాహనాలు ఎక్కించడం చర్చనీయాంశమైంది. 


 ఘాట్లలో పాముల కలకలం ప్రత్యేక సమస్యగా మారింది. నాగసాయి బాబా ఘాట్‌లో పాముల వల్ల భక్తులు ఇబ్బంఇపడ్డారు. మంత్రాలయం సంత మార్కెట్‌ ఘాట్‌లో 29వ తేదీన ఏకంగా నాలుగు పాములు దర్శనమిచ్చాయి. 


 మల, మూత్రాలు పారే మురుగు నీళ్లు తుంగభద్రలో కలుస్తున్నాయని భక్తులు ఆగ్రహించారు. కర్నూల్లోని 6.5 లక్షల మంది ప్రజల నివాసాల నుంచి నిత్యం 60 ఎమ్‌ఎల్‌డీ(60 మిలియన్‌ లీటర్ల) మురుగు నీరు విడుదల అవుతోంది. సీవరేజి ప్లాంట్లు పని చేయకపోవడంతో ఆ మురుగంతా తుంగభద్రలో కలుస్తోందనే విమర్శలు వినిపించాయి. 

Advertisement
Advertisement
Advertisement