Aug 1 2021 @ 12:11PM

మూడు పూటలా అన్నమైనా ఇష్టమే..

మలయాళంలో ప్రేమమ్‌తో మొదలై తమిళ, తెలుగు చిత్రాల్లో యువత మనసు దోచుకున్న అనుపమ పరమేశ్వరన్‌.. తొలి చిత్రంలో ఎలా ఉందో ఇప్పటికీ అలాగే శరీరాకృతిని మెయింటెయిన్‌ చేస్తోంది. మితంగా సంతృప్తిగా ఇష్టమైంది తినడమే తనకు అలవాటు. ఇంతకూ తనకు ఏ తిండి ఇష్టం? 


నాకు ఇష్టమైన ప్రత్యేక వంటలేవీ లేవు. సంప్రదాయ వంటలంటే ఇష్టం. విందుభోజనం అంటే నాకిప్పటికీ గుర్తుకు వచ్చేది కేరళలో జరుపుకునే ఓనమ్‌ పండుగ. నేను పదోతరగతి నుంచి ఇంటర్‌ చదివే వరకు వంటగదిలో అమ్మకు సహాయపడేదాన్ని. పండుగ ముందురోజు రాత్రి అందరం మేల్కొని వంటలకు ఏర్పాటు చేసుకునేవాళ్లం. కాలేజీ ఫ్రెండ్స్‌ అందరూ మా ఇంటికి వచ్చేవారు. వాళ్లతో కలిసి కూరగాయలు తరగడం, అప్పడాలు వేయించడం, మిగిలిన వంటల తయారీలో సహాయపడటం చేసేదాన్ని. అమ్మ సునీత ఎంతో ఓపిగ్గా తను ఒకవైపు వంటలు చేస్తూనే, మాకు గైడ్‌ చేసేది. పండగ సంబరంతో ఎంత పనినైనా చేసేదాన్ని. ఆ క్షణాలు సరదాగా గడిచిపోయేవి. ఆ చిన్నప్పటి జ్ఞాపకాలను ఎప్పటికీ మరిచిపోలేను.


ఓనమ్‌కు రకరకాల వంటలు చేసుకుంటారు కేరళవాసులు. ఆ కొన్ని రోజులు బిగ్‌మీల్‌ అన్నమాట. వుప్పెరి, ఇంజికర్ర, మ్యాంగోకర్రీ, పచ్చడి, నారంగ కర్రీ, పాయసం, రైస్‌...అప్పడాలు ఇలా రకరకాలు. పండగొస్తే కడుపునిండా తినడమే కాదు... మనసు నిండా ఆనందాన్ని నింపుకోవడం మన సంప్రదాయాల ప్రత్యేకత. ప్రతి సీజన్‌లో వచ్చే పండగలు... ఇంటిల్లిపాదినీ ఒకచోట చేర్చి... కలిసి భోంచేసేలా చేస్తాయి. మనదేశంలో ఇదొక అద్భుత ఆత్మీయ విందు అనే చెప్పొచ్చు. ముఖ్యంగా ఇప్పుడున్న బిజీ వాతావరణంలో పండగలతోనైనా కుటుంబ సభ్యులంతా కలిసి కబుర్లు చెప్పుకుంటూ భోజనం చేసే అవకాశం దక్కుతోంది. అందుకు సంతోషం. 


అన్ని రుచులూ చూడాలి..

నాకు ఫలానా వంటలు, కూరలు, తిండిపదార్థాలు అంటే ఇష్టమని ఏమీ లేదు. అన్నిరకాల తిండినీ సంతృప్తిగానే తింటాను. పెద్దగా నిబంధనలేమీ లేవు. అయితే నాకు చిన్నప్పటి నుంచీ ఒక కోరిక ఉంది.. ప్రపంచమంతా తిరగాలి. వివిధ ప్రాంతాల్లో దొరికే రకరకాల ఆహారపదార్థాల రుచి చూడాలన్న ఆశ ఉంది. ఒక్కో చోట ఒక్కో రకమైన ఆహారవైవిధ్యం కనిపిస్తుంది. దేనికదే సాటి. ఆ భిన్నమైన రుచులను ఆస్వాదించడం కొత్త అనుభవమే కదా!. ఇప్పటికైతే నేను తిన్న కాంటినెంటల్‌ ఫుడ్‌లో ఇటాలియన్‌ డిషెస్‌ అంటే చాలా ఇష్టం. 


సాంబార్‌ అంటే..

నాకు చిన్నచిన్న వంటలు చేయడమే వచ్చు. కష్టమైనవి వండలేను. అయితే అమ్మ సలహాలతో కొన్ని నేర్చుకున్నాను. మా ఇంట్లో పండగలప్పుడు మాత్రం సులువుగా అప్పడాలు కాల్చేస్తుంటా. నాకు అమ్మ చేసే సాంబార్‌ను మించిన రుచి మరొకటి లేదనిపిస్తుంది. నేను ఎప్పుడు ఇంటికి వెళ్లినా ముందుగా సాంబార్‌ చేయించుకుని అన్నంలోకి కలుపుకుని హాయిగా తింటాను. ఆ సాంబార్‌ రుచి చిన్నప్పటి నుంచీ అలా గుర్తుండిపోయింది. అలవాటు అయ్యింది. అమ్మ చేసే మరో వంటకం పాయసం. అదీ ఇష్టమే!. సినిమాల్లోకి వచ్చాక డైట్‌ప్లాన్‌లను అనుసరించక తప్పదు. మితంగానే తింటుంటా. అయితే ఎన్నితిన్నా రైస్‌ను మాత్రం మరువలేకున్నాను. నిజంగా నాకు మూడు పూటలా అన్నం పెట్టినా వద్దనకుండా తింటాను. అన్నం తిన్న తరువాత దొరికే సంతృప్తి మరెందులోనూ ఉండదు. 


ఆహా... బిర్యానీ..

తెలుగు చిత్రాల్లో నటించడం మొదలుపెట్టిన తరువాత... హైదరాబాద్‌లో వండే బిర్యానీకి ఫిదా అయ్యాను. నేనే కాదు... ఎవ్వరైనా అవ్వాల్సిందే! ఒక షూటింగ్‌లో మటన్‌ బిర్యానీ వడ్డించారు. ఆ రుచి మాటల్లో చెప్పలేను. ట్విట్టర్‌లో కూడా మీకు ఇష్టమైన ఫేవరెట్‌ ఫుడ్‌ ఏదని ఓటింగ్‌ పెడితే - అరవైశాతం మంది బిర్యానీకే ఓటు వేశారు. ఆ తరువాత అన్నం-పప్పు, భేల్‌పురి, పాస్తా.. అంటూ పలు సందర్భాల్లో చెప్పిన అనుపమ... లాక్‌డౌన్‌ సమయంలో బరువు తగ్గింది. ఆ విరామాన్ని వ్యాయామం కోసం వాడుకుంది. తీగలా, నాజూగ్గా మారాను అంటూ ఇన్‌స్టాలో బరువుతగ్గిన ఫోటోలను కూడా షేర్‌ చేసింది.