Abn logo
Oct 11 2021 @ 23:54PM

అంతా వారిష్టం !

గూడూరు మండలం మిటాత్మకూరులో నిర్మించిన ఓవర్‌హెడ్‌ ట్యాంక్‌

నాడు అనుభవం కావాలన్నారు... నేడు వద్దన్నారు !

సమగ్ర రక్షిత తాగునీటి పథకం నిర్వహణ టెండర్లలో మతలబు

గతేడాది మిటాత్మకూరు ప్రాజెక్టు టెండర్‌లో ఎక్స్‌పీరియన్స్‌ నిబంధన

ఇప్పుడు తొలగించిన ఉన్నతాధికారులు 

నాడు 1.80 శాతం లెస్‌.. నేడు 36 శాతం లెస్‌

నిర్వహణ కూడా అంతంత మాత్రమే..

ప్రభుత్వ ఖజానాకు భారీ గండి

విజిలెన్స్‌ విచారణ జరిపితే వెలుగులోకి వాస్తవాలు


 పని ఒకటే.. అయితే ఆ పనికి పిలిచిన టెండర్లే వేరు.. ఒకే రకమైన పనికి గతేడాది ఓ విధానంలో టెండర్‌ పి లిచారు, ఈ ఏడాది మరో విధానంలో టెండర్‌ పిలిచారు.. అధికారులు ప్రదర్శించిన ఈ మాయాజాలం కారణంగా ప్రభుత్వ ఖజానాకు రూ.లక్షల్లో గండి పడింది. ఈ పనికి టెండర్‌ను గతేడాది డివిజన్‌ స్థాయి  అధికారులు పిల వగా, ఈ ఏడాది జిల్లా స్థాయి అధికారులు పిలిచారు. సాధారణంగా ఎక్కడైన కింది స్థాయి నుంచి పైస్థాయికి వచ్చే సరికి నిబంధనలు పెరుగు తుంటాయి. కానీ ఇక్కడ మాత్రం అందుకు భిన్నంగా జరిగింది. అయితే టెండర్లు పిలిచిన రెండు స్థాయిల అధికారులు తాము అనుసరిం చిన విధానాన్ని ఎవరికి వారు సమర్థించుకుంటున్నారు. మరి పొరపాటు ఎక్కడ జరిగింది.. ఎందుకు జరిగింది.. దీనికి బాధ్యులెవరు.. ? అన్నది తేలాలంటే విజిలెన్స్‌ విచా రణ ఒక్కటే మార్గమన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ పని పేరు మిటాత్మకూరు సమగ్ర రక్షిత తాగునీటి పథకం (సీపీడబ్ల్యూఎస్‌) నిర్వహణ.. టెండర్లు పిలిచింది గ్రామీణ నీటి సరఫరా విభాగం(ఆర్‌డబ్ల్యూఎస్‌) అధికారులు. 

- నెల్లూరు (ఆంధ్రజ్యోతి)


తాగునీటి కొరతను ఎదుర్కొంటున్న గ్రామాలకు సీపీడ బ్ల్యూఎస్‌ పథకాలను నిర్మించారు. మంచి  నీరు అందుబాటులో ఉన్న చోట నుంచి పంపింగ్‌ చేసి పైపు లైన్లు ద్వారా సరఫరా చేస్తుంటారు. జిల్లాలో పదుల సంఖ్యలో ఇలాంటి సీపీడబ్ల్యూఎస్‌ పథకాలున్నాయి. ఈ క్రమంలోనే గూడూరు మండలం మిటాత్మకూరు ప్రాజెక్టుకు రూపకల్పన చేశారు. చుట్టుపక్కల ఉన్న దాదాపు పద్దెనిమిది గ్రామాలకు కండలేరు  నుంచి తాగునీరు సరఫరా చేసేలా ప్రాజెక్టును నిర్మించారు. సుమారు రూ.13 కోట్లతో ఈ పథకాన్ని 2013లో మొదలుపెట్టి 2018 నాటికి పూర్తి చేశారు. ఆ వెంటనే ఆ పథకం అధికారుల చేతుల్లోకి వచ్చింది. రాపూరు మండలం వేపినాపి వద్ద మోటార్ల ద్వారా కండలేరు నీటిని తోడి అక్కడి నుంచి పైపులైన్ల ద్వారా చుట్టుపాలెం వరకు తీసుకువస్తారు. అక్కడ ఆ నీటిని శుభ్రం చేసి పైపులైన్ల  ద్వారా నిర్దేశించిన  గ్రామాలకు సరఫరా చేస్తారు. ఈ కొత్త పథకం నిర్వహణకు మొదటిసారిగా 2020లో టెండర్లు పిలిచారు. 2018లోనే అందుబాటులోకి వచ్చినప్పటికీ రెండేళ్ల తర్వాత నిర్వహణకు టెండర్లు పిలవడమేమిటో అధికారులే చెప్పాలి. మొదటి సారి టెండర్లు పిలిచినప్పుడు ఎస్టిమేట్‌ విలువ దాదాపు రూ.46 లక్షలుగా అంచనా వేశారు. అందులో ఈసీవీ రూ.22 లక్షలు కాగా, విద్యుత్‌ చార్జీలు రూ.16 లక్షలు, మిగిలింది జీఎస్టీ కింద చూపించారు. ఈ టెండర్‌ను ఆర్‌డబ్ల్యూఎస్‌ గూడూరు డివిజన్‌ ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీరు(ఈఈ) పరిధిలో పిలిచారు. ఆ టెండర్‌లో ఎక్స్‌పీరియన్స్‌ ఉన్న వారు మాత్రమే పాల్గొనాలని నిబంధన పెట్టారు. అయితే ఈఈ పరిధిలో పిలిచే వర్కులకు ఇంత వరకు ఎప్పుడూ ఎక్స్‌పీరి యన్స్‌ అడగలేదని, ఓ కాంట్రాక్టర్‌కు మేలు చేసేందుకే ఈ నిబంధన పెట్టారని  అప్పట్లో పలువురు కాంట్రాక్టర్లు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిసింది. జిల్లాలోని కాంట్రాక్టర్లకు ఎక్స్‌పీరియన్స్‌ ఉన్నప్పటికీ పిలిచింది షార్ట్‌ టెండర్‌ (వారం రోజులు) కావడంతో సర్టిఫికెట్‌ తెచ్చుకునే సమయం లేకుండా పోయిందని చెబుతున్నారు. ఈ కారణంగా టెండర్‌ను ఎవరూ వేయలేకపోయారు.ఒకరిద్దరు మాత్రమే వేయడంతో కేవలం 1.80 శాతం లెస్‌కు మాత్రమే టెండర్‌ దక్కినట్లు తెలుస్తోంది. అయితే ఆ ఏడాది గూడూరు డివిజన్‌ పరిధిలో మిటాత్మకూరు ప్రాజెక్టుతో పాటు మరో 17 తాగునీటి ప్రాజెక్టులకు కూడా టెండర్లు పిలిచారు. కానీ వాటిలో ఎక్కడా కూడా ఎక్స్‌పీరియన్స్‌ నిబంధన లేకపోవడం గమనార్హం. 


నిబంధన తొలగించారు...

ఇక ఈ ఏడాది కూడా మిటాత్మకూరు సీపీడబ్ల్యూఎస్‌ పథకం నిర్వహణకు ఇటీవల టెండర్లు పిలిచారు. కింది స్థాయి అధికారులు ఎక్కువ మొత్తం అంచనాతో ప్రతిపా దనలు  పంపగా జిల్లా అధికారులు వాటిని తగ్గించినట్లు తెలిసింది. ఈ దఫా ఎస్టిమేట్‌ విలువ రూ.50 లక్షలు దాటడంతో ఈఈ పరిధిలో కాకుండా ఎస్‌ఈ పరిధిలో టెండర్లు ఆహ్వానించారు. మొత్తం రూ.91 లక్షలు ఎస్టిమేషన్‌ వేయగా అందులో సెప్టెంబరు తర్వాత చేసే పనికి ఈసీవీ రూ.28 లక్షలు, విద్యుత్‌ చార్జీలు రూ35 లక్షలుగా అంచనా వేశారు. మిగిలినది ఏప్రిల్‌ నుంచి సెప్టెంబరు జరిగిన నిర్వహణకు కేటాయించారు. అయితే ఈ ఏడాది పిలిచిన టెండర్లలో ఎక్స్‌పీరియన్స్‌ నిబంధన తొలగించారు. నిబంధనల ప్రకారం మిటాత్మకూరు సీపీడబ్ల్యూఎస్‌ నిర్వహణ వర్కుకు ఎక్స్‌పీరియన్స్‌ అవసరం లేదని, అందుకే ఆ నిబంధన తొలగించినట్లు జిల్లా అధికారులు చెబుతు న్నారు. ఫలితంగా ఈ ఏడాది ఎక్కువ మంది కాంట్రాక్టర్లు టెండర్లు వేశారు. పోటీ పెరగడంతో టెండర్‌ 36 శాతం లెస్‌కు దిక్కింది. దీంతో ప్రభుత్వానికి ఎక్కువ మొత్తం ఆదా అయింది. మరి ఈసీవీ విలువ  గతేడాది తక్కువైనప్పటికీ ఎక్స్‌పీరియన్స్‌ నిబంధన ఎందుకు పెట్టారో అధికారులే చెప్పాలి. అయితే గతేడాది, ఈ ఏడాది రెండు సార్లూ పనులు దక్కించుకున్నది ఒకే కాంట్రాక్టర్‌ కావడం గమనార్హం. 


నిర్వహణపై ఆరోపణలు

ఇదిలా ఉంటే గతేడాది డిసెంబరు నుంచి మార్చి వరకు పిలిచిన టెండర్‌లో విద్యుత్‌ చార్జీల అంచనాను దాదాపు రూ.16 లక్షలకు పైగానే అంచనా వేశారు. అటు వేపినాపి, ఇటు చుట్టుపాలెం వద్ద ఆ స్థాయిలో మోటార్లు వేస్తేనే గ్రామాలకు సరిపడా తాగునీరు అందించగలుగుతామని ముందుగా భావించారు. ఎంబుక్‌ కూడా 121 రోజులకు నమోదు చేశారు. ఎస్టిమేషన్‌ ప్రకారం సరాసరి నెలకు రూ.4 లక్షలకు పైగా విద్యుత్‌ చార్జీలు రావాలి. కానీ అందులో నాలుగో వంతు కూడా రాలేదని తెలుస్తోంది. దీన్ని బట్టి చూస్తే ఎక్కువ సేపు గ్రామాలకు నీరు సరఫరా చేయలేదని స్పష్టమవుతోంది. అయితే కోట, వాకాడు వంటి చిన్న సీపీడబ్ల్యూఎస్‌ పథకాలకు కూడా అదే సమయంలో నెలకు దాదాపు రూ.4 లక్షల వరకు విద్యుత్‌ బిల్లులు రావడం గమనార్హం. పరిస్థితి ఇలాఉంటే బిల్లులు మాత్రం పూర్తిస్థాయిలో నమోదు చేశారని, మరమ్మతుల పేరుతో కూడా బాగా ఖర్చు చేసినట్లు చూపారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. కాగా మిటాత్మకూరు పథకం గత కాంట్రాక్టర్లు నిర్వహణ సరిగా చేయలేదని, ఆ కారణంగానే ఎక్స్‌పీరియన్స్‌ ఉండే కాంట్రాక్టర్‌ అయితే సరిగా చేస్తారన్న ఉద్దేశంతో టెండర్‌లో నిబంధన పెట్టినట్లు సంబంధిత  అధికారులు చెబుతున్నారు. గత కాంట్రాక్టర్‌ సరిగా నిర్వహణ చేయకుండా అప్పగిస్తే వారిపై రికవరీ పెట్టేందుకు అవకాశం ఉంది. మరి అది చేశారా.. అన్నది అధికారులు ప్రజలకు చెప్పాల్సి ఉంది. 


 ఎక్స్‌పీరియన్స్‌ అవసరం లేదు..

గతేడాది టెండర్లు గూడూరు ఈఈ పరిధిలో పిలిచారు. ఆ డేటా ఈఈ కార్యాలయంలో ఉంది. డబుల్‌ పాకెట్‌ సిస్టమ్‌లోకి వస్తేనే ఎక్స్‌పీరియన్స్‌ అడగాలని, సింగిల్‌ పాకెట్‌ సిస్టమ్‌లో అవసరం లేదని నిబంధనల్లో ఉంది. 

- శ్రీనివాసకుమార్‌, ఆర్‌డబ్ల్యూఎస్‌ ఎస్‌ఈ


నిర్వహణ బాగా చేస్తారనే..  

మిటాత్మకూరు లాంటి ప్రాజెక్టు జిల్లాలో మరొకటి లేదు. గతంలో ప్రాజెక్టు నిర్వహణ సరిగా లేకపోవడంతో ఎక్స్‌పీరియన్స్‌ కాంట్రాక్టర్‌ అయితే నిర్వహణ బాగా చేస్తారన్న కారణంతో టెండర్‌లో ఎక్స్‌పీరియన్స్‌ నిబంధన పెట్టాం. 

- నాగజ్యోతి, ఆర్‌డబ్ల్యూఎస్‌ గూడూరు ఈఈ