Abn logo
Sep 21 2021 @ 00:30AM

మరో నాటోగా క్వాడ్‌ కూటమి

ప్రపంచంలో వివిధ దేశాల ప్రభుత్వాలు మారినా ప్రభుత్వాధినేతల మధ్య సంబంధాలు, విదేశీ నీతి పెద్దగా మారే అవకాశాలు లేవు. అయితే మారిన అంతర్జాతీయ పరిణామాలు తప్పకుండా చర్చించే అంశాలపై ప్రభావం చూపుతాయి. ఈ నేపథ్యంలో నరేంద్రమోదీ సెప్టెంబర్ 22–27 తేదీల మధ్య జరుపుతున్న మరో చరిత్రాత్మక అమెరికా పర్యటనకు కీలక ప్రాధాన్యం ఉన్నది. ఏడేళ్ల క్రితం బాధ్యతలు చేపట్టినప్పటి నుంచీ ప్రధానమంత్రి అమెరికా సందర్శించడం ఇది ఐదోసారి. వెళ్లిన ప్రతిసారీ ఆయనకు అక్కడి ప్రజలు, భారతీయులే కాదు, అధికార ప్రతిపక్ష నేతలు కూడ నీరాజనాలు పట్టారు. 2019 సెప్టెంబర్‌లో హ్యూస్టన్‌లో జరిగిన హౌడీ మోదీ సదస్సులో అప్పటి అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌తో పాటు అనేకమంది కాంగ్రెస్‌, రిపబ్లిక్ నేతలు హాజరై ఆయనకు ఘనస్వాగతం పలకడం మోదీకి ఆ దేశంలో ఉన్న జనాదరణకు సంకేతం. ఇప్పుడు అమెరికాలో ప్రభుత్వం మారిన తర్వాత కూడా మోదీ పర్యటన గతంలో మాదిరే అక్కడి ప్రజల్లో ఆసక్తిని రేకెత్తించడంలో ఆశ్చర్యం లేదు.


గత జనవరిలో అధ్యక్షుడు జో బైడెన్ అధికారం చేపట్టిన తర్వాత మోదీ ఆయనను కలుసుకోబోవడం ఇదే మొదటిసారి. 2020 నవంబర్‌లో అధ్యక్ష ఎన్నికల్లో బైడెన్ గెలిచిన తర్వాత మోదీ ఆయనను అభినందించారు, ఆ తర్వాత ఇరుదేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యం, కొవిడ్‌పై పోరుకు సంబంధించి రెండుసార్లు ఫోన్‌లో సంభాషించారు. ప్రస్తుతం బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ అమెరికాలో పర్యటిస్తున్నారు. మోదీ ఆయనతో కూడా కీలక చర్చలు జరిపే అవకాశం ఉన్నది


మోదీ అమెరికా పర్యటన, ఈ సందర్భంగా వివిధ దేశాధినేతలతో చర్చించనుండడం ప్రపంచ రాజకీయాల్లో ఆయన ప్రాధాన్యతను స్పష్టం చేస్తోంది. మోదీ పర్యటనకు ముందే అమెరికా దౌత్యవేత్త జాన్ కెర్రీ, రక్షణ మంత్రి లాయిడ్ జె ఆస్టిన్, విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ వేర్వేరుగా భారతదేశం వచ్చి అనేక కీలక అంశాలపై చర్చించి వెళ్లారు. 22న మోదీ వాషింగ్టన్‌లో అడుగుపెట్టిన రోజు నుంచీ ఒక్క క్షణం తీరిక లేకుండా సమావేశాలు పెట్టుకున్నారు. భారతీయ సంతతికి చెందిన అమెరికా ఉపాధ్యక్షురాలు కమలాహారిస్, ఆపిల్ సంస్థ అధిపతి టిం కుక్‌తో సహా ఉన్నతస్థాయి వ్యాపారవేత్తలతో కూడా ఆయన సమావేశమవుతున్నారు. ఐక్యరాజ్యసమితి సాధారణ అసెంబ్లీలో సైతం ఆయన ప్రసంగించనున్నారు. అలా ప్రసంగించడం ఇది నాలుగోసారి కాగా, ఈసారి మొట్టమొదటి వక్తగా మోదీకి బృహత్తర అవకాశం లభించింది..


మోదీ అమెరికా దేశాధినేతలతో మాత్రమే కాకుండా ఆస్ట్రేలియా ప్రధానమంత్రి స్కాట్ మారిసన్, జపాన్ ప్రధానమంత్రి యోషిహిడే సుగాలతో కూడా ద్వైపాక్షిక చర్చలు జరుపనున్నారు. అఫ్ఘానిస్తాన్ పరిణామాలు, చైనా విస్తరణవాదం నేపథ్యంలో క్వాడ్ పేరిట ఈ నాలుగు దేశాలు ఏర్పరచుకున్న కూటమి నేతలు జో బైడెన్ ఆహ్వానం మేరకు వైట్‌హౌస్‌లో జరుపుతున్న ముఖాముఖి సమావేశానికి ఎంతో ప్రాముఖ్యం ఉన్నది. సైబర్, మారిటైమ్ రక్షణ, అంతర్జాతీయ భద్రతకు సంబంధించిన విషయాలతో పాటు భారతదేశంలో వందకోట్ల కొవిడ్ వాక్సిన్‌లను ఉత్పత్తి చేయాలన్న అంశంపై క్వాడ్‌లో చర్చించనున్నారు. 


గత మార్చిలో జరిగిన క్వాడ్ సమావేశంలో ఈ నాలుగు దేశాలు భారత్‌–పసిఫిక్ ప్రాంతంలో చైనా విస్తరణను చర్చించాయి. అమెరికా సైన్యాలు ఉపసంహరించుకున్న తర్వాత అఫ్ఘానిస్థాన్‌ను తాలిబాన్లు స్వాధీనపరుచుకోవడం కూడా ఈసారి చర్చకు రానున్నది. క్వాడ్ సమావేశానికి బైడెన్-, హారిస్ పరిపాలనా యంత్రాంగం కీలక ప్రాధాన్యతనిస్తున్నదని వైట్‌హౌస్‌ ప్రెస్ సెక్రటరీ ఇప్పటికే ప్రకటించారు. ఈ సమావేశం చరిత్రాత్మకమైనదని, భారత్‌, జపాన్, అమెరికా దేశాధినేతలతో జరిగే చర్చల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నానని ఆస్ట్రేలియా ప్రధానమంత్రి మారిసన్ కూడా ప్రకటన చేశారు. నిజానికి మోదీ అమెరికా పర్యటనకు ముందే భారత్‌,- ఆస్త్రేలియా మంత్రిత్వస్థాయిలో చర్చలు జరిపాయి. రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, విదేశాంగమంత్రి జయశంకర్ ఆస్ట్రేలియా రక్షణ, విదేశాంగమంత్రులతో చర్చలు జరిపారు. అఫ్ఘానిస్థాన్‌లో దీర్ఘకాల శాంతి, సుస్థిరత ఏర్పడేందుకు వీలుగా ఒక విశాల ప్రాతిపదిక గల, అందరికీ భాగస్వామ్యం ఏర్పర్చగల ప్రభుత్వం ఉండాలని, అక్కడి మహిళలకు, పిల్లలకు రక్షణతో పాటు ప్రజాజీవనంలో పాల్గొనే అవకాశం ఉండాలని, ఈ రెండు దేశాల మంత్రులు కలిసికట్టుగా ప్రకటన చేశారు.


మారుతున్న అంతర్జాతీయ పరిణామాల నేపథ్యంలో క్వాడ్‌కు ఎంతో ప్రాధాన్యం ఉన్నది. ఒక దేశం ఆర్థికంగా బలోపేతమై విస్తరిస్తూ పోతూ, దేశాలను స్వాధీనం చేసుకుంటూ పోయినా, ఉగ్రవాద శక్తులకు ప్రోత్సాహం కల్పించినా ఇతర దేశాలు మౌనంగా ఉండవనే సందేశాన్ని క్వాడ్ ప్రపంచానికి ఇచ్చింది. 2004లో బంగాళాఖాతంలో సునామీ తర్వాత ఏర్పడ్డ ఈ నాలుగు దేశాల స్నేహం 2007లో జపాన్ ప్రధాని షింజో అబే చొరవతో ఒక కూటమిగా అవతరించింది. 2017లో మనీలాలోని ఆసియాన్ శిఖరాగ్ర సమావేశంలో డోనాల్డ్ ట్రంప్, షింజో అబే, మాల్కం ట్రంబెల్, నరేంద్రమోదీ కలిసికట్టుగా క్వాడ్ కూటమిని ఏర్పర్చుకున్నారు. 


ప్రధానమంత్రి నరేంద్రమోదీ హయాంలో ఈ దేశాలన్నిటితో బలమైన సంబంధాలు ఏర్పడ్డాయి. ఇవాళ రష్యాతో పాటు అమెరికా కూడా భారత్‌కు ఒక బలమైన రక్షణ భాగస్వామి. అమెరికాతో సైనిక విన్యాసాలు మాత్రమే కాక కలిసికట్టుగా రక్షణ ఉత్పత్తి, పరిశోధన, అభివృద్ధికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. భవిష్యత్‌లో అమెరికా, ఆస్ట్రేలియా, జపాన్, భారత్ మరో నాటోగా బలమైన శక్తిగా మారేందుకు రంగం సిద్ధమైంది. నిజానికి అఫ్ఘానిస్థాన్‌లో ప్రజాస్వామికంగా ఎన్నికైన ప్రభుత్వాలకు భారత్ ఎప్పుడూ మద్దతునిస్తోంది. ఆ దేశంలో 300 కోట్ల డాలర్లకు పైగా పెట్టుబడి పెట్టి  400 మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు సహాయం చేసింది. అఫ్ఘానిస్థాన్‌లో తాలిబాన్ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత కూడా స్నేహహస్తం చాచింది. అక్కడ ప్రభుత్వం ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పాలనను సాగిస్తే భారత్ వ్యతిరేకించాల్సింది ఏమీ ఉండదు. కాని భారత్‌లో సీమాంతర ఉగ్రవాదాన్ని ప్రేరేపించి విఫలమైన పాకిస్థాన్ అఫ్ఘాన్‌లో పరిణామాలను తమకు అనుకూలంగా ఉపయోగించుకుని సమస్యలను సృష్టించాలని ప్రయత్నిస్తే భారత ప్రభుత్వం చేతులు ముడుచుకుని కూర్చోలేదు. అదే సమయంలో తాలిబాన్లతో స్నేహసంబంధాలు పెంచుకుని వారికి నిధులు సరఫరా చేసేందుకు చైనా చేసే ప్రయత్నాలను కూడా భారత్ గమనించకపోలేదు.


ఉగ్రవాదులకు పాకిస్థాన్ అడ్డా కావడం, చైనా విస్తరణవాదం, చైనాకు–పాకిస్థాన్‌కు మధ్య ఉన్న సంబంధాలు వంటి అంశాలను మొత్తం ప్రపంచం గమనిస్తోంది. అదే సమయంలో అల్ ఖాయిదాకు పాకిస్థాన్ ఇచ్చిన ప్రోద్బలం కూడా ప్రపంచానికి తెలుసు. ఈ నేపథ్యంలో మోదీ అమెరికా పర్యటన, క్వాడ్ దేశాల సమావేశం పాకిస్థాన్‌కు, దాన్ని సమర్థించే శక్తులకూ ముచ్చెమటలు పోయించడంలో ఆశ్చర్యం లేదు. మోదీ ప్రస్తుత పర్యటనతో ప్రపంచ చిత్రపటంలో భారత్ మరింత బలమైన దేశంగా నిలదొక్కుకుంటుందనడంలో సందేహం లేదు.

వై. సత్యకుమార్

(బిజెపి జాతీయ కార్యదర్శి)