Abn logo
Sep 30 2020 @ 02:15AM

మరో మంగళవారం.. మరో అగ్ని ప్రమాదం.. బీరుట్‌లో..

Kaakateeya

బీరుట్: లెబనాన్ రాజధాని బీరుట్‌లో మరో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. పోర్టు సమీపంలో ఉన్న బీరుట్ హెడ్‌క్వార్టర్స్‌లోని ఎలక్ట్రిసైట్ డూ లిబాన్(ఈడీఎల్) బిల్డింగ్‌లో ఈ అగ్ని ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. అయితే ఈ అగ్ని ప్రమాదం వల్ల ఎటువంటి నష్టం జరగలేదని బీరుట్ ఫైర్ డిపార్ట్‌మెంట్‌కు చెందిన ఓ అధికారి వెల్లడించారు. నిమిషాల్లోనే పరిస్థితి అదుపులోకి వచ్చేసినట్టు పేర్కొన్నారు. ఈ అగ్ని ప్రమాదంలో కొన్ని పేపర్లు మాత్రమే దగ్దమయ్యాని.. ఇతర నష్టమేమీ జరగలేదని అధికారి స్పష్టం చేశారు. 

షార్ట్ సర్క్యూట్ వల్లే అగ్ని ప్రమాదం జరిగినట్టు ఈడీఎల్ ఉద్యోగులు చెబుతుండగా.. ప్రమాద కారణాలపై దర్యాప్తు జరుగుతున్నట్టు అధికారి తెలిపారు. ఆగస్టు 4న బీరుట్ పోర్ట్‌లో సంభవించిన భారీ పేలుళ్లను ప్రపంచం ఇంకా మర్చిపోలేదు. ఈ ప్రమాదంలో 190 మందికి పైగా ప్రాణాలు కోల్పోగా.. ఆరు వేల మందికి పైగా తీవ్ర గాయాలపాలయ్యారు. 


ఆగస్టు 4 ఘటన తరువాత కూడా బీరుట్ పోర్టులో రెండు సార్లు.. రెండు చోట్ల అగ్ని ప్రమాదాలు సంభవించాయి. సెప్టెంబర్ 15న నిర్మాణంలో ఉన్న ఓ బిల్డింగ్‌లో అగ్ని ప్రమాదం చోటుచేసుకోగా.. తాజాగా ఈడీఎల్ బిల్డింగ్‌లో మరో ప్రమాదం జరిగింది. విశేషమేంటంటే.. ఈ మూడు ప్రమాదాలు కూడా మంగళవారం రోజునే చోటుచేసుకున్నాయి. దీంతో సోషల్ మీడియాలో నెటిజన్లు తాజా ఘటనపై ‘మరో మంగళవారం.. మరో అగ్ని ప్రమాదం’ అంటూ ట్వీట్లు పెడుతున్నారు.

Advertisement
Advertisement
Advertisement