Abn logo
Oct 11 2021 @ 01:37AM

కొత్త పోస్టుల కిరికిరి

తెలంగాణ విశ్వవిద్యాలయంలో ఔట్‌ సోర్సింగ్‌ పోస్టుల భర్తీపై కొనసాగుతున్న వివాదం

అవసరాల పేరిట వివిధ డిపార్ట్‌మెంట్‌లలో పోస్టుల భర్తీ

నిబంధనలకు విరుద్ధంగా చేశారంటూ విద్యార్థి సంఘాల ఆరోపణలు

జిల్లావ్యాప్తంగా ఫిర్యాదులతో కదిలిన ఉన్నత విద్యాశాఖ అధికారులు

టీయూలో జరుగుతున్న వ్యవహారాలపై ప్రభుత్వానికి నిఘా వర్గాల నివేదిక 

నిజామాబాద్‌, అక్టోబరు 10(ఆంధ్రజ్యోతి ప్రతినిధి): జిల్లాలోని తెలంగాణ విశ్వవిద్యాలయంలో కొత్త పోస్టుల భర్తీ వివాదం సద్దుమనగడంలేదు. నిబంధనలకు విరుద్ధంగా పోస్టు లు భర్తీ చేశారని ఉన్నత విద్యాశాఖ అధికారులకు పలు విద్యార్థి సంఘాలు ఫిర్యాదు చేశాయి. ఈ విషయమై గత కొన్ని రోజులుగా ధర్నాలు కొనసాగిస్తున్నారు. ఉమ్మడి జిల్లా ప్రజాప్రతినిధులతో పాటు రాష్ట్రస్థాయి అధికారులకు ఫిర్యాదులు చేశారు. ఈ వివాదాల నేపథ్యంలో విశ్వవిద్యాలయంలో ఎలాంటి పోస్టులు భర్తీ చేయవద్దని ఉన్నత విద్యాశాఖ అధికారులు ఉత్తర్వులు ఇచ్చినా.. ఇప్పటికీ ఆగడంలేదు. అవసరాల పేరిట భారీగా పోస్టులను భర్తీ చేస్తున్నారు. చివరకు విశ్వవిద్యాలయం పరిధిలో జరుగుతున్న పోస్టుల భర్తీ, నిధుల వినియోగంపై ఇంటలిజెన్స్‌ అదికారులు నివేదిక ఇవ్వడంతో ఉన్నతాధికారులు కదిలారు. విశ్వవిద్యాలయానికి వచ్చి పరిశీలించి వెళ్లారు. విశ్వవిద్యాలయంలో జరుగుతున్న భర్తీ వంటి కార్యక్రమాలపై పలువురు ఉమ్మడి జిల్లా ప్రజాప్రతినిధులు కూడా సీరియస్‌గా ఉన్నారు.

అవసరాల పేరిట భారీగా భర్తీ 

టీయూ పరిధిలో గడిచిన నెల రోజులుగా అవసరాల పేరిట భారీగా ఉద్యోగాలను భర్తీ చేశారు. ఎలాంటి నోటిఫికేషన్‌ లేకుండానే సుమారు 108 పోస్టుల వరకు తీసుకున్నారు. ఔట్‌సోర్సింగ్‌ పద్ధతిలో ప్రస్తుత అవసరాల పేరిట డ్రైవర్‌ లు, వాచ్‌మన్‌లు, అటెండర్‌లు, వసతి గృహాల సిబ్బంది, జూనియర్‌ అసిస్టెంట్‌, ప్రొగ్రామర్స్‌ను భర్తీ చేశారు. ఇప్పటికే గడిచిన కొన్నేళ్లుగా పనిచేస్తున్న వారికి పదోన్నతులు కల్పించారు. విశ్వవిద్యాలయం కౌన్సిల్‌తో పాటు ఉన్నత విద్యాశాఖ, ఆర్థికశాఖ అనుమతులు తీసుకోకుండానే ఈ పోస్టులను భర్తీ చేశారు. విశ్వవిద్యాలయం పరిధిలో గడిచిన నెల రోజులు గా ఈ పోస్టులపై ధర్నాలు జరుగుతున్నా.. ఎవరూ పట్టించుకోవడం లేదు. పదోన్నతులు, ఔట్‌సోర్సింగ్‌ ద్వారా భర్తీలు కొనసాగుతూనే ఉన్నాయి. 

శాఖల అనుమతి తప్పనిసరి

రాష్ట్రంలో ఏ విశ్వవిద్యాలయంలోనైనా రెగ్యులర్‌, కాంట్రాక్ట్‌, ఔట్‌ సోర్సింగ్‌ పద్ధతిలో పోస్టులను భర్తీ చేయాలం టే ఉన్నత విద్యా శాఖ, ఆర్థికశాఖ అను మతులు తప్పనిసరిగా తీసుకోవాలి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం నోటిఫికేషన్‌ ఇవ్వాలి. దరఖాస్తులను స్వీకరించి రిటర్న్‌ టెస్టు లు, ఇంటర్య్వూలు నిర్వహించి పోస్టులను భర్తీ చేయాలి. అన్ని రిజర్వేషన్లను పాటించాల్సి ఉంటుంది. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా అన్ని విశ్వవిద్యాలయాల పరిధిలో పోస్టుల భర్తీపైన బ్యాన్‌ ఉంది. అవసరాల రిత్యా కూడా పోస్టులను భర్తీ చేసేందుకు అవకాశం లేదు. ఏదైనా పోస్టులు భర్తీచేయాలన్న తప్పనిసరి అనుమతులు తీసుకోవాలి.

చేతులు మారిన డబ్బులు?

టీయూ పరిధిలో జరిగిన పోస్టుల భర్తీకి ఎలాంటి అనుమతులు లేవు. భర్తీ చేసిన తర్వాత ఈసీ అనుమతి తీసుకుని ఉన్నత విద్యాశాఖకు పంపించి అను మతులు తెచ్చుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ పోస్టుల భర్తీలో ఎలాంటి అనుమతులను తీసుకోలేదు. ఇప్పటికీ ఈసీ సమావేశాన్ని నిర్వహించ లేదు. ఈ పోస్టుల భర్తీలో భారీగా డబ్బులు చేతులు మారాయి. రాష్ట్రస్థాయిలో తమకు ఉన్న పలుకుబడితో అనుమతులు తెచ్చుకోవచ్చని ముందస్తుగానే ఈ పోస్టు లను  భర్తీ చేశారు. విశ్వవిద్యాలయం పరిధిలో ఆదిలాబాద్‌ వరకు విస్తరిస్తున్నందున మరిన్ని పోస్టులు అవసరమని ముందే వీటిని భర్తీ చేస్తున్నారు. విశ్వవిద్యాలయం పరిధిలో ఇప్పటికే 278 వరకు ఔట్‌సోర్సింగ్‌ సిబ్బంది ఉన్నారు. ప్రస్తుతం చేరిన సిబ్బందితో 400 వరకు పెరిగాయి. పోస్టులను భర్తీ చేసే సమయంలో అనుమతులు తీసుకోవాల్సిన అధికారులు.. ఎలాంటి నోటిఫికేషన్‌ లేకుండా చేశారు. అర్హులైన వారి నుంచి దరఖాస్తులను స్వీకరించలేదు. తమకు అనుకూలమైన వారి వద్ద డబ్బులు తీసుకోవడంతో పాటు పలువురు వ్యక్తులు సిఫారసులు చేసిన వారికి కూడా పోస్టులను ఇచ్చారు. అందరికీ అనుకూలంగా భర్తీ చేయడం వల్ల తమకు ఏదీ కాదని అధికారులు భావిస్తున్నట్లు తెలుస్తుంది. 

ఉన్నతాధికారులకు ఫిర్యాదులు

విశ్వవిద్యాలయం పరిధిలో జరిగిన పోస్టుల భర్తీపైన విద్యార్థి సంఘాలు ఉమ్మడి జిల్లా ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లారు. వారికి వినతిపత్రాలు ఇచ్చా రు. రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ అధికారులతో పాటు గవర్నర్‌ కార్యాలయానికి కూడా లేఖలు పంపించారు. ఈ పోస్టుల భర్తీని నిలిపివేయాలని కోరారు. అయి నా ఇప్పటి వరకు భర్తీల ప్రక్రియ ఆగలేదు. యధావిధిగా కొనసాగడంతో పాటు తీసుకున్నవారికి కూడా విశ్వవిద్యాలయం పరిధిలో ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వ కుండానే కొనసాగిస్తున్నారు. ఆయా డిపార్ట్‌మెంట్‌ల వారికి పనులను కేటాయించారు. ఈ వివాదం భారీగా ముదరడంతో ఉమ్మడి జిల్లా నేతలు కూడా ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. వారి ఫిర్యాదుల ఆధారంగా రెండు రోజుల క్రితం విశ్వవిద్యాలయానికి వచ్చి  ఉన్నతాధికారులు పరిశీలించి వెళ్లారు.

టీయూకు ఇంటలిజెన్స్‌ అధికారులు

వర్సిటీ పరిధిలో జరిగిన పోస్టుల భర్తీతో పాటు నిధుల వినియోగంపై ఇంటలిజెన్స్‌ విభాగం అధికారులు టీయూకు వచ్చి వెళ్లారు. వర్సిటీలో ఇటీవల చోటు చేసుకున్న పలు అంశాలపై ప్రభుత్వానికి నివేదించారు. నోటిఫికేషన్‌ లేకుండా ఔట్‌సోర్సింగ్‌ ద్వారా భర్తీ చేయడం, డబ్బులు చేతులు మారడంతో పాటు వివాదంగా ఉన్న పోస్టుల్లో ఉన్నవారికి పదోన్నతులు కల్పించడం వంటి విషయాలను ప్రభుత్వానికి నివేదించారు. కొత్త వీసీ వచ్చిన తర్వాత నిధుల వినియోగంపైన కూడా పూర్తిస్థాయి నివేదిక ఇచ్చినట్లు తెలుస్తుంది. ఈ నివేదిక ఆధారంగా మరిన్ని వివరాలు కావాలని కోరడంతో రెండు రోజుల క్రితం మళ్లీ రెండో దఫా వివరాలను పంపించారు. ఒకటి రెండు రోజుల్లో ఈ నివేదిక ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. 

అవసరాలకు అనుగుణంగానే భర్తీ చేశాం..

విశ్వవిద్యాలయం పరిధిలో అవసరాలకు అనుగుణంగానే కొద్ది మందిని భర్తీ చేశామని వీసీ రవీంధర్‌గుప్త, రిజిస్ర్టార్‌ ప్రొఫెసర్‌ కనకయ్యలు తెలిపారు. విశ్వవిద్యాలయంలో ప్రత్యక్ష తరగతులు మొదలైన తర్వాత చాలా రిపార్ట్‌మెంట్‌లలో సిబ్బంది కొరత ఏర్పడిందన్నారు. కొన్ని డిపార్ట్‌మెంట్‌లలో కిందిస్థాయి సిబ్బంది లేకపోవడం వల్ల వీరిని తీసుకున్నామని, మొదట భర్తీ చేసిన తర్వాతనే కౌన్సిల్‌ అనుమతి తీసుకుని ఉన్నత విద్యాశాఖకు పంపిస్తామని వారు పేర్కొన్నారు. అంతేకాకుండా గతంలో చేసిన భర్తీలాగానే ప్రస్తుతం చేశామన్నారు. అర్హులైన వారికి మాత్రమే పదోన్నతులు కల్పించామన్నారు. కొంతమంది కావాలని ఈ పోస్టుల భర్తీపై రాజకీయం చేస్తున్నారని, అన్ని వివరాలను ఉన్నత విద్యాశాఖ అధికారులకు పంపించామని వారు స్పష్టం చేశారు.