Abn logo
Aug 3 2020 @ 04:45AM

పల్లెప్రగతికి పశుపోషణ ముఖ్యం

(ఆంధ్రజ్యోతి, రంగారెడ్డి అర్బన్‌): పల్లెప్రగతికి పశుపోషణ ముఖ్యమని జిల్లా పశువైద్య, పశుసంవర్థక శాఖ అధికారి డా.విజయకుమార్‌రెడ్డి అన్నారు. జాతీయ కృత్రిమ గర్భధారణ కార్యక్రమంలో భాగంగా ఆయన ‘ఆంధ్రజ్యోతి’తో ఆదివారం మాట్లాడారు. కృత్రిమ గర్భధారణతో కలిగే లాభాలను జిల్లాలోని రైతులకు వివరిస్తున్నామని పేర్కొన్నారు. పాడి పశువులలో జన్యు లక్షణాల మెరుగుదలకు అనుసరించే సాంకేతిక పద్ధతులే కృత్రిమ గర్భధారణ అని తెలిపారు.


ఈ పద్ధతిలో అత్యు న్నత జన్యు లక్షణాలు కలిగిన దున్నలు, ఆంబోతులను ఎంపిక చేసి, వాటి నుంచి సేకరించిన వీర్యాన్ని ఆడ పశువుల గర్భధారణకు అనుకూలమైన సమయంలో వాటి ప్రత్యుత్పత్తి నాళంలో ప్రవేశపెడతారని తెలిపారు. దేశవాళీ పశుజాతిని మేలుజాతి పశువులుగా అభి వృద్ధి చేస్తూ పాల దిగుబడిని పెంచాలనే ఉద్దేశంతో జాతీయ గర్భధారణ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నామని పేర్కొన్నారు.


2019 సెప్టెంబరు నుంచి 2020 మే 31వరకు మొదటి విడత జాతీయ కృత్రిమ గర్భధారణలో రంగారెడ్డి జిల్లాలో 20వేల పశువులకు ఉచిత కృత్రి గర్భదారణ వేసేందుకు లక్ష్యంగా పెట్టు కోగా24,603 పశువులకు కృతిమ గర్భధారణ సూదులు వేశామన్నారు. రెండో దశ ఆగస్టు1 నుంచి 2021 మే31 వరకు చేపడుతామని తెలిపారు. ఈసారి జిల్లాలో 47,500 పశువులకు ఉచితంగా కృత్రిమ గర్భధారణ చేసేందుకు లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు. జిల్లాలో 475 రెవెన్యూ గ్రామాలు ఉండగా గ్రామానికి వంద చొప్పున పశువులకు కృత్రిమ గర్భధారణ చేస్తామన్నారు. జిల్లాలో సుమారు 2 లక్షల వరకు ఎదకు వచ్చే అవకాశమున్న పశువులున్నాయని వాటిన్నింటికీ కృత్రిమ గర్భధారణ చేయనున్నట్లు ఆయన తెలిపారు. 

Advertisement
Advertisement