Abn logo
Sep 12 2020 @ 04:28AM

కంపు.. కంపు!

Kaakateeya

రోడ్డు పక్కనే జంతు కళేబరాలు

నిర్లక్ష్యంగా మున్సిపాలిటీ అధికారులు

ఆందోళన చెందుతున్న ప్రజలు


షాద్‌నగర్‌: మున్సిపాలిటీలను సర్వాంగసుందరంగా తీర్చిదిద్దుతామని ఓవైపు మంత్రులు, ఎమ్మెల్యేలు చెబుతున్న తరుణంలో షాద్‌నగర్‌ మున్సిపాలిటీ పరిధిలోని 1వ వార్డులో పరిస్థితి ప్రజలను ఆందోళనకు గురిచేస్తుంది. అడ్వకేట్‌ కాలనీ నుంచి సీఎ్‌సకే కాలనీకి వెళ్ళే దారి పక్కన ఎటుచూసినా జంతు కళేబరాలు, వ్యర్థ పదార్థాలు, చెత్తాచెదారం, పనికిరాని వస్తువులు కుప్పలు కుప్పలుగా దర్శనమిస్తున్నాయి. ఆ ప్రాంతంలో అధికంగా తోళ్ళ వ్యాపారం చేసేవారు, పాత సామాన్లు సేకరించి వ్యాపారం చేసేవారు ఉన్నారు. ప్రతిరోజు వారు సేకరించిన వస్తువుల్లో పనికిరాని వాటిని రోడ్డు పక్కన పారేస్తుంటారు. జంతువుల తోళ్ళ వ్యాపారం చేసేవారు కూడా వ్యర్థ పదార్థాలను రోడ్డు పక్కనే పారవేస్తుంటారని స్థానికులు చెబుతున్నారు.


అంతే కాకుండా చెత్తాచెదారాన్ని తగలబెడుతుండడంతో పెద్ద ఎత్తున పొగ వ్యాపించి చుట్టుపక్కల కాలనీల్లో నివసించే ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ఇంత తతంగం నడుస్తున్నా... ప్రజాప్రతినిధులుగానీ, అధికారులుగానీ పట్టించుకోకపోవడం దారుణమని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు ప్రత్యేకచొరవ తీసుకుని జంతు కళేబరాలు, వ్యర్థపదార్థాలు, చెత్తా చెదారాన్ని ఇష్టానుసారంగా రోడ్ల పక్కన వేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు. 


చర్యలు చేపడతాం..-  కె. నరేందర్‌, మున్సిపల్‌ చైర్మన్‌, షాద్‌నగర్‌

 రోడ్ల పక్కన జంతు కళేబ రాలు, వ్యర్థ పదార్థాలు వేస్తున్న విష యం గురించి షాద్‌నగర్‌ మున్సిపల్‌ చైర్మన్‌ కె. నరేందర్‌ను వివరణ కోరగా... ఈ విషయం తమ దృష్టికి రాలేదని, అక్కడ ఇష్టానుసారంగా వ్యర్థాలు, జంతు కళేబరాలు పారవేసే వారిపై తప్ప కుండా చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. ఇలాంటివి ప్రజలు తమ దృష్టికి తేవాలని కోరారు. 

Advertisement
Advertisement