Abn logo
Jul 10 2020 @ 23:17PM

ఏపీని టెక్స్‌టైల్ హబ్‌గా మారుస్తాం : మంత్రి మేకపాటి

అమరావతి : రాష్ట్రంలో వస్త్ర పరిశ్రమను అన్ని విధాలుగా తీర్చిదిద్ది ఏపీని టైక్స్‌టైల్​ హబ్‌గా మారుస్తామని పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం నాడు ‘ఇన్వెస్ట్ ఇండియా ఎక్స్‌క్లూజివ్ ఇన్వెస్ట్‌మెంట్ ఫోరమ్ వెబినార్’లో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కార్యక్రమంలో ఆయన.. వస్త్ర తయారీ పరిశ్రమలకు నెలవైన ఏపీలో ‘టోరె’ సహా ఎన్నో పరిశ్రమలు ఉన్నాయన్నారు. కరోనా విజృంభిస్తూ  ఆర్థిక ఇబ్బందులున్న సమయంలోనూ సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అండగా నిలిచారని చెప్పుకొచ్చారు. చేనేత రంగానికి సంబంధించిన బకాయిలను (సుమారు రూ.1300కోట్లు) ఈ ఏడాది చెల్లించనున్నామని మంత్రి ఈ సందర్భంగా తెలిపారు.


రాష్ట్రాభివృద్ధిలో సత్తా చాటుతాం!

రాష్ట్రంలో ఉత్పత్తైన నూలును ఫాబ్రిక్‌గా మార్చడం, గార్మెంట్స్, గ్లోబల్ టెక్స్‌టైల్ రంగంలో గమ్యస్థానంగా మార్చడంపై ప్రత్యేక చర్యలు తీసుకున్నాం. వస్త్ర తయారీరంగంలో ఆంధ్రప్రదేశ్‌ను ప్రత్యేకంగా నిలిపేలా మౌలిక సదుపాయాలు అందిస్తాం. ‌టైల్ పార్కుల ఏర్పాటుకు ముందుకొచ్చేవారికి 50 శాతం రాయితి ఇస్తాం. దిగుమతి, ఎగుమతులు సహా పోర్టులకు సమీపంలో కారిడార్ల ద్వారా రవాణా సంబంధిత అంశాలలో అనుసంధానం చేసి సహకరిస్తాం. మార్కెటింగ్, బ్రాండింగ్‌కు అవసరమైన సదుపాయాల కల్పనలో ప్రభుత్వం ముందుంటుంది. చేనేత రంగానికి ప్రభుత్వం అన్ని విధాల బాసటగా ఉంటుంది. 30 స్కిల్ కాలేజీలను ఏర్పాటు చేసి, ప్రతిభ, నైపుణ్యం కలిగిన సహజ మానవ వనరులను సృష్టిస్తాం. అన్నిరంగాలలో పెట్టుబడులకు ఆంధ్రప్రదేశ్‌ను శాశ్వత గమ్యస్థానంగా మార్చుతాం. నియమనిబంధనలు పాటిస్తూనే వాణిజ్యాన్ని విస్తరించే చర్యలు చేపడుతున్నాం. పారిశ్రామికాభివృద్ధి, రాష్ట్రాభివృద్ధిలో సత్తా చాటుతాం. పెట్టుబడులు, పరిశ్రమలను తీసుకువచ్చేందుకు అనువైన అన్ని మార్గాలను అన్వేషిస్తున్నాం అని వెబినార్‌లో మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి చెప్పుకొచ్చారు. కాగా.. శుక్రవారం మధ్యాహ్నం టెక్స్‌టైల్ రంగంపై ఇన్వెస్ట్ ఇండియా నిర్వహించిన వెబినార్‌ను కేంద్ర చేనేత శాఖ మంత్రి శ్రీమతి స్మృతి ఇరానీ ప్రారంభించారు.

Advertisement
Advertisement
Advertisement