Abn logo
Jun 4 2020 @ 03:42AM

బోర్డును బెజవాడకు మార్చాలి!

  • వరదలో వాడుకునే నీటికి లెక్కలొద్దు
  • సాగర్‌ ఎడమ కాల్వ నుంచి తెలంగాణ తోడేస్తోంది
  • కేఆర్‌ఎంబీకి ఆంధ్రప్రదేశ్‌ లేఖ.. నేడే కృష్ణా బోర్డు సమావేశం


హైదరాబాద్‌/అమరావతి, జూన్‌ 3 (ఆంధ్రజ్యోతి): కృష్ణా నదీ యాజమాన్య సంస్థ (కేఆర్‌ఎంబీ) కార్యాలయాన్ని విజయవాడకు మార్చాలని ఆంధ్రప్రదేశ్‌ విజ్ఞప్తి చేసింది. రాష్ట్ర విభజన చట్టంలో పేర్కొన్న విధంగా కార్యాలయాన్ని హైదరాబాద్‌ నుంచి విజయవాడకు తరలించాలని బుధవారం కృష్ణా బోర్డుకు లేఖ రాసింది. కృష్ణా నదికి వరదలు వచ్చిన సమయంలో వాడుకునే నీటిని లెక్కల్లోకి తీసుకోవద్దని కోరింది. రెండు రాష్ట్రాల మధ్య జలవివాదాలపై బోర్డు గురువారం సమావేశం కానున్న సంగతి తెలిసిందే. హైదరాబాద్‌లోని జలసౌధలో బోర్డు చైర్మన్‌ పరమేశం ఆధ్వర్యంలో జరిగే ఈ భేటీకి ఇరు రాష్ర్టాల ఇరిగేషన్‌ శాఖ కార్యదర్శులు, ఈఎన్‌సీలు, ఇతర అధికారులు పాల్గొంటారు. ఈ సమావేశంలో చర్చించే ఎజెండా అంశాలను పంపించాల్సిందిగా బోర్డు కోరడంతో ఆంధ్ర ప్రభుత్వం బుధవారం ఆ అంశాలను పంపించింది. నాగార్జున సాగర్‌ ఎడమ కాల్వ నుంచి నీటిని తెలంగాణ తోడేస్తోందని ఆరోపించింది. అలాగే... తెలంగాణ ప్రభుత్వం నిర్మిస్తున్న పాలమూరు-రంగారెడ్డి, డిండి వంటి ప్రాజెక్టుల డీపీఆర్‌లు కావాలని, సామర్థ్యాన్ని పెంచిన కల్వకుర్తి, నెట్టెంపాడు, ఎస్‌ఎల్‌బీసీ వంటి ప్రాజెక్టులపై చర్చించాలని కోరింది.


తొలిగా తెలంగాణే డీపీఆర్‌లు ఇవ్వాలి

రాష్ట్ర విభజన తర్వాత గోదావరి, కృష్ణా నదులపై నిరిస్తున్న కొత్త ప్రాజెక్టుల సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్‌)లు సమర్పించాలని కృష్ణా, గోదావరి బోర్డులు రెండు రాష్ట్రాలను ఆదేశించిన సంగతి తెలిసిందే. కృష్ణా బోర్డు గురువారం, గోదావరి బోర్డు శుక్రవారం సమావేశాలు జరుపనున్నాయి. శ్రీశైలం వద్ద తాము తలపెట్టిన రాయలసీమ దుర్భిక్ష నివారణ పథకం కొత్తదేమీ కాదని ఆంధ్ర ఇప్పటికే స్పష్టం చేసింది. అయినప్పటికీ డీపీఆర్‌ ఇచ్చేందుకు అభ్యంతరం లేదనీ తెలిపింది. అయితే.. డీపీఆర్‌ల సమర్పణలో ‘ఫస్ట్‌ కమ్‌ ఫస్ట్‌ సబ్మిట్‌’ విధానాన్ని పాటించాలని, తెలంగాణ ప్రభుత్వమే మొదట కొత్త పథకాలను చేపట్టినందున.. ముందుగా అదే నివేదికలను సమర్పించాలని డిమాండ్‌ చేస్తోంది.

Advertisement
Advertisement
Advertisement