Abn logo
Jan 7 2021 @ 04:05AM

ఆండాళ్‌ పాశురాలు - ముక్తికి సోపానాలు

‘‘రియే మనకు శరణం, హరికి మించిన శరణం లేదు సుమా!’’ అంటూ హరినామమే సర్వస్వంగా బతికిన విష్ణుభక్తుడు.. విల్లిపుత్తూరుకు చెందిన విష్ణుచిత్తుడు. ఆయనకు  ‘పెరియాళ్వార్‌’ అనే పేరు కూడా ఉంది. ‘పెరియాళ్వార్‌’ అనగా ‘పెద్ద భక్తుడు’ అని అర్థం. పెరియాళ్వార్‌కు తులసీ వృక్షమూలంలో దొరికిన భూ పుత్రిక పేరే ‘గోదాదేవి’. తండ్రి విష్ణుచిత్తుడు ఎక్కువగా భాగవతం నుంచి శ్రీకృష్ణలీలలు వినిపిస్తుంటే ఆమె దానిలో లీనమై తనను కూడా ఒక గోపికగా భావించుకుని పరవశించిపోతుండేది. ఆయన రక్షణలో పెరిగిన ఆమె.. తాను ధరించిన పూలమాలలను శ్రీరంగనాథ స్వామికి పంపేది. తాను ధరించిన పూలమాలలను స్వామివారికి పంపింది కాబట్టి ఆమెకు ‘ఆముక్త మాల్యద’ అని పేరు వచ్చింది. తన గారాలపట్టి చేసిన పొరపాటు తెలుసుకున్న విష్ణుచిత్తుడు.. తనను, తన బిడ్డను కరుణించమని శ్రీరంగని ప్రార్థిస్తాడు. ఆ ప్రార్థనను మన్నించిన శ్రీ రంగనాథుడు ప్రత్యక్షమై.. ఆమె సాక్షాత్తూ భూదేవి అవతారమని, ఆమె ధరించిన పూల మాలలను, పద్యమాలలను తనకు సమర్పించడానికే భూమి మీద అవతరించిందని చెప్పాడు. ఇక నుంచి కూడా ఆమె ఘనత గ్రహించి, ఆమె ధరించిన మాలలనే తనకు ధరింపజేయాలని చెప్పి అంతర్థానమయ్యాడు. ఆ ఆనందంలో పెరియాళ్వార్‌ గోదాదేవిని.. ‘ఆండాళ్‌’ అని కొనియాడాడు. ఆండాళ్‌ అంటే కాపాడేది అని అర్థం. ఈ విధంగా ఆమెకు ఆండాళ్‌, గోదాదేవి, శూడిక్కొడుత్తార్‌’’ (పూలమాలలు ధరించి ఇచ్చునది) అనే పేర్లు వచ్చాయి. హరి సంయోగానికై తన బిడ్డ పడే పాట్లు తండ్రి పెరియాళ్వార్‌ హృదయాన్ని కదిలించి వేశాయి. అందుచేత ఆమెతో ‘‘అమ్మా నీలాగానే పూర్వం గోపికలు కూడా శ్రీకృష్ణుని చేరడానికి ఎన్నో ఉపాయాలు చేశారు.

కానీ అవి ఫలించలేదు. చివరకు వారు ‘ధనుర్మాసం’లో గౌరీ దేవిని గురించి నెల రోజుల పాటు నోము నోచారు. ఫలించింది. నీవు కూడా ఈ మాసంలో స్వామి కోసం వ్రతాన్ని ఆచరిస్తే నీ కోరిక తప్పక నెరవేరుతుంద’’ని చెప్పాడు. అప్పటినుంచి ‘ఆండాళ్‌’ కూడా రోజుకొక పాట చొప్పున శ్రీరంగనిపై కవిత కట్టి పాడసాగింది. అలా ఆమె రచించిన ముప్పై పాశురాలు (పాటలు) గల దివ్య ప్రబంధమే ‘తిరుప్పావై’గా ప్రసిద్ధి కెక్కింది. ‘తిరుప్పావై’ అనగా ‘సంపత్కరమైన ఛందస్సు’ అని అర్థం. ఛందోబద్ధమైన ఈ పాశురాలతో శ్రీవిష్ణువునర్చించిన వారి కోరికలు తప్పక నెరవేరుతాయి. కనుక దీనికి ‘‘సంపత్కరమైన నోము’’ అనే అర్థం కూడా ఉంది. ముప్పై పాశురాలతో ముప్పై రోజులపాటు ఆమె నోము నోయడంతో.. చివరిరోజు శ్రీరంగడు ఆమెకు స్వప్నంలో కనిపించి ‘‘ప్రియా! నీ హృదయపరిపక్వతకు మెచ్చాను. నిన్ను తప్పక పెళ్ళాడుతాను. కనుక నీ తపోనియమాలు వీడి నేడు సర్వభోగాలు అనుభవించు’’ అని ఆనతిచ్చాడు. అలా ఆమె సర్వభోగాలనూ అనుభవించిన రోజుకే ‘భోగి’ అనే పేరు వచ్చింది. దాన్నే ఇప్పటికీ మనం ‘భోగి’ పండుగగా జరుపుకొంటున్నాం.

- మేఘశ్యామ (ఈమని),

8332931376


Advertisement
Advertisement
Advertisement