Abn logo
Oct 10 2021 @ 00:19AM

అముల్‌ అడుగులు

తొలివిడతగా 165 పాలసేకరణ కేంద్రాలు

అధిక పాలదిగుబడి వచ్చే ప్రాంతాల్లో ఏఎంసీలు 

నవంబరు 15లోగా ఏర్పాటుకు ఆదేశాలు

లీటరుకు రూ.4-5 అదనపు చెల్లింపులు?

పాడిరైతులకు అవగాహన కార్యక్రమాలు


 జిల్లాలోనూ అముల్‌ అడుగులు పడుతున్నాయి. వచ్చే నెల 15వ తేదీ నుంచి పాలసేకరణకు రంగం సిద్ధమవుతోంది. ఈలోపే బల్క్‌ మిల్క్‌ కూలింగ్‌ (బీఎంసీ) సెంటర్ల ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నుంచి జిల్లా యంత్రాంగానికి ఆదేశాలు అందాయి. ప్రభుత్వం భాగస్వామ్యంతో అముల్‌ సంస్థ ఏర్పాటు చేసే బీఎంసీ కేంద్రాల్లో పాల పోసే రైతులకు అదనంగా లీటరుకు దాదాపు రూ.4 నుంచి రూ.5 వరకు చెల్లించే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.


నెల్లూరు (వ్యవసాయం), అక్టోబరు 9 : జిల్లాలో 1,77,858 తెలుపు, 7,45,829 నల్ల పశువులు ఉన్నాయి. ఒక్కరోజు దాదాపు 2లక్షల లీటర్ల పాలసేకరణ జరుగుతున్నట్లు అంచనా. జిల్లాలో దాదాపు 16 ప్రైవేటు డెయిరీలతోపాటు విజయ డెయిరీకి పాడిరైతుల నుంచి పాలు అందుతోంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వ భాగస్వామ్యంతో జిల్లాలో అముల్‌ సంస్థకు చెందిన బీఎంసీల ఏర్పాటుకు ఆదేశాలు వచ్చాయి. జిల్లాలో ఏయే గ్రామాల్లో పాడి ఎక్కువగా ఉంది.. రోజుకు ఎన్ని లీటర్లు పశువుల పాలిస్తున్నాయనే విషయాలపై అధికారులు దృష్టి సారించారు. జిల్లావ్యాప్తంగా ఉన్న 660 రైతు భరోసా కేంద్రాల వద్దే ఈ బీఎంసీలను ఏర్పాటు చేయాలని ఉన్నతాధికారులు స్పష్టం చేశారు. పంచాయతీరాజ్‌, డ్వామా, పశుసంవర్థకశాఖలతోపాటు మరికొన్ని శాఖల సమన్వయంతో మొదటి విడతలో 165 బీఎంసీ కేంద్రాలను నవంబరు 15వతేదీలోగా పూర్తి చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. 2వేల లీటర్లకుపైన పాలదిగుబడి ఉన్న ప్రాంతాలను ఎంపిక చేసేపనిలో అధికారులు నిమగ్నమయ్యారు. పాడిరైతులకు అముల్‌ సంస్థ పాలసేకరణపై అవగాహన కల్పించే దిశగా అవగాహన కార్యక్రమాలు చేపట్టేలా ప్రణాళికలు రూపొందిస్తున్నారు. 2వేల లీటర్ల కంటే తక్కువ పాలదిగుబడి వచ్చే ప్రాంతాల్లో ఆటోమేటిక్‌ మిల్క్‌ కూలింగ్‌ (ఏఎంసీ) కేంద్రాలు ఏర్పాటు చేస్తారు.


లీటరుకు అధిక చెల్లింపులు?

అముల్‌ సంస్థ ఏర్పాటు చేసే ఆయా పాలసేకరణ కేంద్రాలకు పాలుపోసే పాడిరైతులకు అధికంగా ఇచ్చే అవకాశాలు ఉన్నాయని అధికారులు చెబుతున్నాయి. సాధారణంగా లీటరు పాలకు రూ.60 నుంచి రూ.65 పాడిరైతులకు అందుతోంది. అముల్‌ సంస్థ లీటరుకు వెన్న శాతం బట్టి దాదాపు రూ.4 నుంచి రూ.5 మేర అధికంగా లభిస్తుందని అధికారుల అంచనా. ఆయా కేంద్రాల్లో పనిచేసేందుకు మహిళలకు ప్రాధాన్యం ఇస్తున్నారు. మహిళా పాల ఉత్పత్తుల సహకార సంఘాలు ఏర్పాటు చేసే దిశగా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. కంప్యూటర్‌  జ్ఞానం కలిగిన అదే గ్రామానికి చెందిన పాలు పోయని మహిళను కార్యదర్శిగా ఏర్పాటు చేసి పాలసేకరణ చేసేలా ప్రణాళికలు రూపొందిస్తున్నారు. వారం వారం పేమెంట్‌ అందించడం జరుగుతుందని అధికారులు భావిస్తున్నారు.


165 కేంద్రాల ఏర్పాటుకు ఆదేశాలు అందాయి

జిల్లాలో రైతు భరోసా కేంద్రాల వద్ద మొదటి విడతగా 165 పాల సేకరణ కేంద్రాలు ఏర్పాటు చేయాలని ఆదేశాలు అందాయి. నవంబరు 15లోగా ఆయా కేంద్రాలు అందుబాటులోకి తీసుకురావాల్సి ఉంది. గ్రామాల ఎంపికతోపాటు పాడి పాపులేషన్‌, ఎన్ని లీటర్లు వస్తున్నాయనే దానిపై దృష్టి పెట్టాం. అంతకుమించి ఎలాంటి గైడ్‌లైన్స్‌ లేవు. ప్రస్తుతానికి రూట్‌మ్యా్‌పపైనే దృష్టి పెట్టాం.

- బి.మహేశ్వరుడు, పశుసంవర్థక శాఖ, జేడీ