Oct 19 2021 @ 12:09PM

KBC 13: తండ్రిని, కూతురిని కలిపిన Amitabh Bachchan!

అమితాబ్ బచ్చన్.. వెండితెర పైనే కాదు.. బుల్లితెరపై కూడా మెగాస్టార్‌గా సత్తా చాటుతున్నారు. కౌన్ బనేగా కరోడ్‌పతి కార్యక్రమాన్ని ప్రారంభించి దిగ్విజయంగా నడిపిస్తున్నారు. ఇప్పుడు ఈ కార్యక్రమం 13వ సీజన్ జరుగుతోంది. తాజాగా ఈ కార్యక్రమానికి హాజరైన కంటెస్టెంట్‌కు అమితాబ్ మధురమైన జ్ఞాపకాన్ని అందించారు. ఎన్నో రోజుల క్రితం దూరమైన తండ్రికి ఆమెను తిరిగి దగ్గర చేశారు. మహారాష్ట్రకు చెందిన భాగ్యశ్రీ అనే మహిళ సోమవారం కేబీసీ-13లో హాట్ సీట్‌లోకి వచ్చారు. 


గేమ్ మధ్యలో ఆమె తన వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడారు. తాను ప్రేమ వివాహం చేసుకున్నాననే కారణంతో తన తండ్రి తనను దూరం పెట్టారని చెప్పారు. పెళ్లి తర్వాతి నుంచి ఆయన తనతో మాట్లాడలేదని, తన కూతురిని కలవడానికి కూడా తండ్రి ఇష్టపడలేదని చెప్పారు. దీంతో కెమేరా వైపు చూస్తూ తండ్రికి ఏమైనా సందేశం చెప్పమని భాగ్యశ్రీని అమితాబ్ అడిగారు. ఆయన ఈ కార్యక్రమం చూస్తే తప్పకుండా స్పందిస్తారని అన్నారు. దీంతో భాగ్యశ్రీ తన తండ్రికి క్షమాపణలు చెప్పారు. అనంతరం అమితాబ్.. ఆమెకు సర్‌ప్రైజ్ అందించారు. 


కార్యక్రమం జరుగుతుండగానే భాగ్య శ్రీ తండ్రికి అమితాబ్ ఫోన్ చేశారు. కూతురితో మాట్లాడించారు. భాగ్య శ్రీ తండ్రి మాట్లాడుతూ.. ఇద్దరి మధ్యా కొన్ని రోజులుగా మాటలు లేవని, అయినా తన ఆశీస్సులు ఎప్పుడూ ఆమెతోనే ఉంటాయని అన్నారు. ఎలాంటి టెన్షన్ లేకుండా గేమ్ ఆడమని ప్రోత్సహించారు. భాగ్య శ్రీతోపాటు కార్యక్రమానికి వచ్చిన అల్లుడితో కూడా మాట్లాడారు. దీంతో భాగ్య శ్రీ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. కన్నీళ్లతో ఆమె అమితాబ్‌కు ధన్యవాదాలు తెలిపింది. 

Bollywoodమరిన్ని...