Advertisement
Advertisement
Abn logo
Advertisement
Aug 3 2021 @ 20:11PM

ఆర్థిక ఇబ్బందుల్లో పాకిస్థాన్... ప్రధాన మంత్రి అధికారిక నివాసం అద్దెకు...

ఇస్లామాబాద్ : ఆర్థిక కష్టాల్లో ఉన్న పాకిస్థాన్ మరో దారిలేక ప్రధాన మంత్రి అధికారిక నివాసాన్ని అద్దెకు పెట్టింది. ఈ నివాసాన్ని విశ్వవిద్యాలయంగా మార్చనున్నట్లు ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వం 2019 ఆగస్టులో ప్రకటించింది. ఆ తర్వాత ఆయన ఆ ఇంటిని ఖాళీ చేశారు. తాజాగా విశ్వవిద్యాలయంగా మార్చాలనే ప్రతిపాదనను విరమించుకుని, ప్రైమ్ మినిస్టర్స్ హౌస్‌ను అద్దెకు ఇవ్వాలని ఫెడరల్ ప్రభుత్వం నిర్ణయించినట్లు పాకిస్థాన్ మీడియా వెల్లడించింది. 


పాకిస్థాన్ మీడియా కథనాల ప్రకారం, ప్రైమ్ మినిస్టర్స్ హౌస్‌లో అత్యాధునిక విద్యా సంస్థను ఏర్పాటు చేస్తామని ఫెడరల్ ప్రభుత్వం గతంలో ప్రకటించింది. కానీ ఇటీవల జరిగిన ఫెడరల్ కేబినెట్ భేటీలో ఈ ప్రతిపాదనను విరమించుకున్నారు. ఇస్లామాబాద్‌లోని రెడ్ జోన్‌లో ఉన్న ఈ ప్రాంగణంలో సాంస్కృతిక, ఫ్యాషన్, విద్యా సంబంధిత కార్యక్రమాలను నిర్వహించేందుకు అద్దెకు ఇవ్వాలని నిర్ణయించారు. ఈ కార్యక్రమాల నిర్వహణ సమయంలో ప్రైమ్ మినిస్టర్స్ హౌస్ గౌరవ, మర్యాదలకు భంగం కలగకుండా క్రమశిక్షణతో వ్యవహరించేలా చూడాలని నిర్ణయించారు. దీనికోసం రెండు కమిటీలను ఏర్పాటు చేశారు. 


ప్రధాన మంత్రి ఇమ్రాన్ ఖాన్ తన బని గల నివాసంలో ఉంటున్నారు. అధికారిక కార్యకలాపాల కోసం ప్రధాన మంత్రి కార్యాలయాన్ని వినియోగిస్తున్నారు. ఆయన అధికారం చేపట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు పాకిస్థాన్ ఆర్థిక వ్యవస్థ 19 బిలియన్ డాలర్లు పతనమైంది. ప్రభుత్వ ఖర్చులను తగ్గించుకోవడానికి ఆయన అనేక పొదుపు చర్యలను అమలు చేస్తున్నారు. 


Advertisement
Advertisement