Abn logo
May 21 2020 @ 20:18PM

భారత పోలీసు వ్యవస్థపై అమెరికన్ పాస్టర్ సంచలన వ్యాఖ్యలు

షెల్బీవిల్లే, టెన్నెస్సీ: క్రైస్తవ సమావేశాల కోసం భారత్‌కు వచ్చిన అమెరికన్ పాస్టర్ బ్రైన్ నెర్రెన్ చేయని తప్పుకు ఏడేళ్ల జైలుశిక్ష అనుభవించారు. ఎట్టకేలకు కోర్టు ఆయన నిర్దోషి అని తీర్పు ఇవ్వడంతో వెంటనే అమెరికా వెళ్లిపోయారు. అమెరికా చేరుకున్నాక ఆయనను చూసి కుటుంబసభ్యులు కన్నీటి పర్యంతమయ్యారు. విమానంలో నుంచి అమెరికాను చూసిన వెంటనే తనకు ఏడుపు వచ్చేసిందని బ్రైన్ చెబుతున్నారు. తాను గడిచిన 20 ఏళ్లలో మిషన్ ట్రిప్స్ పనిమీద ఎన్నో దేశాలకు వెళ్లి తిరిగి అమెరికా వచ్చానని.. కానీ ఇప్పుడు భారత్ నుంచి అమెరికాకు వచ్చిన అనుభవం కొత్తగా ఉందని బ్రైన్ అన్నారు. పాస్టర్ బ్రైన్.. ఏషియన్ చిల్డ్రన్స్ ఎడ్యుకేషన్ ఫెలోషిప్ అనే మినిస్ట్రీను నడుపుతున్నారు. ఈ మినిస్ట్రీ భారత్, నేపాల్‌లోని సండే స్కూల్ టీచర్స్‌కు ట్రైనింగ్ ఇస్తుంది. గతేడాది అక్టోబర్ ఐదో తేదీన మిషన్ పనిమీద బ్రైన్ భారత్‌కు రాగా.. అతడి దగ్గరున్న వివిధ కరెన్సీలను చూసి అధికారులు అరెస్ట్ చేశారు. మినిస్ట్రీకి సంబంధించిన ఫండ్స్ అని చెప్పినప్పటికి.. అధికారులు బ్రైన్‌ను నేరస్థుడిగా గుర్తించి ఫారెన్ ఎక్స్ఛేంజ్ మేనేజ్‌మెంట్ యాక్ట్‌ ఉల్లంఘన కింద బ్రైన్‌ను అరెస్ట్ చేశారు. 


అప్పటి నుంచి పశ్చిమబెంగాల్‌లోని సిలిగురి నగరంలో ఉన్న జైల్లోనే శిక్ష అనుభవిస్తూ వచ్చారు. ఆయనను చూసేందుకు ఎవరికి అనుమతి ఇవ్వకపోవడం.. పైగా ఆయన అమెరికాకు చెందిన వాడు కావడంతో చేసేది లేక జైల్లోనే గడుపుతూ రావాల్సి వచ్చింది. ది అమెరికన్ సెంటర్ ఫర్ లా అండ్ జస్టిస్(ఏసీఎల్‌జే) బ్రైన్‌ను బయటకు తెచ్చేందుకు ప్రయత్నిస్తూనే వచ్చింది. అమెరికన్ ఎంబసీ, అమెరికన్ కాంగ్రెస్ మెంబర్స్, నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్, స్టేట్ డిపార్ట్‌మెంట్ ఇలా అందరూ బ్రైన్‌ను విడిపించేందుకు కష్టపడుతూ వచ్చారు. ఎట్టకేలకు ఏడు నెలల తరువాత బ్రైన్ నిర్దోషి అని.. చేయని తప్పుకు శిక్ష అనుభవించారని కోర్టు తీర్పునిచ్చింది. కాగా.. తాను శిక్ష అనుభవించినప్పటికి తన మిషన్‌ను ఆపేది లేదని బ్రైన్ స్పష్టం చేశారు. ప్రతి ఏడాది భారత్, నేపాల్ వెళ్తూనే ఉంటానని అన్నారు. ఇదిలా ఉంటే.. ప్రపంచంలో అత్యంత దుర్వినియోగమైన పోలీసు వ్యవస్థల్లో భారత్ కూడా ఒకటని బ్రైన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. భారత పోలీసులు సొంత ప్రజలనే బెదిరిస్తారని, వారిని దోపిడీ చేసి బ్లాక్ మెయిల్ చేస్తారని అన్నారు. అయినప్పటికి దేవుడు ఎలా అయితే భారత్, నేపాల్ దేశాలను ప్రేమిస్తున్నాడో తాను కూడా ప్రేమిస్తూనే ఉంటానన్నారు. ఈ రెండు దేశాల్లో మరింత పెట్టుబడి పెట్టి పిల్లలకు సహాయం చేస్తానని అన్నారు. 

Advertisement
Advertisement
Advertisement