Advertisement
Advertisement
Abn logo
Advertisement

బురదలో కూరుకుపోయిన అంబులెన్స్.. అర్ధరాత్రి అల్లాడిపోయిన గర్భిణి

మంచిర్యాల: అభివృద్ధి పథంలో దూసుకుపోతున్నామని పాలకులు చెబుతున్నా గ్రామాల్లో మాత్రం పరిస్థితులు భిన్నంగా ఉన్నాయి. కనీస అవసరాలు సైతం ప్రజలకు అందుబాటులో ఉండటంలేదు. ఒక్కోసారి ప్రాణాలను సైతం పణంగా పెట్టాల్సి వస్తోంది. కొన్ని గ్రామాల్లో అయితే ఇప్పటికీ సరైన రోడ్డు మార్గం లేదు. దీంతో అత్యవసర పరిస్థితుల్లో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రోడ్లు బాగోలేక అర్ధరాత్రి ఓ నిందు గర్భిణి పురిటినొప్పులతో అల్లాడిన ఘటన మంచిర్యాల జిల్లా రాజారాంలో చోటు చేసుకుంది.


గ్రామానికి చెందిన బురుజు శిరీషకు నెలలు నిండటంతో పురిటినొప్పులు వచ్చాయి. కుటుంబ సభ్యులు వెంటనే ఆమెను వేమన్నపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తీసుకెళ్లారు. వైద్యులు చెన్నూరు ఏరియా ఆస్పత్రికి వెళ్లాలని సూచించారు. వెంటనే ఆస్పత్రి అంబులెన్స్‌లో శిరీషను తీసుకుని బయల్దేరారు. అప్పటికే అర్ధరాత్రి అయింది. చెన్నూరు వెళ్లాలంటే మధ్యలో ఉన్న గొర్లపల్లి వాగు దాటాలి. వాగుపై వంతెన నిర్మాణ పనులు పూర్తి కాకపోవడంతో అప్రోచ్ రోడ్ వేశారు. అంబులెన్స్ కాస్త ఆ రోడ్డుపై ఉన్న బురదలో కూరుకుపోయింది.


అర్ధరాత్రి సమయం నిండు గర్భిణి పురిటి నొప్పులతో బాధ పడుతున్నారు. అంబులెన్స్ బురదలో చిక్కుకుపోయింది. ఏడుపులు, అవస్థతో కుటుంబసభ్యులు ఆందోళన చెందారు. అంబులెన్స్ సిబ్బంది ఎంత ప్రయత్నం చేసినా బురదలో నుంచి వాహనం కదల్లేదు. అప్పటికే చాలా సమయం గడిచింది. దీంతో శిరీషను అంబులెన్స్‌ను దించి బైక్‌పైనే కొంతదూరం తీసుకెళ్లారు. అక్కడి నుంచి మోసుకుంటూ వాగు దాటారు. అప్పటికే సమాచారం ఇవ్వడంతో అక్కడికి మరో 108 వాహనం చేరుకుంది. అదృష్టవశాత్తు ఆమెకు ఏమీ జరగలేదు. ఆడబిడ్డకు జన్మనిచ్చింది. తల్లీబిడ్డ క్షేమంగా ఉన్నారని వైద్యులు చెప్పడంతో కుటుంబసభ్యులు ఊపిరిపీల్చుకున్నారు. 


Advertisement
Advertisement