Abn logo
Oct 23 2021 @ 00:14AM

గరగపర్రులో అంబేడ్కర్‌ విగ్రహం ఏర్పాటు చేయాలి

ఆర్‌అండ్‌బీ రోడ్డుపై నిరసన ప్రదర్శన చేస్తున్న దళితులు

పాలకోడేరు, అక్టోబరు 22 : గరగపర్రు పాత పంచాయతీ భవనం వద్దే అంబేడ్కర్‌ విగ్రహం ఏర్పాటుకు పంచాయతీ తీర్మానం చేసి ఇవ్వాలని దళితులు డిమాండ్‌ చేశారు. ఈ మేరకు గ్రామంలోని ఆర్‌అండ్‌బీ రహదారిపై శుక్రవారం ధర్నా చేపట్టారు. సుమారు నాలుగేళ్ల కిందట పాత పంచాయతీ భవనం వద్ద అంబేడ్కర్‌ విగ్రహాన్ని దళితులు ఏర్పాటు చేశారు. అయితే ఈ ప్రాంతంలో అంబేడ్కర్‌ విగ్రహాన్ని పెట్టనివ్వమంటూ అగ్ర కులాలు అడ్డుకుని దళితులను వెలివేశారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న దళితులంతా ఏకమై ధర్నాలు, రాస్తారోకోలు చేపట్టారు. అప్పటి నుంచి అంబేడ్కర్‌ విగ్రహం పోలీసుల పహరీలోనే అదే భవనం వద్ద ఉండిపోయింది. ఇటీవల కొత్త పాలకవర్గం గ్రామంలో ఉన్న మంచినీటి చెరువు గట్టున వినాయక గుడి నిర్మించేందుకు తీర్మానం చేశారు. దీంతో ఆగ్రహించిన దళితులు అంబేడ్కర్‌ విగ్రహం ఏర్పాటుకు తీర్మానం చేయమంటే ఎందుకు చేయరంటూ ఆందోళనకు దిగారు. గొడవ పెద్దదవుతుందని గ్రహించిన వినాయక గుడి సంఘ సభ్యులు అంబేడ్కర్‌ విగ్రహం వివాదం పరిష్కారం అయ్యాకే తమ గుడి కట్టుకుంటామని చెప్పడంతో ధర్నా విరమించారు. ఈ కార్యక్రమంలో ఎస్‌.వెంకటరత్నం, ఏరిచర్ల రాజేష్‌, విప్పర్తి సురేష్‌, దత్తాల రాజేష్‌, పండు బాబు, ఇస్సాకు తదితర మహిళలు పాల్గొన్నారు.