Jul 28 2021 @ 16:55PM

సుమన్ క్లాప్‌తో మొదలైన ‘అల్లుడు బంగారం’

శ్రీ వెంకట లక్ష్మీ నరసింహ ప్రొడక్షన్స్ పతాకంపై అజయ్ కుమార్, శ్రీ లక్ష్మీ హీరోహీరోయిన్లుగా.. వెంకటనరసింహ రాజ్ దర్శకత్వంలో లావణ్య చంద్రశేఖర్ నిర్మిస్తోన్న చిత్రం ‘అల్లుడు బంగారం’. ఈ చిత్ర పూజా కార్యక్రమం బుధవారం హైదరాబాద్‌లోని రామానాయుడు స్టూడియోలో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన నటుడు సుమన్ హీరోహీరోయిన్లపై తొలి ముహూర్తపు సన్నివేశానికి క్లాప్ కొట్టగా. కమెడియన్ పృథ్వి కెమెరా స్విచ్చాన్ చేశారు. దర్శకుడు సముద్ర తొలి సన్నివేశానికి గౌరవ దర్శకత్వం వహించారు.


ఈ సందర్భంగా సుమన్ మాట్లాడుతూ.. ‘‘కరోనా మొదలవ్వక ముందే ఈ కథను దర్శకుడు నాకు చెప్పాడు. ఆర్. నారాయణమూర్తిగారి దగ్గర కో డైరెక్టర్‌గా పనిచేసిన దర్శకుడు నరసింహ.. మంచి కథను తయారు చేసుకున్నాడు. ఇందులో నేను, పృథ్వీ స్నేహితులుగానూ, శత్రువులుగానూ నటించాము. సినిమా మంచి విజయం సాధించి టీమ్‌కు మంచి పేరు రావాలని కోరుకుంటున్నాను..’’ అని తెలపగా.. నటుడు పృథ్వీ మాట్లాడుతూ.. ‘‘అన్నాచెల్లెళ్ళ అనుబంధాన్ని తీసుకొని ఒక అద్భుతమైన కథను తయారు చేసుకున్నాడు దర్శకుడు. రైతులు మీద, నకిలీ విత్తనాలతో రైతులు ఎలాంటి ఇబ్బందులు గురి అవుతున్నారని తెలుపుతూ పొలిటికల్ టచ్‌తో ఆయన ఈ కథను రెడీ చేశాడు. మంచి మెసేజ్ ఉంది’’ అని అన్నారు.


దర్శకుడు వెంకటనరసింహా రాజ్ మాట్లాడుతూ... ‘‘గత 20 సంవత్సరాలుగా 24 శాఖలలో పని చేశాను. నారాయణమూర్తిగారి దగ్గర రెండు సంవత్సరాలు కో డైరెక్టర్‌గా పని చేశాను. ఆ అనుభవంతో స్వచ్ఛమైన పల్లెటూరి కథ రాసుకొని సుమన్‌గారికి చెప్పడం జరిగింది. నిర్మాత లావణ్య చంద్ర శేఖర్ గారు ఇంతకుముందు ‘చాటింగ్’ సినిమాను నిర్మించారు. మంచి టీంను సెలెక్ట్ చేసుకొని నిర్మాతకు నేనీ కథ చెప్పడం జరిగింది. లవ్, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో నటులంతా నా గురువులే. హైదరాబాద్, రాజమండ్రి, కాకినాడ, వైజాగ్, అమలాపురం తదితర ప్రాంతాల్లో షూటింగ్ జరుపుకుంటుంది. నేను చెప్పిన ఈ కథను నమ్మి నాకీ అవకాశం కల్పించిన నిర్మాతకు నా కృతజ్ఞతలు..’’ అన్నారు.


నిర్మాత లావణ్య చంద్ర శేఖర్ మాట్లాడుతూ.. దర్శకుడు నాకు చెప్పిన కథ నచ్చడంతో ఈ సినిమా చేస్తున్నాను. ఫాదర్ - డాటర్ సెంటిమెంట్, బ్రదర్- సిస్టర్ సెంటిమెంట్, బావ- మరదల సెంటిమెంట్ ఇలా చిన్న పిల్లల దగ్గర నుండి పెద్దల వరకు అందరూ చూసే విధంగా ఈ చిత్రం ఉంటుంది. ఈ చిత్రం మా బ్యానర్‌కే కాకుండా ఇందులో నటించిన నటీనటులకు, సాంకేతిక నిపుణులకు మంచి పేరు తీసుకువస్తుందని ఆశిస్తున్నాను. ప్రారంభోత్సవానికి వచ్చి ఆశీర్వదించి, అభినందనలు తెలిపిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు..’’ అన్నారు.