Abn logo
Jan 21 2021 @ 00:21AM

ఆ సంతృప్తి కోసమే కృషి చేశా!

టెన్త్‌ రాష్ట్రస్థాయిలో మూడో ర్యాంకర్‌.. ఇంటర్‌లో స్టేట్‌ టాపర్‌...

కర్ణాటకలో మన తెలుగమ్మాయి వీణా ఎస్‌. రెడ్డి సాధించిన విజయాలివి.

తాజాగా ‘ఆలిండియా కంపెనీ లా క్విజ్‌’ పోటీలో ప్రథమ స్థానంలో నిలిచి తన సత్తాను మరోసారి 

చాటారామె. ఈ స్థాయిలో రాణించడం వెనుక తన కృషి గురించీ, అనుసరించిన ప్రణాళికల గురించీ నవ్యతో 

ప్రత్యేకంగా పంచుకున్న విశేషాలివి.


‘‘జాతీయ స్థాయిలో ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ కంపెనీ సెక్రటరీస్‌ ఆఫ్‌ ఇండియా నిర్వహించే ‘ఆల్‌ ఇండియా కంపెనీ లా క్విజ్‌’ పోటీలు చాలా ప్రతిష్టాత్మకమైనవి. కొవిడ్‌ కారణంగా ఈసారి ఈ పోటీల ప్రక్రియ రెండు నెలలకు పైగా... ఆన్‌లైన్‌, ఎలక్ర్టానిక్‌ మాధ్యమాల ద్వారా జరిగింది. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి లక్షమందికి పైగా పాల్గొన్నారు. ఛార్టర్డ్‌ అకౌంటెన్సీ పూర్తి చేశాను కాబట్టి ఈ పోటీల మీద నాకు కొంత అవగాహన ఉంది. కొవిడ్‌ వల్ల ఇంటి పట్టునే ఉండడం వల్ల మరింత శ్రద్ధగా ప్రిపేర్‌ అయ్యే అవకాశం వచ్చింది. పోటీదారుల్ని వారి ప్రాంతాల ప్రకారం నాలుగు రీజియన్లుగా విభజించారు. రెండు రౌండ్ల ప్రక్రియ ముగిసేసే సరికి... పోటీదారులు పదుల సంఖ్యలోకి వచ్చారు. మూడో రౌండ్‌ చివరకు మిగిలింది నలుగురమే! కర్ణాటక నుంచి ప్రాతినిధ్యం వహించింది నేను మాత్రమే! తుది పోటీ ఉత్కంఠ భరితంగా సాగింది. ఇటీవల ప్రకటించిన ఫలితాల్లో... నేను పాల్గొన్న ప్రొఫెషనల్‌ ప్రోగ్రామ్‌ విభాగంలో... జాతీయ విజేతగా నేను నిలిచాను. యాభై వేల నగదు బహుమతి గెలుచుకున్నాను. ఎంతో పోటీని తట్టుకొని ఇలా రాణించడం నాకు ఎంతో సంతోషంగా ఉంది. 


మా నాన్న జగన్నాథరెడ్డిది ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు జిల్లా నల్లప్పగారి పల్లి గ్రామం. ఆయన బెంగళూరులో ఇరవయ్యేడేళ్ళ నుంచీ చార్డర్డ్‌ అకౌంటెన్సీ కంపెనీ నిర్వహిస్తున్నారు. మా అమ్మ పేరు లక్ష్మీదేవి. ఎమ్మెస్సీ బిఈడీ చదివారు. మాకు చదువు మీద ఆసక్తి పెరగడానికీ, రాణించడానికీ వారిద్దరే. కారణం. మా అక్క తనురెడ్డి చార్టర్డ్‌ అకౌంటెన్సీ కోర్సు చేసింది. ప్రస్తుతం లఖనవ్‌ ఐఐఎంలో ఎంబిఏ చదువుతోంది. బాగా చదవాలి. మంచి మార్కులు తెచ్చుకోవాలి... ఇదే నా తపన. పదో తరగతి వరకూ నా చదువు బెంగళూరులోని కుమరన చిల్డ్రన్‌ హోమ్‌లో సాగింది. టెన్త్‌లో 97.60 మార్కుల్తో రాష్ట్రస్థాయిలో మూడో ర్యాంక్‌లో పాసయ్యాను. ఆ తరువాత జయనగర్‌ జైన్‌ కళాశాలలో పీయూ చదివాను. కామర్స్‌లో 98.83 శాతం మార్కులు సాధించాను. కామర్స్‌ విభాగంలో స్టేట్‌ ఫస్ట్‌ నాదే! అదే ఏడాది... అంటే 2017లోనే ఛార్టర్ట్‌ అకౌంటెన్సీ ఎంట్రన్స్‌ రాశాను. తొలిసారే డిస్టింక్షన్‌లో పాసయ్యాను. ఆ తరువాత సిఎ-ఐపీసీసీ, అకౌంటెన్సీ ఫైనాన్సింగ్‌లో ఇందిరాగాంధీ ఓపెన్‌ యూనివర్సిటీ నుంచి డిగ్రీ, కంపెనీ సెక్రటరీ ఎగ్జిక్యూటివ్‌ పరీక్ష, ఛార్టర్డ్‌ అకౌంటెన్సీ ఫైనల్స్‌... ఇవన్నీ నాలుగేళ్ళలో పూర్తి చేశాను.  

పోటీలు నాకు కొత్త కాదు. కిందటి ఏడాది ఐబీబీఐ నిర్వహించిన నేషనల్‌ క్విజ్‌లో టాప్‌-10లో నిలిచాను. చదువంటే నాకెంతో ఇష్టం. కానీ దానికే పరిమితమైపోలేదు. యోగా, పాటలు పాడడం, నృత్యం, సంగీతం, బ్యాడ్మింటన్‌, అథ్లెటిక్స్‌... ఇలా అనేక అంశాల్లో నాకు ప్రవేశం ఉంది. భిన్నమైన శైలిలో రచనలు చేయడంపై ఆసక్తి ఎక్కువ. సీఏ చదువుతున్నప్పుడు విద్యార్థుల సదస్సులో ‘కార్పొరేట్‌ గవర్నెన్స్‌ అండ్‌ ది రోల్‌ ఆఫ్‌ ఇండిపెండెంట్‌ డైరెక్షన్‌’ అనే అంశంపై ఒక పత్రం సమర్పించాను. దానికి మంచి స్పందన వచ్చింది. 

2017లో పీయూలో నేను స్టేట్‌ ఫస్ట్‌ సాధించినందుకు అభినందిస్తూ కర్ణాటక గవర్నర్‌ వాజుభాయ్‌ వాలా ప్రత్యేకంగా లేఖ రాయడం ఎప్పటికీ మరచిపోలేను. నేను రాసిన ప్రతి పరీక్షలోనూ ఏదో ఒక ర్యాంక్‌ సాధించాను. అయితే ర్యాంక్‌ కోసం చదవలేదు. నూరు శాతం ప్రయత్నం చేశాననే సంతృప్తి కోసమే కృషి చేశాను. తరగతి ఏదైనా మంచి ప్రణాళికతో, క్రమశిక్షణతో చదివితే ఎవరైనా మంచి మార్కులు, ర్యాంకులు దక్కించుకోవచ్చు.’’


హిందూపురం రవి, బెంగళూరు

Advertisement
Advertisement
Advertisement