Abn logo
Mar 11 2020 @ 04:48AM

ఈసారైనా దక్కేనా!

తొలి టైటిల్‌ వేటలో సింధు, సైనా

నేటి నుంచి ఆల్‌ ఇంగ్లండ్‌ బ్యాడ్మింటన్‌ 


ప్రపంచాన్ని ఓవైపు కరోనా భయం నీడలా వెంటాడుతుండగానే.. మరోవైపు ప్రతిష్ఠాత్మక ఆల్‌ ఇంగ్లండ్‌ బ్యాడ్మింటన్‌ టోర్నమెంట్‌కు తెర లేవనుంది. ఇంగ్లండ్‌లోనూ ఈ వైరస్‌ ప్రభావం తీవ్రంగానే ఉన్నా, నిర్వాహకులు టోర్నీ జరిపేందుకే నిర్ణయం తీసుకున్నారు. అయితే భారత్‌ నుంచి పలువురు షట్లర్లు ఈ టోర్నీకి దూరం కాగా.. స్టార్‌ షట్లర్‌ 

పీవీ సింధు, వెటరన్‌ సైనా నెహ్వాల్‌, కిడాంబి శ్రీకాంత్‌ తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు.


బర్మింగ్‌హామ్‌: కెరీర్‌లో ఒక్కసారైనా విజేతగా నిలవాలని ప్రతీ షట్లర్‌ కలలు కనే ఆల్‌ ఇంగ్లండ్‌ బ్యాడ్మింటన్‌ టోర్నీ బుధవారం ఆరంభం కానుంది. ఈసారి ప్రపంచ చాంపియన్‌ హోదాలో పీవీ సింధు బరిలోకి దిగబోతోంది. కరోనా భయంతో ఇప్పటికే చాలా మంది షట్లర్లు ఈ టోర్నీకి దూరమయ్యారు. ఇందులో భారత్‌ నుంచి ప్రణయ్‌, డబుల్స్‌ జోడీ చిరాగ్‌ శెట్టి-సాత్విక్‌ సాయిరాజ్‌ సహా ఏడుగురు ఆటగాళ్లున్నారు. అయితే సింధుతో పాటు సైనా, శ్రీకాంత్‌ తదితర ఆటగాళ్లు మాత్రం ఆదివారం ఇక్కడికి చేరుకున్నారు. 11 లక్షల డాలర్ల ప్రైజ్‌మనీ కలిగిన ఈ బీడబ్ల్యుఎఫ్‌ వరల్డ్‌ టూర్‌ ఈవెంట్‌లో విజేతగా నిలిచిన వారికి 12వేల ర్యాంకింగ్‌ పాయింట్లు లభిస్తాయి. ఒలింపిక్స్‌ అర్హత కూడా తేలాల్సి ఉండడంతో టాప్‌ ప్లేయర్స్‌ అంతా బరిలోకి దిగబోతున్నారు. కానీ ఇంగ్లండ్‌లో ఇప్పటికే కోవిడ్‌-19 కారణంగా ఐదుగురు మృతి చెందిన నేపథ్యంలో ఈ సీజన్‌లో తొలి సూపర్‌ 1000 ఈవెంట్‌ ఎలా జరుగుతుందోనని అంతటా ఉత్కంఠ నెలకొంది. జర్మన్‌ ఓపెన్‌ కూడా రద్దవడంతో షట్లర్ల టోక్యో ఒలింపిక్స్‌ సన్నాహకాలపై కూడా ప్రభావం పడుతోంది.


రెండు దశాబ్దాల కల: భారత్‌ నుంచి ప్రకాశ్‌ పడుకోన్‌ (1980), పుల్లెల గోపీచంద్‌ (2001) మాత్రమే ఆల్‌ ఇంగ్లండ్‌లో విజేతగా నిలిచారు. ఆతర్వాత పురుషుల, మహిళల విభాగంలో ఇప్పటికీ మరో టైటిల్‌ దక్కలేదు. 2015లో మహిళల సింగిల్స్‌ నుంచి సైనా నెహ్వాల్‌ ఫైనల్‌ చేరినా కరోలినా మారిన్‌ చేతిలో ఓటమి పాలైంది. ఆతర్వాత 2018లో సింధు అత్యుత్తమంగా సెమీస్‌ వరకు చేరింది. ఇక ఈసారి ప్రపంచ చాంపియన్‌గా నిలిచిన ఉత్సాహంతో రెండు దశాబ్దాల భారత్‌ కలను సింధు నెరవేర్చాలని అభిమానులు కోరుకుంటున్నారు. కానీ ఇటీవలి కాలంలో ఆమె ఫామ్‌ ఆందోళనకరంగా ఉంది. అనవసర తప్పిదాలను సరిచేసుకోవడంతో పాటు డిఫెన్స్‌లో రాటు దేలితేనే ఫలితం ఉంటుంది. తొలి రౌండ్‌లో అమెరికన్‌ షట్లర్‌ బీవెన్‌ జాంగ్‌తో సింధు తలపడుతుంది. ప్రస్తుతం ఆరో ర్యాంకులో ఉన్న సింధు ఇప్పటికే ఒలింపిక్‌ బెర్త్‌ను దాదాపు ఖాయం చేసుకుంది.


సైనా, శ్రీకాంత్‌కు కీలకం: సైనా, శ్రీకాంత్‌కు మాత్రం ఈ టోర్నీలో రాణించడం కీలకం. ఏప్రిల్‌ 28న తుది గడువు ముగిసేలోపు వీరిద్దరు టాప్‌-16లో ఉండాల్సిన అవసరం ఉంది. ప్రస్తుతం సైనా ఒలింపిక్‌ క్వాలిఫికేషన్‌లో 18వ ర్యాంకులో ఉండగా.. శ్రీకాంత్‌ 21లో ఉన్నాడు. అయితే సైనాకు తొలి రౌండ్‌లోనే యమగూచితో కఠిన పోరు ఎదురుకానుంది. పురుషుల సింగిల్స్‌లో శ్రీకాంత్‌ కూడా ఒలింపిక్‌ చాంపియన్‌, మూడో సీడ్‌ చెన్‌ లాంగ్‌ను దాటాల్సి ఉంది. ఇక సాయి ప్రణీత్‌, కశ్యప్‌, లక్ష్య సేన్‌ కూడా అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. మహిళల డబుల్స్‌లో అశ్వినీ పొన్నప్ప-సిక్కిరెడ్డి, మిక్స్‌డ్‌ డబుల్స్‌లో సిక్కి-ప్రణవ్‌ బరిలోకి దిగనున్నారు.

Advertisement
Advertisement
Advertisement