Jun 11 2021 @ 20:09PM

ఐదు సినిమాలతో అక్షయ్‌ జోరు!

బాలీవుడ్‌ కిలాడీ అక్షయ్‌కుమార్‌ ఏడాదికి నాలుగైదు సినిమా చేయడం కొత్తేమీ కాదు. 50 ఏళ్లు దాటిన ఆయనలో ఈజ్‌ ఏ మాత్రం తగ్గలేదు. నటనలో, సినిమాలు చేసే విషయంలో ఇప్పటికీ జోరు చూపిస్తున్నారు. గత ఏడాది అర్ధ భాగం లాక్‌డౌన్‌ ఉండడంతో ‘లక్ష్మీ’ సినిమాతోనే సరిపెట్టుకున్నారు. అది కూడా ఓటీటీలో విడుదలైంది. ఇప్పుడు ఆయన నటించగా ఐదు చిత్రాలు ‘సూర్యవంశీ, ‘బెల్‌బాటమ్‌’, ‘అత్రంగి రే’, ‘పృథ్వీరాజ్‌’, ‘బచ్చన్‌పాండే’ చిత్రాలు విడుదలకు సిద్ధంగా ఉండగా, ‘రామ్‌సేతు’ చిత్రం సెట్స్‌ మీదుంది. లాక్‌డౌన్‌, థియేటర్లు మూతపడడం వల్ల ఈ ఐదు సినిమాలు వాయుదా పడుతూ వస్తున్నాయి.ప్రస్తుతం దేశంలో కరోనా ఉదృతి కాస్త తగ్గుతున్న నేపథ్యంలో లాక్‌డౌన్‌ నిబంధనలు క్రమంగా సడలిస్తున్నారు. దీనిని బట్టి జూలైలో థియేటర్లు తెరిచే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. దీనితో బాలీవుడ్‌లో చాలా సినిమాలు విడుదలకు వరుస  కట్టనున్నాయి. ఆ రేసులో అక్షయ్‌కుమార్‌ కూడా ఉన్నారు. కాపీ రెడీ అయ్యి, సరైన సమయం దొరకక దాదాపు ఆరు నెలలుగా విడుదలకు నోచుకోకపోవడంతో నిర్మాతలు కాస్త ఆవేదనగా ఉన్నారని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో అక్షయ్‌ తెలిపారు. అవకాశం కుదిరితే వీలైనంత త్వరగా సినిమాలు విడుదల చేయాలని నిర్మాతలు భావిస్తున్నారట. అయితే ఇప్పటికే వీటిలో కొన్ని చిత్రాల విడుదల తేదీలను ప్రకటించారు. సూర్యవంశీ: రోహిత్‌శెట్టి దర్శకత్వం వహించిన చిత్రం. విడుదల తేదీ ప్రకటించాల్సి ఉంది. 


బెల్‌బాటమ్‌: రంజిత్‌ ఎం. తివారీ దర్శకత్వం వహించారు. విడుదదల తేది: ఆగస్ట్‌ 13, 2021. 

అత్రంగి రే: ఆనంద్‌ ఎల్‌ రాయ్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ఆగస్ట్‌ 6న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. 


పృథ్వీరాజ్‌: చంద్రప్రకాశ్‌ ద్వివేది దర్శకత్వం వహించారు. నవంబర్‌ 5న విడుదల చేయనున్నారు. 


బచ్చన్‌పాండే: ఫర్హాద్‌ సమ్జీ దర్శకత్వం వహించిన ఈ చిత్రం వచ్చే ఏడాది జనవరి 26న విడుదల చేయబోతున్నారు.