సినిమా రివ్యూ : ‘అఖండ’

చిత్రం : అఖండ

విడుదల తేదీ : డిసెంబర్ 2, 2021

నటీనటులు : నందమూరి బాలకృష్ణ, ప్రగ్యా జైస్వల్, పూర్ణ, శ్రీకాంత్, జగపతిబాబు, అయ్యప్ప.పి.శర్మ, సుబ్బరాజు, అవినాశ్, నాగమహేశ్, శ్రావణ్, కాలకేయ ప్రభాకర్, సమ్మెట గాంధి, చమ్మక్ చంద్ర, దువ్వాసి మోహన్ తదితరులు

సంగీతం : యస్.యస్.తమన్

మాటలు : యం.రత్నం

యాక్షన్ : స్టంట్ శివ, రామ్ లక్ష్మణ్

నిర్మాణం : ద్వారకా క్రియేషన్స్

దర్శకత్వం : బోయపాటి శ్రీను

బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్ లో గతంలో వచ్చిన ‘సింహా, లెజెండ్’ చిత్రాలు విజయం సాధించాయి. తాజాగా ఈ కాంబినేషన్ లో వచ్చిన మూడో సినిమా ‘అఖండ’. ఈ రోజే (గురువారం) థియేటర్స్ లోకి వచ్చింది. మరి ఈ సినిమా గత రెండు చిత్రాల్లాగానే ప్రేక్షకుల్ని మెప్పిస్తుందా? ఈ సినిమా ప్రత్యేకతలు ఏంటి అనే విషయాలు రివ్యూలో చూద్దాం. 

కథ 

మురళీకృష్ణ (బాలకృష్ణ) అనంతపురంలో ఒక ఫార్మర్. ఊరికి ఏదైనా సమస్య వచ్చినా, ఊరివాళ్లకి కష్టమొచ్చినా ఆయన రీఫార్మర్ గా మారిపోతాడు. ఫ్యాక్షనిజంతో ఎంతో మంది కత్తులతో రక్తం చిందిస్తుంటే, వారిలో పరివర్తన తీసుకొచ్చి ఓ కొత్త మార్పుకు శ్రీకారం చుడతాడు. చుట్టపక్కల ప్రాంతాల్లో స్కూల్స్, హాస్సిటల్స్ కట్టించి ప్రజా సేవ చేస్తుంటాడు. ఆయనలోని  మంచితనం, సేవాగుణం నచ్చి ఆ ఊరికి కొత్తగా వచ్చిన కలెక్టర్ (ప్రగ్యా జైస్వల్ ) ఆయనపై మనసుపడి, ఆపై పెళ్ళి చేసుకుంటుంది. ఇక ఆ ఊరికి ఉన్న ఒకే ఒక పీడ వరదరాజలు (శ్రీకాంత్). మైనింగ్ మాఫియాను నడుపుతూ ఆ ఊరిలోని కొందరు పేదవారిని గనుల్లో బానిసలుగా చేస్తాడు. యురేనియం త్రవ్వకాలతో అక్కడున్న చిన్నారుల ప్రాణాలకు ముప్పు ఏర్పడుతుంది. మైనింగ్ మాఫియాపై ఉక్కు పాదం మోపేందుకు బరిలోకి దిగిన మురళీ కృష్ణకి వరదరాజులుతో ఎలాంటి సవాళ్ళు ఎదురయ్యాయి? వరదరాజులు వెనుక ఉన్న అసలు మాఫియా లీడర్ ఎవరు? మురళీ కృష్ణ తోడబుట్టిన శివుడు (బాలకృష్ణ) ఎక్కడ పెరిగాడు? వారిద్దరూ చిన్నప్పుడే విడిపోవడానికి కారణమేంటి? మురళీ కృష్ణ కుటుంబాన్ని శివుడు ఎలా ఆదుకున్నాడు? అన్నదే మిగతా కథ.

విశ్లేషణ 

గతంలో బాలయ్య, బోయపాటి కాంబినేషన్ లో వచ్చిన ‘సింహా, లెజెండ్’ చిత్రాలు ప్రేక్షకుల్ని మెప్పించడానికి ప్రధాన కారణం వాటిలో కథతో పాటు చక్కటి ఎమోషన్స్ కూడా ఉంటాయి. ఆ ఎమోషన్సే ‘అఖండ’ చిత్రంలో మిస్ అయ్యాయి. కథ కన్నా పాత్రల ఎలివేషన్స్ మీదే బోయపాటి ఎక్కువ దృష్టి పెట్టడంతో ఇందులో పాత్రల మధ్యలో భావోద్వేగాలకు చోటు లేకుండా పోయింది. అంతేకాదు .. లెజెండ్ స్థాయిలో ఇందులో కథాకథనాలు సరిగా కుదరలేదని చెప్పొచ్చు. హీరో కనిపించిన ప్రతీ సారీ ఇంట్రడక్షన్ సీన్ లా స్లోమోషన్ లో ఎలివేషన్స్ ఇస్తూ .. ప్రతీ యాక్షన్ సీన్ ను ఒక క్లైమాక్స్ లా తీర్చిదిద్దితే పంచ్ డైలాగ్స్ తో మోతమోగించి కథ గురించి పట్టించుకోకపోతే ఎలా ఉంటుంది? అఖండ విషయంలో అలాగే జరిగింది. ఫ్యాన్స్ కు, మాస్ జనానికి నచ్చే అంశాలు ఇందులో బోలెడన్ని ఉన్నాయి. బిగినింగ్ నుంచి ఎండింగ్ నుంచి అభిమానుల్ని అలరించే ఘట్టాలు చాలానే ఉన్నాయి. కానీ కథాకథనాల పరంగా ‘అఖండ’ నిరాశకు గురి చేస్తుంది. 


‘సింహా, లెజెండ్’ తరహాలోనే ఇందులోనూ బాలకృష్ణ డ్యూయల్ రోల్స్ చేశారు. ఆ రెండు సినిమాల తరహాలోనే ఒక బాలయ్యతో కథను మొదలు పెట్టి.. ఇంట్రవెల్ టైమ్ కి అతడు నిస్సాహాయుడుగా మారిన తరుణంలో రెండో పాత్ర ఎంట్రీ ఇవ్వడం.. ‘అఖండ’లోనూ కనిపిస్తుంది. అందుకే కథలో కొత్తదనం ఏమీ లేకుండా పోయింది. కాకపోతే రెండో పాత్రను అఘోరా గా చూపించడంతో ఆ నేపథ్యంలో వచ్చే సన్నివేశాలు అభిమానులకి కొత్తగా అనిపిస్తాయి. శూలం పట్టుకొని విధ్వంసం సృష్టించడం, ప్రవచనాల తరహాలో డైలాగ్స్ వల్లించడం మినహా ఇందులో కొత్తదనమేమీ ఉండదు. అయితే ఆ పాత్ర డిజైనింగ్, బాలయ్య నటన అభిమానుల్ని అలరిస్తాయి.  అలాగే విలన్ గా నటించిన శ్రీకాంత్ ను పవర్ ఫుల్ ఇంట్రడక్షన్ ఇచ్చి.. ఆ తర్వాత సాధారణంగా మార్చేయడంతో ఆ పాత్ర తేలిపోయింది. ఇక ‘అఖండ’ పాత్రకి కొన్ని శక్తులున్నట్టు చూపించినా కొన్ని సన్నివేశాల్లో సాధారణ పాత్రలాగానే అనిపిస్తుంది. బాలయ్య మాస్ పెర్ఫార్మెన్స్, తమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ వల్ల సెకండాఫ్ లో చాలా సీన్స్ అభిమానుల్ని ఆకట్టుకుంటాయి. హీరో ఎలివేషన్ సీన్స్ , యాక్షన్ ఘట్టాలు ఆకట్టుకోవడం మినహా ఈ సినిమాకోసం బోయపాటి కొత్తగా చేసిందేమీ లేదు . ఇక అఘోరాగా జగపతి బాబు, మరో విలన్ గా నితిన్ మెహతా, అయ్యప్ప పి శర్మ మెప్పిస్తారు. మొత్తం మీద చెప్పాలంటే.. బాలయ్య అభిమానులు మెచ్చేలా బోయపాటి తీసిన సినిమా ‘అఖండ’.

బోటమ్ లైన్ : అభిమానుల కోసమే ‘అఖండ’

Advertisement
Advertisement