Abn logo
Aug 8 2020 @ 07:50AM

దుబాయ్‌ నుంచి వ‌చ్చిన విమానం.. కోజికోడ్‌లో రెండు ముక్కలు !

కోజికోడ్‌లో ఘోర ప్రమాదం

20 మంది దుర్మరణం

జోరువానలో ల్యాండింగ్‌లో పట్టుకోల్పోయిన బోయింగ్‌

గింగిరాలు తిరుగుతూ 50 అడుగుల లోయలోకి

ఆ వెంటనే పెద్ద శబ్దం చేస్తూ 

రెండు ముక్కలైన ఎయిర్‌ ఇండియా విమానం

రన్‌వే పైనుంచి జారి లోయలో పడ్డ విమానం

దుబాయ్‌ నుంచి రాక.. విమానంలో 191 మంది

184 మంది ప్రయాణికులు.. వీరిలో 10 మంది చిన్నారులు

ఏడుగురు సిబ్బందిలో ఇద్దరు పైలట్లు మృతి

138 మందికి గాయాలు.. 15 మంది పరిస్థితి విషమం 

మృతులు పెరిగే చాన్స్‌.. క్షతగాత్రులతో కిక్కిరిసిన ఆస్పత్రులు

రన్‌వే పై ల్యాండింగ్‌కు రెండు సార్లు విఫలయత్నం

వర్షంతో రన్‌వే చిత్తడిగా మారడంతోనే ప్రమాదం! 

రాష్ట్రపతి, ప్రధాని దిగ్ర్భాంతి.. సీఎం పినరయికి మోదీ ఫోన్‌

సహాయక చర్యల కోసం ఎన్డీఆర్‌ఎఫ్‌కు అమిత్‌ షా ఆదేశం 

షార్జా, దుబాయ్‌లలో సహాయక కేంద్రాల ఏర్పాటు

ఘటనపై విచారణకు పౌర విమానయాన శాఖ ఆదేశం

కోజికోడ్‌ (కేరళ), ఆగస్టు 7: అది కేరళలోని కోజికోడ్‌ విమానాశ్రయం! సమయం శుక్రవారం రాత్రి 7:40 గంటలు. జోరుగా వర్షం పడుతుండటంతో రన్‌వే అంతా చిత్తడిగా ఉంది. 191 మందితో ఉన్న విమానం ఒకటి ల్యాండ్‌ అయ్యేందుకు గాల్లోంచి రన్‌వే వైపు దూసుకొచ్చింది. రన్‌వేను తాకగానే పట్టుకోల్పోయింది. అలాగే జారుతూ... గింగిరాలు తిరుగుతూ రన్‌వే చివరి దాకా వేగంగా దూసుకెళ్లి 50 అడుగుల లోతైన లోయలో పడింది. ఆ వెంటనే పెద్ద శబ్దంతో విమానం రెండు ముక్కలైంది! విమానంలో ఉన్నవారిలో 20 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇలా ఘోర ప్రమాదం బారిన పడింది ఎయిర్‌ ఇండియాకు చెందిన బోయింగ్‌ 737 ఐఎక్స్‌ 1344, ఎక్స్‌ప్రెస్‌ విమానం!! ‘వందే భారత్‌’లో భాగంగా విదేశాల్లో చిక్కుకుపోయిన భారతీయులను స్వదేశానికి తరలిస్తున్న నేపథ్యంలో ఆ పని మీదే ఈ విమానాన్ని దుబాయ్‌కి తరలించారు. పది మంది చిన్నారులు సహా 184 మంది ప్రయాణికులు, ఇద్దరు పైలెట్లు సహా ఏడుగురు సిబ్బందితో దుబాయ్‌ నుంచి కొజికోడ్‌కు బయలుదేరింది. 


భారీ వర్షం పడుతుండగా ఆకాశంలో చక్కర్లు కొడుతూ ల్యాండింగ్‌ కోసం రెండుసార్లు ప్రయత్నించింది. మూడో ప్రయత్నంలో ల్యాండింగ్‌ అవుతూ పదో నంబరు రన్‌వేను తాకిన వెంటనే విమానం ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో విమానంలోని ఇద్దరు పైలట్లూ మృతిచెందారని సమాచారం. చినుకులతో రన్‌వే చిత్తడిగా ఉండటంతోనే ల్యాండింగ్‌ సమయంలో విమానం పట్టుకోల్పోయి ప్రమాదానికి గురైందని కేరళ మంత్రి రాజు అన్నారు. అయితే రన్‌వే మీద నిర్ధారిత వేగం కన్నా మించిన వేగంతో ల్యాండింగ్‌ కావడంతోనే ప్రమాదం జరిగివుంటుందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. ప్రమాదం జరిగిన వెంటనే 5 అగ్నిమాపక బృందాలు, 25 అంబులెన్స్‌లతో వైద్య సిబ్బంది, ఎన్డీఆర్‌ఎ్‌ఫకు చెందిన 2 బృందాలు సహాయక చర్యలకు దిగారు. క్షతగాత్రులను దగ్గర్లోని ఆస్పత్రులకు తరలించారు. టార్చ్‌లు లేకపోవడం, భారీ వర్షం పడటంతో సహాయక చర్యలకు ఆటంకాలు ఎదురయ్యాయి. తీవ్రంగా గాయపడిన వారిని కోజికోడ్‌ వైద్య కళాశాల ఆస్పత్రికి తరలించారు. ఘటనలో 123కి స్వల్పంగా, 15మందికి తీవ్రంగా గాయాలయ్యాయి. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని చెబుతున్నారు. గాయపడిన వారిలో ఓ తల్లి, బిడ్డ పరిస్థితి విషమంగా ఉన్నట్లు కేరళ ఆరోగ్యశాఖ మంత్రి కేకే శైలజ చెప్పారు. విమాన ప్రమాదంపై రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌, ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్‌ షా దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. ట్విటర్‌ ద్వారా మృతుల కుటుంబాలకు కోవింద్‌ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఘటనపై కేరళ గవర్నర్‌ ఆరిఫ్‌ మహ్మద్‌ ఖాన్‌కు కోవింద్‌ ఫోన్‌ చేసి మాట్లాడారు. విమాన ప్రమాద ఘటన తననెంతో కలచివేసిందని మోదీ ట్వీట్‌ చేశారు. కేరళ సీఎం పినరయి విజయన్‌కు మోదీ ఫోన్‌ చేసి ప్రమాద ఘటనకు సంబంధించి వివరాలను తెలుసుకున్నారు. పోలీసులు, ఎయిర్‌ఫోర్స్‌ సిబ్బందితో పూర్తిస్థాయి సహాయ చర్యలు చేపట్టామని విజయన్‌ వెల్లడించారు. అటు ఎన్డీఆర్‌ఎఫ్‌ సిబ్బందిని అమిత్‌ షా అప్రమత్తం చేశారు. వెంటనే ఘటనాస్థలికి వెళ్లి సహాయక చర్యలు చేపట్టాలని ఆదేశించారు. 


ఉపముఖ్యమంత్రి ఏసీ మోయిదీన్‌ ఘటనాస్థలిలో దగ్గరుండి సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. బాధిత కుటుంబాలకు సమాచారం అందించేందుకుగాను షార్జా, దుబాయ్‌లలో భారత రాయబార కార్యాలయ సిబ్బంది సహాయక కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఘటనపై కాంగ్రెస్‌ పార్టీ నేత రాహుల్‌ గాంధీ దిగ్భాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ఆ పార్టీకే చెందిన శశి థరూర్‌.. ‘కేరళకు విషాదకరమైన రోజు’ అంటూ ట్వీట్‌ చేశారు. క్షఽతగాత్రులు త్వరగా కోలుకోవాలంటూ కాంగ్రెస్‌ పార్టీ అధికార ప్రతినిధి రణ్‌దీప్‌ సుర్జేవాలా ట్వీట్‌ చేశారు. ప్రమాద ఘటనపై విచారణకు పౌర విమానయాన శాఖ మంత్రి హర్దీప్‌ సింగ్‌ పూరి ఆదేశాలు జారీ చేశారు. కాగా భారత్‌లో చివరిసారిగా పదేళ్ల క్రితం ఘోర విమాన ప్రమాదం చోటుచేసుకుంది. 2010లో మంగళూరు విమానాశ్రయంలో రన్‌వేపై ఎయిర్‌ ఇండియా విమానం పట్టుకోల్పోయి ప్రమాదానికి గురైంది. నాటి ఘటనలో విమానంలో ఉన్న 158 మంది ప్రాణాలు కోల్పోయారు.  


కోజికోడ్‌ సురక్షితం కాదని తొమ్మిదేళ్ల క్రితమే..

భౌగోళిక పరిస్థితుల దృష్ట్యా కోజికోడ్‌ రన్‌వే విమానాలు దిగడానికి సురక్షితం కాదని తాను తొమ్మిదేళ్ల క్రితం ఇచ్చిన ఒక నివేదికలో వివరించినట్లు ఎయిర్‌ సేఫ్టీ నిపుణుడు కెప్టెన్‌ మోహన్‌ రంగనాథన్‌ చెప్పారు. ఘోర విపత్తు ముంచుకురావచ్చనే తన భయం నిజమైందని ఆయన ఆవేదన చెందారు.

Advertisement
Advertisement
Advertisement