Abn logo
Sep 21 2021 @ 01:08AM

ఎయి‘డెడ్‌’!

కళాశాలల్లో అధ్యాపకుల సరెండర్‌

పాఠశాలల్లోనూ అదేతీరు

పిల్లల చదువులు ప్రశ్నార్థకమే

ఆస్తులను, ఉపాధ్యాయులను అప్పగించాలని ప్రభుత్వ ఆదేశాలు


ఎయిడెడ్‌ శకం ముగిసింది. జిల్లాలోని ఎయిడెడ్‌ కళాశాలల యాజమాన్యాలు తమ వద్ద పనిచేసే అధ్యాపకులను, సిబ్బందిని ప్రభుత్వానికి సరెండర్‌ చేయడంతో ఒక అంకం పూర్తయింది. అయితే వీరందరూ ఎక్కడ పనిచేయాలనే అంశంపై స్పష్టత లేదు. మరోపక్క ఆయా కళాశాలల్లో విద్యనభ్యసిస్తున్న విద్యార్థుల భవితవ్యమే ప్రశ్నార్థకంగా మారింది.  

 

ఆంధ్రజ్యోతి- మచిలీపట్నం : ప్రభుత్వం ఎయిడెడ్‌ విద్యా సంస్థలను, అందులో పనిచేసే సిబ్బందిని తమకు అప్పగించాలని ఆదేశాలు జారీ చేయడంతో జిల్లాలోని 23 ఎయిడెడ్‌ కళాశాలల యాజమాన్యాలు తమ సిబ్బందిని ప్రభుత్వానికి సరెండర్‌ చేశారు. వీరందరూ ఎక్కడ పనిచేయాలనే అంశంపై ఇంకా స్పష్టమైన ఆదేశాలు ఇవ్వలేదు. దీంతో వీరిలో అయోమయం నెలకొంది. ఎయిడెడ్‌ పాఠశాలలను సమీపంలో ఉన్న ప్రభుత్వ పాఠశాలలను మ్యాపింగ్‌ చేసి, నివేదికను పంపాలని డీఈవోకు విద్యాశాఖ డైరెక్టర్‌ నుంచి ఇటీవల ఆదేశాలు అందాయి. ఈ ఆదేశాలను అమలు చేస్తే జిల్లాలో ఉన్న 59 ఉన్నత పాఠశాలలు, 372 ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలలు, అందులో పనిచేసే టీచర్లు, బోధనేతర సిబ్బంది ప్రభుత్వ ఆధీనంలో పనిచేయాల్సి ఉంటుంది. తమ పాఠశాలలను ప్రభుత్వంలో విలీనం చేయడంపై ఇప్పటివరకు సందేహించిన ఆర్‌సీఎం విద్యాసంస్థలు తమ సిబ్బందిని ప్రభుత్వానికి సరెండర్‌ చేసేందుకు అంగీకరించినట్టు వార్తలు వెలువడుతున్నాయి. 


గందరగోళంలో సిబ్బంది 

జిల్లాలో 23 ఎయిడెడ్‌ కళాశాలలున్నాయి. వీటిల్లో పనిచేసే అధ్యాపకులను, బోధనేతర సిబ్బందిని ఇటీవల ప్రభుత్వానికి సరెండర్‌ చేశారు. వీరంతా ఇటీవల రాజమండ్రిలోని కళాశాలల విభాగం  ఆర్‌జేడీ వద్దకు వెళ్లి, తాము ప్రభుత్వ ఆధీనంలో పనిచేస్తామని లిఖితపూర్వకంగా ఆమోదం తెలిపారు. దీంతో వీరందరినీ ఇప్పటివరకు పనిచేసిన కళాశాలలకు వెళ్లవద్దని, రోజూ రాజమండ్రి వచ్చి సంతకాలు చేయాలని చెప్పి బాంబు పేల్చారు. హడలిపోయిన అధ్యాపకులు ఇంతదూరం వచ్చి ఎలా సంతకాలు చేయాలని అడిగారు. అయితే విజయవాడ ఎస్‌ఆర్‌ఆర్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ వద్దకు వెళ్లి సంతకాలు చేయాలని చెప్పారు. ఒకరోజు వ్యవధి అనంతరం ‘తదుపరి ఆదేశాలు వచ్చేవరకు మీరు  పనిచేసిన కళాశాలలకే వెళ్లాలి.’ అని వాట్సాప్‌ సందేశాలను పంపారు. విజయవాడ, ఉయ్యూరు సిద్ధార్థ కళాశాలల్లో పనిచేసే సిబ్బందిని కళాశాలకు రానవసరం లేదని ఆ కళాశాల యాజమాన్యం తేల్చి చెప్పినట్టు తెలుస్తోంది. మచిలీపట్నంలోని నోబుల్‌ కళాశాల యాజమాన్యం మాత్రం అధ్యాపకులను మళ్లీ కళాశాలకు రావాలని చెప్పారు. 


ప్రభుత్వ అధ్యాపకుల బదిలీలకు ఉత్తర్వులు 

ఎయిడెడ్‌ కళాశాలలను ప్రభుత్వంలో విలీనం చేస్తే ప్రభుత్వ కళాశాలల్లో ఏళ్ల తరబడి పనిచేస్తున్న అధ్యాపకులకు పదోన్నతుల్లో ఇబ్బందులు ఎదురవుతాయని, ముందుగా తమకు పదోన్నతులు, బదిలీలు నిర్వహించాలని ప్రభుత్వ కళాశాలల అధ్యాపకులు డిమాండ్‌ చేశారు. దీంతో ప్రభుత్వం వీరి బదిలీలు, పదోన్నతులను ఈ నెలాఖరులోగా నిర్వహించాలని ఆదేశిస్తూ, మార్గదర్శకాలు జారీచేసింది. ఇదిలా ఉంటే ఎయిడెడ్‌ కళాశాలల్లో చదువుతున్న విద్యార్థులు ప్రభుత్వ కళాశాలల్లో చేరాలంటే వారు చదువుతున్న కోర్సులు అక్కడ ఉంటాయా? సరిపడినన్ని తరగతి గదులు ఉంటాయా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.