Abn logo
Sep 28 2020 @ 00:30AM

కరోనా తర్వాత... ఆ స్వేచ్ఛ పోయింది!

Kaakateeya

‘‘ఓటీటీ వేదికలను ఎవరూ ఆపలేరు. వీటి వల్ల తమని తాము నిరూపించుకోవడానికి కళాకారులకు చక్కటి అవకాశాలు లభిస్తున్నాయి. అలాగని, థియేటర్ల మీద డిజిటల్‌ పరిశ్రమ ప్రభావం ఉంటుందనుకోవడం లేదు. థియేటర్లు... ఓటీటీ... రెండిటిలో ఒకటి ఎంపిక చేసుకోమంటే నేను చేసుకోలేను. అది కష్టమే! థియేటర్లు తెరచుకున్న తర్వాత తప్పకుండా వెళతా. సినిమా చూస్తా. ఓటీటీలోనూ విభిన్న కథలు, ఉన్నత ప్రమాణాలతో కూడినవి వస్తున్నాయి. నేను ఇంతకు ముందు ‘బ్రీత్‌’ లాంటి కథను చెప్పలేదు. అప్పుడు వెబ్‌ సిరీస్‌ ఫార్మాట్‌ లేదు. ఓటీటీ వల్ల చెప్పగలిగా’’ అని మాధవన్‌ అన్నారు. ఆయన నటించిన ‘నిశ్శబ్దం’ అక్టోబర్‌ 2న ఓటీటీలో విడుదలవుతోంది. ఈ సందర్భంగా సినిమా, ఓటీటీ, కరోనా తదనంతర పరిస్థితుల గురించి ‘చిత్రజ్యోతి’తో మాధవన్‌ ప్రత్యేకంగా సంభాషించారు. ఆ సంగతులివీ...

మాధవన్‌


‘నిశ్శబ్దం’ ఓ థ్రిల్లర్‌. అనుష్కది ప్రధాన పాత్ర. మాటలు రాని, వినపడని అమ్మాయిగా నటించింది. బధిర యువతి అయినప్పటికీ పెయింటింగులు చక్కగా వేస్తుంది. ఆమె మరో కళాకారుణ్ణి కలుస్తుంది. అతడు ఛెలో ప్లేయర్‌. ఆ పాత్రలో నేను నటించా. పెళ్లాం చేతిలో మోసపోయిన అతడు, ఓ విషాదంలో ఉన్న ఆమె ఎలా కలిశారు? వాళ్లిద్దరి మధ్య ప్రేమ ఎలా చిగురించింది? తర్వాత ఏమైంది? అనేది చిత్రకథ. ఈ సినిమా కోసం రెండు వారాలు ఛెలో ప్లే చేయడం నేర్చుకున్నా. పాత్రలో నటించడం, ఛెలో నేర్చకోవడమే కాదు... అంతర్జాతీయంగా పేరొందిన ఛెలో ప్లేయర్‌ అని ప్రేక్షకుల్ని నమ్మించే విధంగా నటించడం నాకు ఎదురైన అతిపెద్ద సవాల్‌. నేను బాగా నటించానని అనుకుంటున్నా! సినిమా విడుదలైన తర్వాత ఎలా చేశానో ప్రేక్షకులే చెప్పాలి.


నన్ను చేరుకోవడం సులభమే!

కథలు ఎంపికలో నేను ఆచితూచి వ్యవహరిస్తానని అనుకుంటారు. కానీ, నన్ను చేరుకోవడం సులభమే. కథ నచ్చితే, కొత్తగా ఉంటే తప్పకుండా చేస్తా. ‘రాకెట్రీ’ చిత్రీకరణ పూర్తయ్యాక... నిర్మాణానంతర కార్యక్రమాలు ప్రారంభించడానికి రెండు మూడు నెలలు సమయం ఉంది. అప్పుడే కోన వెంకట్‌ నుంచి ఫోన్‌ వచ్చింది. ‘ఓ ఆసక్తికరమైన కథ ఉంది. మీరు, అనుష్క చేస్తే బావుంటుంది. మీరిద్దరూ నటించి చాలా రోజులైంది’ అన్నారు. కథ విన్నా. నచ్చింది. అదే సమయంలో మా అబ్బాయి అమెరికాలో స్విమ్మింగ్‌లో శిక్షణ ఉండటంతో మా ఫ్యామిలీ అంతా కలిసే వెళ్లాం.


థియేటర్లకీ... ఓటీటీకి అదే వ్యత్యాసం!

‘నిశ్శబ్దం’ అమెజాన్‌ ప్రైమ్‌లో విడుదలవుతోంది. నా తమిళ చిత్రం ‘మారా’ సైతం అందులోనే విడుదల అవుతుందని అనుకుంటున్నా. ఇప్పుడు మనం థియేటర్లలో సినిమా చూడాలనుకుంటే కొన్ని పరిమితులు ఉంటాయి. సినిమా ప్రదర్శిస్తున్న రోజు, వాళ్లు నిర్దేశించిన సమయానికి వెళ్లి చూడాలి. వ్యక్తిగత కారణాల వల్ల థియేటర్‌కి వెళ్లడం వీలు కాకపోతే, లేదంటే మనకు నచ్చిన సమయంలో చూడాలనుకుంటే ఓటీటీ చక్కటి వేదిక. రెండిటికీ వ్యత్యాసం ఏంటంటే... ఓటీటీలో సామూహిక వీక్షణ అనుభూతి కోల్పోతాం. ప్రేమ, వినోదం, భయం... ఎలాంటి భావోద్వేగానికైనా థియేటర్‌లోని ఇతరుల రియాక్షన్‌ను మనం ఆస్వాదిస్తాం. ఓటీటీలో చూసేటప్పుడు ఆ అవకాశం ఉండదు.


మన దగ్గర సరిపడా థియేటర్లు లేవు!

ఏడాదికి 1200 చిత్రాలు తీస్తున్నాం. సగటున రోజుకి మూణ్ణాలుగు చిత్రాలు ఎక్కడ విడుదల చేయగలం? మన దగ్గర సరిపడా థియేటర్లు లేవు. అందుకని, ఓటీటీలను స్వాగతించాలి. అదే సమయంలో థియేటర్లలో విడుదల కుదరడం లేదు కనుక ఓటీటీలో విడుదల చేద్దామనే ధోరణి ఉండకూడదు. అది ప్రమాదకరం! ప్రేక్షకులు ప్రతి అంశాన్ని, చిత్రాన్ని చాలా నిశితంగా గమనిస్తున్నారు. ఓటీటీలోనూ ఉన్నత ప్రమాణాలతో కూడినవి వస్తున్నాయి. సినిమా ప్రారంభించే ముందు థియేటర్లకా? ఓటీటీకా? లేదంటే వెబ్‌ సిరీసా? అనేది నిర్ణయించుకోవాలి. అప్పుడే ప్రేక్షకులు గౌరవిస్తారు. వ్యాపారమూ బాగా జరుగుతుంది.


కరోనా తర్వాత చిత్రీకరణ కష్టంగా ఉంది!

ప్రస్తుతం దుబాయ్‌లో ఓ వెబ్‌ సిరీస్‌ చిత్రీకరణ చేస్తున్నా. కరోనా తర్వాత చిత్రీకరణ చేయడం భయంకరంగా ఉంది. సెట్‌లో మాస్క్‌ వేసుకుని ఉండటం, షాట్‌ రెడీ అయినప్పుడు మాస్క్‌ తీసేసి క్యారెక్టర్‌ మూడ్‌లోకి వెళ్లడం నటీనటులకు సవాలే. ముఖ్యంగా స్వేచ్ఛ పోయింది. ఇది నాకు నచ్చడం లేదు. ఐ హేట్‌ ఇట్‌. ముఖ్యంగా రిలేషన్‌షిప్‌ సన్నివేశాలు చిత్రీకరిస్తున్నప్పుడు చాలా కష్టంగా ఉంది. ‘నిశ్శబ్దం’ తర్వాత ‘రాకెట్రీ’తో తెలుగు ప్రేక్షకుల ముందుకొస్తా. వచ్చే ఏడాది తెలుగులో మరో స్ట్రయిట్‌ చిత్రం చేయాలనుకుంటున్నా. 

Advertisement
Advertisement
Advertisement