Advertisement
Advertisement
Abn logo
Advertisement

దేశం విడిచి వెళ్లొద్దంటూ పౌరులు, ప్రవాసులకు Kuwait హెచ్చరిక..!

కువైత్ సిటీ: కరోనా కొత్త వేరియంట్ ఒమైక్రాన్ నేపథ్యంలో దేశ పౌరులు, వలసదారులకు కువైత్ తాజాగా కీలక సూచన చేసింది. ప్రస్తుత పరిస్థితిలో దేశం నుంచి బయటకు వెళ్లొద్దని హెచ్చరించింది. కొత్త వేరియంట్‌ శరవేగంగా ప్రబలుతున్నందున ఈ సమయంలో విదేశాలకు వెళ్లడం మంచిది కాదని అంతర్గత, ఆరోగ్యశాఖ అధికారులు పేర్కొన్నారు. కొన్ని రోజుల తర్వాత ఒమైక్రాన్(B.1.1.529)పై ఓ అవగాహన ఏర్పడే అవకాశం ఉందని, అప్పటి వరకు కువైత్ విడిచి బయటకు వెళ్లొద్దని సూచించారు. అలాగే నవంబర్ 27న మంత్రివర్గం  తీసుకువచ్చిన ప్రత్యేక కరోనా నిబంధనలను పౌరులు, నివాసుతులు పాటించాలని కోరారు. తప్పని పరిస్థితిలో మాత్రమే ప్రత్యేక అనుమతులు తీసుకుని వెళ్లొచ్చని తెలిపారు. ఇక ఇప్పటికే ఒమైక్రాన్ కట్టడికి  కువైత్ చర్యలు చేపట్టింది. దీనిలో భాగంగా తొమ్మిది ఆఫ్రికన్ దేశాలకు కువైత్ విమాన సర్వీసులు నిలిపివేసింది. ఈ మేరకు కువైటీ జనరల్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ ప్రకటన చేసింది.

దక్షిణాఫ్రికా, నమీబియా, బోత్స్వానా, జింబాబ్వే, మొజాంబిక్, లెసోతో, ఈశ్వతిని, జాంబియా, మాలావికు విమాన సర్వీసులు క్యాన్సిల్ చేసినట్లు ప్రకటించింది. అయితే, కువైత్ నుంచి ఆయా దేశాలకు వెళ్లే కార్గో విమాన సర్వీసులకు దీని నుంచి మినహాయింపు ఇచ్చింది. అలాగే ఈ దేశాల నుంచి వచ్చే కువైత్ పౌరులకు 7 రోజుల ఇన్‌స్టిట్యూషనల్ క్వారంటైన్(సంస్థాగత నిర్బంధం) తప్పనిసరి చేసింది. అలాగే వారికి దేశంలో దిగగానే పీసీఆర్ టెస్టు కూడా ఉంటుంది. దీంతో పాటు క్వారంటైన్‌లో ఉన్నప్పుడు ఆరో రోజున రెండోసారి పీసీఆర్ టెస్టు చేయించుకోవాలి. అలాగే ప్రస్తుత కరోనా కొత్త వేరియంట్ విపత్కర పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని కువైత్ పౌరులు కొన్ని రోజుల పాటు ఆఫ్రికన్ దేశాలకు ప్రయాణాలు పెట్టుకోవద్దని అధికారులు కోరారు. ఇక ఈ తొమ్మిది దేశాల నుంచి వచ్చే వలసదారులకు కువైత్‌లో ప్రవేశం లేదు. ఒకవేళ కువైత్ రావాలనుకుంటే ఆంక్షలు విధించని వేరే దేశంలో కనీసం 14 రోజులు స్టే చేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం కొత్త వేరియంట్ నేపథ్యంలో బయటి దేశాల్లో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా కువైత్ హెల్త్ అథారిటీ సూచన మేరకు ఈ నిబంధనలు విధిస్తున్నట్లు సంబంధిత అధికారులు వెల్లడించారు. 

Advertisement

తాజా వార్తలుమరిన్ని...

Advertisement