Jun 19 2021 @ 18:43PM

‘మేజర్‌’ షూటింగ్‌ మళ్లీ మొదలయ్యేది ఎప్పుడంటే..?

అడివి శేష్‌ హీరోగా, పాన్‌ ఇండియా మూవీగా రూపొందుతోన్న చిత్రం ‘మేజర్‌’. మ‌హేష్‌బాబు జీఎమ్‌బీ ఎంటర్‌టైన్‌మెంట్, ఏ ఫ్లస్‌ ఎస్‌ మూవీస్‌ సంస్థల అసోసియేషన్‌తో సోనీ పిక్చర్స్‌ సంస్థ నిర్మిస్తోన్న ఈ చిత్రం తొంభై శాతం చిత్రీకరణ జరుపుకుంది. కరోనా సెకండ్‌ వేవ్‌ కారణంగా మిగిలివున్న షూటింగ్‌ వాయిదా పడింది. ప్రస్తుతం కరోనా ఉదృతి కాస్త తగ్గిన నేపథ్యంలో తిరిగి చిత్రీకరణను ప్రారంభించబోతున్నట్లుగా చిత్రయూనిట్‌ పేర్కొంది. అడివి శేష్‌ కెరీర్‌లో ప్రతిష్టాత్మకంగా రూపుదిద్దుకుంటున్న ఈ ‘మేజర్‌’ సినిమాకి.. అతనే స్క్రిప్ట్‌ అందిస్తుండటం విశేషం.


‘‘మేజర్‌.. సినిమా షూటింగ్‌ను తిరిగి స్టార్ట్‌ చేయనున్నామని తెలియజేసేందుకు చాలా సంతోషిస్తున్నాను. గత ఏడాది చిట్కుల్‌ (హిమాచల్‌ప్రదేశ్‌లోని కిన్నూరు జిల్లాలో ఓ ప్రాంతం)లో ‘మేజర్‌’ చిత్రీకరణ మొదలైంది. అక్కడ అంతగా చలిగా ఏం లేదు. కానీ ఆ ప్రాంతపు విజువల్స్, అక్కడివారితో ఉన్న జ్ఞాపకాలు మరువలేనివి. జూలైలో ‘మేజర్‌’ సినిమా షూటింగ్‌ను తిరిగి మొదలు పెట్టడానికి చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను. అమరవీరుడు మేజర్‌ సందీప్‌ ఉన్నికృష్ణన్‌ జీవితం ఆధారంగా ‘మేజర్‌’ చిత్రం రూపొందుతుంది’’ అంటూ చిత్ర నిర్మాత శరత్‌తో (చిట్కుల్‌లో జరిగిన మేజర్‌ సినిమా వర్కింగ్‌ స్టిల్‌) ఫోటోను షేర్‌ చేశారు హీరో అడివి శేష్‌. నవంబరు 26, 2008న ముంబైలో జరిగిన ఉగ్రవాద దాడుల్లో వీరోచితంగా పోరాడి ప్రజల ప్రాణాలను రక్షించిన అమరవీరుడు సందీప్‌ ఉన్నికృష్ణన్‌ జీవితం ఆధారంగా రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రానికి ‘గూఢచారి’ ఫేమ్‌ శశికిరణ్‌ తిక్క ద‌ర్శ‌కుడు. సయీ మంజ్రేకర్, శోభితా ధూలిపాళ్ళ, ప్రకాష్‌రాజ్, రేవతి, మురళీ శర్మ ఇతర ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు.