Jul 31 2021 @ 23:51PM

చిరంజీవి ఆ పాత్ర చేయవద్దన్నారు: ‘ఆదిత్య 369’ హీరోయిన్ మోహిని

చిన్నప్పటి ముద్దు పేరు ‘తంజావూరు మహాలక్ష్మి’.. 

సినిమాల్లో మారు పేరు మోహిని.. ఇప్పుడు ‘క్రిస్టియానా’.. 

‘ఆదిత్య 369’, ‘డిటెక్టివ్‌ నారద’ వంటి సినిమాల్లో నటించి తెలుగు ప్రేక్షకులను అలరించిన మోహిని జీవితంలో మలుపులెన్నో! 

వివిధ భాషల్లో వందకు పైగా సినిమాల్లో హీరోయిన్‌గా నటించిన మోహిని- కోట్ల మంది హిందువులకు గురువైన రమణ మహర్షికి వరసకు మనమరాలు కూడా! 

శుద్ధ శ్రోత్రియ బ్రాహ్మణ కుటుంబంలో పుట్టి పెరిగిన మోహిని ప్రస్తుతం క్రైస్తవ మతాభిమాని. 

రమణ మహర్షితో తనకున్న బాంధవ్యాన్ని గురించి, తన సినిమాల గురించి.. క్రైస్తవం బాట పట్టడానికి వెనకున్న కారణాల గురించి మోహిని ఆంధ్రజ్యోతితో మాట్లాడారు.


మీ సినీ రంగ ప్రవేశం ఎలా జరిగింది?

మా పూర్వీకులది తంజావూరు. మాది శుద్ధ శ్రోత్రియ బ్రాహ్మణ కుటుంబం. నాన్నగారు మద్రాసు హార్స్‌రేస్‌ క్లబ్‌లో సెక్రటరీగా వ్యవహరించేవారు. నాకు 1991లో ‘ఇరమన రోజావే’లో తొలి సినిమా అవకాశం వచ్చింది. అప్పటికి నాకు 13 ఏళ్లు. నా సినీ రంగ ప్రవేశం కూడా విచిత్రంగా జరిగింది. నేను డ్యాన్స్‌ చేస్తున్న ఫొటోలను ప్రముఖ నిర్మాత పంజు అరుణాచలం చూసి- నాన్న దగ్గరకు వచ్చి-  ‘మీ అమ్మాయి కళ్లు చాలా అందంగా వున్నాయి. కొంచెం సైరాబానులా, జయప్రదలా వుంది. సినిమాల్లో నటిస్తుందా?’ అని అడిగారట. నాన్న ఇంటికి వచ్చి నన్ను అడిగారు. నేను ముందు ఒప్పుకోలేదు. ఆ సినిమా కొన్ని కారణాల వల్ల ఆగిపోయింది. ఏడాది తర్వాత వాళ్లే మళ్లీ వచ్చి అడిగారు. ఆ సినిమా షూటింగ్‌లో నన్ను అందరూ చిన్న పిల్లలా చూసేవారు. షూటింగ్‌ ఆలస్యమయితే చాలు- చాక్‌లెట్‌లు ఇచ్చేవారు. ఈ సినిమా జరుగుతున్న సమయంలోనే - ‘ఆదిత్య 369’లో అవకాశం వచ్చింది. ఆ సినిమా డైరక్టర్‌ సింగీతం శ్రీనివాసరావుగారు కూడా నన్ను చిన్నపిల్లలాగే చూసేవారు. అలా నా సినీ జీవితం ప్రారంభమయింది. ఇక్కడ ఇంకో విషయం కూడా చెప్పాలి. నా అసలు పేరు మహాలక్ష్మి. నేను ఇండస్ట్రీకి వచ్చే సమయానికి - లక్ష్మి,  శ్రీలక్ష్మి, మహాలక్ష్మి పేర్లలో సీనియర్‌ నటీమణులు ఉన్నారు. ఆ సమయంలోనే హిందీలో ‘తేజాబ్‌’ విడుదలయింది. దానిలో హీరోయిన్‌ మాధురి దీక్షిత్ పాత్ర పేరు మోహిని. దాంతో ఆ పేరే నాకు పెట్టారు. 


మీది శుద్ధ శ్రోత్రియ బ్రాహ్మణ కుటుంబం అంటున్నారు.. మీరు సినిమాల్లో నటిస్తానంటే వ్యతిరేకత రాలేదా?

మా ఇంట్లో వాళ్లు ఒప్పుకున్నారు. కానీ చుట్టాల్లో మాత్రం చాలా వ్యతిరేకత వచ్చింది. మాతో మాట్లాడటం మానేశారు. కొందరైతే ఇప్పటికీ మాట్లాడరు. మొదట్లో నేను, అమ్మ బాధపడేవాళ్లం. ఇప్పుడు పట్టించుకోవటం మానేశాం. 

మీరు తెలుగులో తక్కువ సినిమాలే చేశారు.. ప్రత్యేకమైన కారణమేదైనా ఉందా?

తెలుగు ఇండస్ట్రీలో గ్లామర్‌ ఎక్కువ ఆశిస్తారు. ఒక హీరోయిన్‌ నిద్ర పోయి లేచే సీన్‌ ఉందనుకుందాం. ఆ సీన్‌లో కూడా హీరోయిన్‌కు చీర నలగకూడదు. మేకప్‌, లిప్‌స్టిక్‌ చెరగకూడదు. దీనిని నేను జీర్ణించుకోలేకపోయా... బహుశా అలాంటి పరిస్థితులను అర్థం చేసుకొనే పరిణతి నాకు అప్పుడు లేదేమో కూడా! ‘డిటెక్టివ్‌ నారద’ తర్వాత చాలా అవకాశాలు వచ్చాయి. నాకు, దివ్యభారతికి మధ్య పోటీ ఉండేది. కానీ నాకు గ్లామర్‌ ఎక్కువగా ఉన్న పాత్రలు చేయటం ఇష్టం ఉండేది కాదు. దాంతో నాగార్జున లాంటి అగ్రహీరోలతో చేసే అవకాశాలొచ్చినా వదులుకున్నా. అందుకే నా కెరీర్‌ మొత్తంలో వందకు పైగా సినిమాలు చేస్తే.. వాటిలో తెలుగు సినిమాలు ఎనిమిదే ఉన్నాయి. హిందీలో కూడా రెండు సినిమాలు చేశా. కానీ అక్కడ ఉండే అసహజ ధోరణి తట్టుకోలేకపోయా. 


ఎవరైనా తెలుగు హీరోలతో కలిసి పనిచేయలేకపోయాననే అసంతృప్తి ఉందా?

నేను నాగార్జునగారి వీరాభిమానిని. ‘గీతాంజలి’, ‘శివ’ సినిమాలు అనేక సార్లు చూశా. చిన్నప్పటి నుంచి నేను ఆయనకు పెద్ద ఫ్యాన్‌ని. ఆయనతో కలిసి నటించలేకపోయా. రజనీగారితో చేయలేకపోయాననే బాధ ఉంది. ఆయన పక్క నేను మరీ చిన్న పిల్లలా కనిపిస్తానని నిర్మాతలు నన్ను ఎంపిక చేయలేదని అప్పట్లో అనేవారు. ఇక చిరంజీవిగారి పక్కన హీరోయిన్‌గా చేయలేకపోయా! ‘హిట్లర్‌’ సినిమాలో హీరోయిన్‌ పాత్ర కొద్దిలో మిస్‌ అయింది. చెల్లెలి పాత్రకు ఎంపిక చేశారు. చిరంజీవిగారు ‘‘నిన్ను చెల్లెలి పాత్ర ఎవరు చేయమన్నారు.. వద్దు..’’ అన్నారు. అప్పుడు సుహాసిని గారు కలగజేసుకొని- ‘‘నేను మీకు చెల్లెలిగాను, హీరోయిన్‌గాను చేశాను కదా..’’ అని ఒప్పించారు. ఆ తర్వాత ఆయనతో హీరోయిన్‌గా చేసే అవకాశం లభించలేదు. 


ఎక్కువ సినిమాలు చేస్తున్న సమయంలో మానేసి అమెరికాకు ఎందుకు వెళ్లిపోయారు?

నేను 1991లో ఇండస్ట్రీలోకి వచ్చా. 1999లో నా పెళ్లి అయింది. ఎనిమిదేళ్ల పాటు క్షణం తీరిక లేకుండా సినిమాల్లో నటించా. నా భర్త కానీ,  ఆయన కుటుంబం కానీ నేను సినిమాల్లో నటించకూడదని ఎలాంటి షరతులు పెట్టలేదు. వాస్తవానికి నేను పెళ్లి అయిన తర్వాత కూడా పది సినిమాలు చేశా. కొన్ని సీరియల్స్‌లో కూడా నటించా. పెళ్లి అయిన కొద్ది కాలానికే నేను గర్భవతిని అయ్యాను. ఆ తర్వాత కొన్ని అనారోగ్య సమస్యలు వచ్చాయి. ఆ తర్వాత అమెరికాకు వెళ్లిపోయా. ఇప్పుడు మళ్లీ చిత్రాల్లో నటించాలని ఉంది. మంచి పాత్రలు లభిస్తే తప్పకుండా నటిస్తా. 


మీరు ఆధ్యాత్మిక గురువు రమణ మహర్షికి బంధువులు కదా.. మీరు క్రైస్తవ మతంలోకి ఎలా మారారు?

రమణ మహర్షి కజిన్‌ బ్రదర్‌ మా తాతగారు. అలా మాకు, ఆయనకు మధ్య సన్నిహిత సంబంధం ఉంది. మా ఇంట్లో కూడా చిన్నప్పటి నుంచి పూజలకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేవారు. అందరం కలిసి గుడికి వెళ్లేవాళ్లం. మడి ఆచారాలు కూడా పాటించేవాళ్లం. నాకు పెళ్లి అయిన తర్వాత కొన్ని సమస్యలు వచ్చాయి. ఆ సమస్యలకు పరిష్కారాలను అన్వేషిస్తున్న సమయంలో క్రీస్తు మార్గం చూపించాడు. దానితో నేను క్రైస్తవ మతంలోకి మారాను. ప్రస్తుతం ఒక చర్చి నిర్మాణంలో చురుగ్గా పాల్గొంటున్నాను.

మీరు క్రైస్తవ మతంలోకి మారినప్పుడు మీ బంధువుల నుంచి వ్యతిరేకత రాలేదా?

రమణ మహర్షి కుటుంబంలోని ఒక అమ్మాయి సత్యమే మాట్లాడాలి. సత్యమార్గాన్నే ఎంచుకోవాలి. సత్యాన్వేషణ చేయాలి. ఆ విధంగా చూస్తే నేను సత్యాన్వేషణే చేస్తున్నా. నేను ఎంచుకున్న మార్గం నిజమైనది. పరిశుద్ధమైనది. ‘రమణ’ అనే ఒక సాధారణ వ్యక్తి రమణ మహర్షి అయ్యారు. మురుగన్‌ అనే దైవాన్ని ఆరాధించి, అనుభూతి పొంది తిరువణ్ణామలైలో ఉండిపోయారు. నాకు క్రీస్తు కనిపించాడు. ఆయన ప్రేమను అనుభవించాను. ఈ విధంగా చూస్తే మా ఇద్దరి మార్గాలు వేరు. రమణమహర్షికి కూడా ఇలాంటి అనుభవం కలిగితే ఆయన కూడా క్రిస్టియన్‌గా మారేవారేమో! నేను అడిగే కొన్ని ప్రశ్నలకు మా బంధువుల వద్ద సమాధానం లేదు. కానీ వారి ప్రశ్నలకు నేను సమాధానం చెప్పగలను. అలాంటప్పుడు వ్యతిరేకత వచ్చే అవకాశమే లేదు.


మళ్లీ తెరమీదకు..

నా భర్త భరత్ ఐటీ రంగంలో పనిచేస్తారు. గతంలో ‘అమెరికన్‌ ఎక్స్‌ప్రెస్’కు చేసేవారు. ప్రస్తుతం టెక్‌మహీంద్రాలో సీనియర్‌ వైస్‌ ప్రెసిడెంట్‌గా ఉన్నారు. నాకు ఇద్దరు పిల్లలు. ఇద్దరూ అమెరికాలో చదువుకుంటున్నారు.


సినిమా ఇండస్ట్రీలో ఉండేంత హార్డ్‌ వర్క్‌ మరెందులోనూ ఉండదు. అవసరాన్ని బట్టి రేయింబవళ్లు కష్టపడతాం. ప్రేక్షకుడిని ఆనందపరచడం కోసం మా కష్టనష్టాలు, మనోభావాలు కనిపించనీయకుండా తెరపై పాత్రను పండిస్తాం. ఆ నటన వెనుక ఎంత కష్టముంటుందో సినిమా ఇండస్ట్రీ వారికి మాత్రమే అర్థమవుతుంది. ఇక లోపాలంటారా? ఏ ఇండస్ట్రీలో లేవో చెప్పండి. నా వృత్తి ఎప్పుడూ పవిత్రమైనదే. అంతే కాదు. నాకు ఇప్పుడు బాధ్యతలు లేవు. పిల్లలు అమెరికాలో చదువుకుంటున్నారు. అందుకే మళ్లీ నటించాలనుకుంటున్నా.

-డాక్టర్‌ ఎస్‌కేఎండీ గౌస్‌బాషా, చెన్నై