Abn logo
May 20 2020 @ 04:02AM

అధర్మాగ్రహం!

మార్చి 14 నాటి అంధ్రజ్యోతిలో జూకంటి జగన్నాధం వ్యాఖ్యానం చదివి ఇది రాస్తున్నాను. ఏప్రిల్ 30 నాటి సంపాదకీయంలో ఆదేశ్ రవి వలస కార్మికుల మీద రాసిన పాటని ప్రశంసిస్తూ, అదే సందర్భంలో శ్రీశ్రీ రాసిన ‘బాటసారి’ కవితని గుర్తు చేసినందుకు జగన్నాధం గారికి కోపం కట్టలు తెంచుకుంది. ‘బట్ట తలకూ, మోకాలికీ ముడి’, ‘చాపల్యం’ అనీ, ‘ఆధిపత్య భావజాలం’ అనీ సంపాదకీయం మీద అధర్మాగ్రహం ప్రకటించారు. ఆయనది అధర్మాగ్రహం ఎందుకంటే:


వేరు వేరు స్థల కాలాల్లో రాసిన రెండు రచనల్ని ‘ఒకే గాటన’ కట్టడానికి సంపాదకీయం ‘తిప్పలు’ పడిందని ఆరోపణ చేశారు. స్థల కాలాలు ఇక్కడ ప్రధానం కాదు. రవి పాటలోని ఇప్పటి వలస కూలీ గానీ, శ్రీశ్రీ కవితలోని అప్పటి కూలీ గానీ ఇద్దరూ ‘కూటి కోసం, కూలి కోసం’ పట్టణానికి బైల్దేరిన వాళ్ళే! ఒకరు 85ఏళ్ళ కిందటి కూలీ, ఇంకొకరు ఇప్పటి కూలీ. అసలు కూలి కోసం వున్న వూరి నించీ, దేశం నించీ దూర ప్రాంతాలకు పోవడం పెట్టుబడి దారీ విధానం పెరిగి, పట్టణీకరణ విస్తరించినప్పటి నుంచీ వుంది. అందుచేత వేరు వేరు స్థల కాలాల కూలీల వ్యధల్ని చిత్రించిన కవిత్వాల్ని కలిపి చెప్పడం ‘అమంజసం’ కాదు. దానివల్ల ‘ఆ నాటికీ ఈ నాటికీ కూలీల బతుకులు మారలేదు’ -అనే నిజం బైట పడడం లేదూ? తేడా అల్లా, ఒకరు ‘తత్వాల’ స్వరంతో పాడారు; ఇంకోరు మాత్రా చందస్సులో రాశారు. రూపంలో తేడాయే గానీ, సారంలో ఏమీ తేడా లేదు. 


‘మట్టిని చీల్చుకుని వచ్చిన కవిలాగా ఆధిపత్య కులాలూ, మిగతా ప్రాంతాల వారూ రాయలేరనే సత్యం ఇప్పటికే రుజువు అయింది’ అని చెప్పుకున్నారు. అంటే, తెలంగాణా ప్రాంతం వారే మట్టిని చీల్చుకుని వచ్చినవారని ఈయన క్లైమ్! మిగతా ప్రాంతాల్లో, ఉదాహరణకి ఉత్తరాంధ్రా, రాయలసీమ ప్రాంతాల సృజనకారుల్లో ‘మట్టిని చీల్చుకుని వచ్చిన’ కవులు లేరా? ఇది, ప్రాంతీయ దురహంకారానికి ఒక మచ్చు తునక!


‘మిగతా వారి సృజన అంతా అవుట్‌సైడర్ గానే’ వుందట! మరి, ఆదేశ్ రవి తెలంగాణా ప్రాంతం సృజన కారుడే అయినా, ఆయన ‘వలస కూలీ’ అయితే కాదు కదా? శ్రీశ్రీ ఎలాగైతే బాటసారి లోని కూలీ కాడో, రవి కూడా వలస కూలీ కానప్పుడు, ఆయన కూడా ‘అవుట్ సైడర్’ గా వుండే రాశారు గదా? ఈ ‘అవుట్ సైడర్’ అనే భావన (కాన్సెప్ట్), సాహిత్యంలో ‘అంటరానితనం’ లాంటిది. స్త్రీలు మాత్రమే స్త్రీల బాధల్ని వ్యక్తం చెయ్యగలరనీ, దళితులు మాత్రమే దళితుల బాధల్ని వ్యక్తం చెయ్యగలరనీ... ఇలాంటి వాదనల్లో పస లేదు. కట్నం వేధింపుల్లో ప్రధాన పాత్ర ధారులు స్త్రీలే, వ్యభిచార గృహాలు నడిపేది స్త్రీ రత్నాలే! బహుజన కులాల్లో కొందరు దళితుల్ని హీనంగా చూస్తారు. దళితుల్లోనే ఒక ఉపకులం వారిని ఇంకో దళిత ఉపకులం వారు నీచంగా చూస్తారు! కాబట్టి, కావలిసింది సరైన సమానత్వ భావజాలం. పితృ స్వామిక భావజాలంతో ఉన్నప్పుడు, స్త్రీ అయినంత మాత్రాన ఫలితం లేదు. నిచ్చెన మెట్ల కులాధిక్య భావ జాలం ఉన్నప్పుడు, ఒక బహుజనుడిగా పుట్టినంత మాత్రాన ప్రయోజనం శూన్యం. ‘పప్పులో తెడ్డుకి ఏమి తెలుసు పప్పు రుచి’ అనే సామెత ఉండనే ఉంది. కార్మికుడు అయినంత మాత్రాన, వర్గ చైతన్యం ఆటోమాటిక్‌గా వుండదు. ‘యుగ యుగాల మకిలి’ వున్న కార్మికవర్గం, దాన్ని వదిలించుకోవడానికి ‘విప్లవం’ అవసరం అంటాడు కార్మిక వర్గ సిద్ధాంత కర్త మార్క్స్. ఒకే ఒక్క మినహాయింపు ఏమిటంటే, ఒక బహుజన కవీ, ఇంకొక సోకాల్డ్ ‘అగ్రకుల’ కవీ ఇద్దరూ ఒకే రకమైన కవితా సామర్థ్యం ఉండి, బహుజనుల బాధల్ని చిత్రించినప్పుడు, బహుజన కవి చిత్రణలో గాఢత (డెప్త్) ఎక్కువగా ఉంటుంది. ఒకే సామర్థ్యమూ, ఒకే భావ జాలమూ ఉన్నప్పుడే అది కనిపిస్తుంది. ఈ సందర్భంలో, ఇటు రవీ, అటు శ్రీశ్రీ ఇద్దరూ కూలీలు కాదు. ఒకరు సినిమా సంగీత దర్శకుడూ, ఇంకోరు సినిమా పాటల రచయితా! కావలిసింది, ఇన్‌సైడరా, అవుట్‌సైడరా అని కాదు. ఒక దయనీయమైన పరిస్థితిని ఎంచుకుని, హృదయాన్ని కదిలించేలా రాశారా లేదా అన్నదే! కాబట్టి, సంపాదకీయంలో వీరిద్దరినీ కలిపి ప్రస్తావించుకోవడం నూటికి నూరుపాళ్ళూ సరైనదే!

ఈడ్పుగంటి నౌరోజీ

Advertisement
Advertisement
Advertisement