Abn logo
Sep 17 2020 @ 04:37AM

నిరంకుశ పాలనకు అడ్డా అత్రాబల్దా

Kaakateeya

జాగీర్దార్లు, దేశ్‌ముఖ్‌లు, దొరల పెత్తందారీతనంపై సాగిన రైతాంగ సాయుధ పోరాటం

ఇబ్రహీంపట్నం, ఆరుట్ల, రాచకొండ గుట్టల్లో గెరిల్లా క్యాంపులు

నేడు తెలంగాణ విమోచన దినం సందర్భంగా ప్రత్యేక కథనం..


మంచాల : 1947లో భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చినా.. దేశంలోని అంతర్భాగమైన తెలంగాణకు మాత్రం రాలేదు. నిజాం నిరంకుశ పాలనలోనే మగ్గుతూనే ఉంది. 1948 సెప్టెంబర్‌ 13న భారత సైన్యం ప్రవేశించడంతో యుద్ధం చేయలేక నిజాంనవాబు లొంగిపోయాడు. దీంతో సెప్టెంబర్‌ 17న తెలంగాణ ప్రాంతం అధికారికంగా భారతదేశంలో విలీనమైంది. అప్పటినుంచి సెప్టెంబర్‌ 17ను తెలంగాణ విమోచన దినంగా ఈ ప్రాంత ప్రజలు పాటిస్తారు. అయినా ప్రభుత్వ సాయుధ బలగాల అండ దండలతో  దేశ్‌ముఖ్‌లు, భూస్వాములు తిరిగి చెలరేగ కుండా తాము పోరాడి సాధించుకున్న భూములను కాపా డుకోవడం కోసం రైతాంగం తదనంతరం మూడేళ్లపాటు వీరోచిత సాయుధ ప్రతిఘటన కొనసాగించారు. ఈ క్రమంలో 1946 నుండి 1951 వరకు సాగిన ప్రజా పోరాటాన్నే తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంగా అభివర్ణిస్తారు. దీనిపై ఆంధ్రజ్యోతి ప్రత్యేక కథనం..


హైదరాబాద్‌ దక్కన్‌ ప్రాంతం అత్రాబల్దా (నిజాం సామ్రాజ్యం)లోని గ్రామాలను నిజాం పాలకులు నిర్బంధ పన్ను వసూళ్ల కోసం విడదీసి పంచుకున్నారు. ఆ సమ యంలో అయితే నిజాం పాలకుల రాక్షసత్వాన్ని ఎదురిం చేవారే లేకుండా పోయారు. మరీ ముఖ్యంగా ఖాసీం రజ్వీ అకృత్యాలకు అంతేలేకుండా పోయింది. రజాకార్ల పాల నలో రైతులు బాంచన్‌దొర అంటూ.. బతకాల్సి వచ్చింది. ఈక్రమంలో ఫ్యూడల్‌ హైదరాబాద్‌ సంస్థానంలో మొదట్లో రైతాంగ పోరాటంగా ప్రారంభమైన ఈ యుద్ధం.. ప్రజల సాయుధ తిరుగుబాటుగా మారింది. దీంతో ఇక్కడి సాయుధబలగాలకు నేతృత్వం వహించింది భీమిరెడ్డి నర్సింహారెడ్డి, కృష్ణమూర్తిలను ప్రముఖంగా చెప్పుకోవచ్చు. సాయుధపోరాటంలో రాజ్యాన్ని మొత్తాన్ని ఉత్తర అడ వులు, దక్షిణ అడవులుగా విభజించుకుని గెరిల్లా దళాలను ఏర్పాటుచేసుకున్నారు. దక్షిణ అడవుల్లో సాయుధ పోరాటానికి భీ.ఎన్‌.రెడ్డి, కృష్ణమూర్తిలు నేతృత్వం వహించేవారు.


అత్రాబల్దాలో ఆరుట్ల ప్రధాన కేంద్రంగా సాయుధ పోరాటం సాగింది. ఈ గెరిళ్లా దళాలను కృష్ణమూర్తి అన్నీతానై నడిపేవాడు. గొరెల్ర కాపరి వేషంలో తిరుగుతూ ఎవరైతే ప్రతిఘటన సామర్థ్యం గల యువకులను దళంలో చేర్చుకుంటూ రజాకార్లు, మిలిటరీ దళాలను ముప్పుతిప్పలు పెట్టేవాడు. ఇబ్రహీంపట్నం బాగాయత్‌కు సంబం ధించి రాచకొండ గుట్టలను స్థావరాలుగా చేసుకొని రజాకార్లు, మిలిటరీకి వ్యతి రేకంగా గెరిల్లా దాడులను కొనసాగించి నట్లుగా చెబుతారు. ఇందులో ప్రము ఖంగా కామ్రేడ్‌ ఎల్లాస్వామి, గుంటు హనుమంతు, దోమ నారాయణరెడ్డి, గునుకుల సోమయ్య, గునుకుల మల్లయ్య, డప్పు దేవుల, బర్ల శివయ్య, పోచమోని జం గయ్య, అడివయ్యలను చెప్పుకోవచ్చు.. వీరేగాక జాపాల గ్రామానికి చెందిన కర్రె కోటప్ప, బీనమోని నర్సింహ, అన్నారం రాములు, రంగా పూర్‌ గ్రామానికి చెందిన కుకుడాల జంగారెడ్డిలు సాయుధ దళాలకు సహాయం చేసినట్లుగా చెబుతారు. ఇంకా అనేకమంది ఈ ప్రాంతంలో జరిగిన సాయుధ పోరాటంలో పాల్గొన్నా ఇక్కడ ప్రముఖంగా వీరి పేర్లే వినిపిస్తాయి. అప్పట్లో గూఢాచారిగా పనిచేసిన అన్నారం రాములు ఆరేళ్లక్రితం మృతిచెందారు.


జిల్లాలో జరిగిన ముఖ్య ఘట్టాలు..

  • ఇబ్రహీంపట్నం జోన్‌లోని ఆరుట్ల క్యాంపుపై సాయుధ దళం మూడు వైపులా దాడిచేసి ముగ్గురిని చంపివేశారు. తదనంతరం ఈ ప్రాంతానికి పీడగా మారిన దేశ్‌ముఖ్‌ చెలమారెడ్డిని సాయుధ గెరిల్లాలు చంపివేశారు. ఇంకా రంగారెడ్డి, లచ్చిరెడ్డి, కాచం బుగ్గ య్యలు మిలిటరీకి ఇన్ఫార్మర్లుగా వ్యవహరిస్తున్నం దుకుగాను గెరిల్లా సాయుధ దళాలు కాల్చిచంపాయి. 
  • రాచకొండ గుట్టల్లో సుమారు 50మంది వరకు గెరిల్లా క్యాంపులో శిక్షణ ఇస్తున్న కామ్రేడ్‌ గట్టా సీతా రామిరెడ్డి, పైలా రామచంద్రారెడ్డిలను వాగువద్ద మిలిటరీ పట్టుకొని కాల్చిచంపింది. 
  • ఇబ్రహీంపట్నం సమీపంలోని పోలీస్‌ అవుట్‌ పోస్టుపై గెరిల్లా దళాలు దాడిచేసి సెంట్రీని చంపేశారు. భయంతో మిగతా పోలీసులు పారిపోవడంతో గెరిల్లా దళాలు తుపాకులను స్వాధీనం చేసుకున్నాయి.

Advertisement
Advertisement