Sep 17 2021 @ 23:27PM

పెళ్లి చేసుకున్నారు... హనీమూన్‌కు వెళ్లారు!

నటి విద్యుల్లేఖా రామన్‌, ఫుడ్‌ ఎంట్రప్రెన్యూర్‌ సంజయ్‌ ఈ నెల 9వ తేదీన చెన్నైలో వివాహ బంధంలో అడుగుపెట్టారు. గతేడాది ఆగస్టులో రోకా వేడుక (పంజాబీలు, సింధీలు వివాహానికి ముందు జరిపే సంబరాలు) జరిగింది. అప్పుడే చాలామంది వీళ్లిద్దరూ పెళ్లి చేసుకున్నారని భావించారు. అయితే... అది వివాహానికి ముందస్తు వేడుక మాత్రమేనని విద్యుల్లేఖా రామన్‌ తెలిపారు. చెన్నైలో 9న ఉదయం తమిళ సంప్రదాయం ప్రకారం, సాయంత్రం సముద్రతీర ప్రాంతంలో సింధీ సంప్రదాయం ప్రకారం... రెండుసార్లు వివాహం చేసుకున్నామని వివరించారు.


కరోనా నిబంధనల కారణంగా కుటుంబ సభ్యులు, సన్నిహిత మిత్రులను తప్ప చలనచిత్ర ప్రముఖులను వివాహానికి ఆహ్వానించలేదని, కరోనా కారణంగా ఇప్పటికే పెళ్లి రెండుసార్లు వాయిదా పడిందని విద్యుల్లేఖ తెలిపారు. పెళ్లి తర్వాత సినిమాల్లో నటిస్తానని, పుట్టినింటితో పాటు మెట్టినింటి మద్దతు తనకు ఉందని ఆమె చెప్పారు. ప్రస్తుతం సంజయ్‌, విద్యుల్లేఖ జంట మాల్దీవుల్లో హనీమూన్‌ ట్రిప్‌లో ఉన్నారు. త్వరలో తిరిగి రానున్నారు. సంజయ్‌కు చెన్నైలో డైట్‌ ఫుడ్‌ బిజినెస్‌ ఉంది. కెటో చెన్నై పేరుతో వ్యాపారం నిర్వహిస్తున్నారు. త్వరలో విద్యుల్లేఖ హీరోయిన్‌గా పరిచయం కానున్నారు.