Jul 26 2021 @ 16:06PM

కమల కుమారి టు జయంతి ఎలా అయిందంటే!

12 ఏళ్ల వయసులో ఎన్టీఆర్‌ ఒళ్లో కూర్చొబెట్టుకుని ముద్దాడిన చిన్నారి... తన పదిహేనో ఏట ఆయన సరసన నటించే అవకాశం దక్కించుకుంటుందని ఎవరైనా ఊహిస్తారా? జయంతి విషయంలో అలాగే జరిగింది. చిన్నతనం నుంచే ఎన్టీఆర్‌ను ఆరాధించే ఆమెకు అతి తక్కువ సమయంలో ఎన్టీఆర్‌తో కలిసి అవకశం అందుకున్నారు. దక్షిణాదితోపాటు హిందీ, మరాఠీ భాషల్లో 500లకు పైగా చిత్రాల్లో నటించి ప్రేక్షకులను అలరించిన జయంతి సోమవారం కన్నుమూశారు. ఆమె జ్ఞాపకాలను గుర్తు చేసుకుందాం...


బళ్లారిలో జన్మించిన జయంతి అసలు పేరు కమలా కుమారి. ఆమె తండ్రి సుబ్రమణ్యం ఇంగ్లిష్‌ టీచర్‌. తల్లి సంతాన లక్ష్మి. చిన్నతనంలో భర్త నుంచి వేరుపడిన సంతాన లక్ష్మి.. పిల్లల్ని తీసుకుని మద్రాస్‌కు మకాం మార్చారు. చిన్నతనం నుంచే కమలకు సినిమాలంటే ప్రాణం. మొదట క్లాసికల్‌ డ్యాన్స్‌ క్లాసుల్లో చేరిన ఆమె సీనియర్‌ నటి మనోరమతో స్నేహం పెంచుకున్నారు. నందమూరి తారక రామారావు ఆమె అభిమాన నటుడు. ఆయన్ను చూడటానికి ఫ్రెండ్స్‌ గ్యాంగ్‌తో స్టూడియోలకు వెళ్తుండేది. ఆ సమయంలో ఆమెను దగ్గరకు తీసుకుని ఒళ్లో కూర్చొబెట్టుకుని ‘పెద్దయ్యాక నా పక్కన హీరోయిన్‌గా చేస్తావా’ అంటూ సరదాగా మాట్లాడుతుండేవారట. ఈ విషయాన్ని జయంతి చాలా ఇంటర్వ్యూల్లో చెప్పారు. 


కాల్షీట్లు ఇవ్వలేనంత బిజీ

క్లాసికల్‌ డాన్సర్‌గా గుర్తింపు తెచ్చుకున్న ఆమె బొద్దుగా ఉండేదని, డాన్సులు చేయలేదేమో అని  ఎవరూ అవకాశం ఇవ్వలేదు. దానిని సవాల్‌గా తీసుకున్న ఆమె పట్టుదలతో బరువు తగ్గింది. కన్నడ దర్శకుడు  వైఆర్‌ పుట్టస్వామి ఓ కొత్త సినిమా కోసం అడిషన్స్‌ నిర్వహిసుండగా డాన్స్‌ రిహార్సెల్‌కు వెళ్లిన జయంతిని చూసి ఆయన తీసే సినిమాలో లీడ్‌ రోల్‌ చేసే అవకాశం ఇచ్చారు. అంతేకాదు కమలా కుమారి పేరును కాస్త.. ‘జయంతి’గా మార్చారు. ‘జెనుగూడు’ చిత్రంతో హీరోయిన్‌గా పరిచయమయ్యారు. ఆ సినిమా పెద్ద హిట్‌ కావడంతో.. కాల్షీట్లు ఇవ్వలేనంత బిజీ అయ్యారు జయంతి. ఆమె నటించిన రెండో సినిమా ‘చందావల్లీ తోట’ సూపర్‌ హిట్‌ అయింది. ఆ చిత్రానికి ప్రెసిడెంట్‌ మెడల్‌ దక్కింది. 


తొలి గ్లామర్‌ డాల్‌...

నటిగా ఆమెను ఓ స్థాయిలో కూర్చోబెట్టిన సినిమా ‘మిస్‌ లీలావతి’ (1965). కన్నడనాట ఓ ప్రభంజనం లాంటి సినిమా అది. అప్పట్లో ట్రెండ్‌ సెట్టర్‌ కూడా. బోల్డ్‌ కంటెంట్‌తో తెరకెక్కిన ఈ చిత్రంతో గ్లామర్‌ సొగసులను పరిచయం చేసింది. కన్నడనాట స్విమ్‌ సూట్‌లో కనిపించిన నటిగా జయంతికి గుర్తింపు వచ్చింది. తన నటనతోనూ దేశవ్యాప్తంగా అభిమానుల్ని సంపాదించుకుంది. ఇందిరాగాంధీ చేతుల మీదుగా మెడల్‌ అందుకున్నారు. అంతేకాదు జయంతిని ఆప్యాయంగా ముద్దాడి శుభాకాంక్షలు తెలిపారామె!


అగ్ర హీరోలతో అవకాశాలు...

1962– 79 సమయంలో దక్షణాదిన జయంతి హవా కొనసాగింది. తెలుగు, కన్నడ, తమిళ భాషల్లో అగ్ర హీరోల సరసన అవకాశాలు దక్కించుకున్నారు. అలా వచ్చిన స్టార్‌డమ్‌లో మరాఠీ, హిందీ భాషల్లోనూ నటించారు. పలు అవార్డులను దక్కించుకున్నారు. ‘మోస్ట్‌ బోల్డ్‌ అండ్‌ బ్యూటీఫుల్‌’ హీరోయిన్‌ అనే పబ్లిసిటీ ఆమెకు నేషనల్‌ వైడ్‌గా గుర్తింపు తెచ్చింది. ఎన్టీఆర్‌ సరసన ‘జగదేక వీరుని కథ’, కుల గౌరవం, కొండవీటి సింహాసనం, జస్టిస్‌ చౌదరి’లో చిత్రాల్లో నటించారు. అక్కినేనితో కలసి చాలా సినిమాలు చేశారు జయంతి. అయితే అవన్నీ చెల్లెలి పాత్రలే. ఆయన సరసన నటించే అవకాశం జయంతికి రాలేదు. అక్కినేని అంటే ఆమె కుటుంబ సభ్యులకు చాలా ఇష్టం. ఆమె తమ్ముడికి ఆయన పేరే పెట్టారు. శోభన్‌ బాబు తో కలసి చాలా చిత్రాల్లో నటించారు. మాంగల్యం, శారద, జీవితం.. పేరు తెచ్చిన చిత్రాలు. కన్నడ దిగ్గజం రాజ్‌కుమార్‌ సరసన 45 సినిమాల్లో నటించారు. పుట్టన్నా కంగళ్‌,  జెమినీ గణేశన్‌, ఎంజీఆర్‌ లాంటి హీరోలతో ఎన్నో కల్ట్‌ క్లాసిక్స్‌లో నటించారు. సపోర్టింగ్‌ రోల్స్‌తో కూడా మెప్పించారు. అవకాశాలు తగ్గుతున్న తరుణంలో తల్లి పాత్రలు కూడా ఆమెను వరించాయి. ఎయిడ్స్‌ ఎడ్యుకేషన్‌లో భాగంగా తీసిన ఓ యానిమేటెడ్‌ ట్యూటోరియల్‌కు ఆమె గాత్రం సైతం అందించడం విశేషం.  అంతే కాదు జయంతి అద్భుతమైన సింగర్‌ కూడా. 


పాత్ర ఏదైనా... పరకాయ ప్రవేశం...

తెలుగు తెరపై జయంతి కథానాయికగానే కాదు అమ్మ, అక్క. చెల్లి, వదిన పాత్ర ఏదైనా దానికి వన్నె తెచ్చిన నాయిక ఆమె. పాత్ర ఏదైనా పరకాయ ప్రవేశం చేసి పండించడం ఆమెకు మొదటి నుంచీ అలవాటు. భావోద్వేగ పాత్రలకు కేరాఫ్‌ అడ్రస్‌ అని కూడా చెప్పొచ్చు. ‘కొండవీటి సింహం’, ‘జస్టిస్‌ చౌదరి’, ‘దొంగ మొగుడు’, తల్లిదండ్రులు,  స్వాతి కిరణం, ఘరానా బుల్లోడు, పెద్దరాయుడు, కంటే కూతుర్నే కను లాంటి చిత్రాలు తెలుగు ప్రేక్షకులకు ఆమెను మరింత దగ్గర చేశాయి. కొండవీటి సింహం, జస్టిస్‌ చౌదరి చిత్రాలు తనకు బాగా నచ్చాయని జయంతి చెప్పేవారు. 2017లో పద్మభూషణ్‌ డాక్టర్‌ సరోజా దేవీ నేషనల్‌ అవార్డు ఆమెకు దక్కింది. 2018లో ఆమె అనారోగ్యం బారినపడి జయంతి చనిపోయిందని మీడియాలో వార్తలు చక్కర్లు కొట్టాయి. దానిని కుటుంబ సభ్యులు ఖండించారు.