Abn logo
Nov 1 2020 @ 02:53AM

నవంబర్‌ స్టార్స్

Kaakateeya

నవంబర్‌ వచ్చిందంటే సెలబ్రేషన్స్‌ మొదలవుతాయి.  ఏ సెలబ్రేషన్స్‌ అనుకుంటున్నారా? తారల బర్త్‌డే సెలబ్రేషన్స్‌... ఐశ్వర్యా రాయ్‌బచ్చన్‌ (నవంబర్‌ 1)తో మొదలుపెడితే షారూఖ్‌ ఖాన్‌, అనుష్క, ఇలియానా, నివేదా థామస్‌, మెహరీన్‌, త్రివిక్రమ్‌, నయనతార... ఇలా ఒకరు, ఇద్దరు కాదు! ఈ నెలలో పదుల సంఖ్యలో స్టార్స్‌ పుట్టిన రోజులున్నాయి. హైదరాబాద్‌లో జన్మించిన బాలీవుడ్‌ కథానాయికలు సుస్మితా సేన్‌ (నవంబర్‌ 19), టబు (నవంబర్‌ 4) పుట్టినరోజులు కూడా ఈ నెలలోనే! పాశ్చాత్య జ్యోతిష శాస్త్ర ప్రకారం - ఈ నెలలో పుట్టిన వారికి ఇతరులను ప్రభావితం చేసే శక్తి ఉంటుంది. అంతే కాదు... వారికి ఎదుటివారిని ఆకర్షించే శక్తి కూడా ఉంటుంది.  ఇలాంటి గుణగణాలు ఏమిటో చూద్దాం!


శాస్త్రం ఏం చెబుతోందంటే.... 

  1. కీర్తి ప్రతిష్ఠలు, సమాజంలో గౌరవం కలిగి ఉంటారు. 
  2. విషయాన్నైనా ముక్కు సూటిగా మాట్లాడతారు. దీని వల్ల కొన్ని సమస్యలు కూడా ఎదురవుతాయి.. 
  3. ఆకర్షణ శక్తి, తెలివితేటలు, ఆత్మవిశ్వాసం వీరికున్న బలాలు. అయినప్పటికీ ఇతరుల మాటలకు తొందరగా ప్రభావితం అవుతారు.
  4. వీరికి కోపం కూడా అధికంగా ఉంటుంది. కోపం వచ్చిందంటే ఎవ్వరినీ లెక్క చేయరు.
  5. వీరు కోరుకున్న దానికోసం ఎంతైనా కష్టపడతారు. ఇష్టంగా కష్టాన్ని అనుభవిస్తారు. తమ మాటే నెగ్గించుకోవడానికి ప్రయత్నిస్తారు.
  6. దైవం పట్ల నమ్మకం ఉంటుంది. మంచి  నడవడిక, ఆచారాలు పాటించటానికి ప్రయత్నిస్తారు. సహాయం చేయడానికి ముందుంటారు. 
  7. ఎక్కువగా ఇతరులను అభిమానించి కొన్ని సందర్భాలలో మోసపోవడం కూడా జరుగుతుంటుంది. వీరు ఇతరులకు చక్కటి స్నేహితులుగా ఉంటారు. వీరు జీవితంలో తొందరపాటు నిర్ణయాలు, తప్పుల వల్ల ఇబ్బందులు పడుతుంటారు. 
  8. ఏకాంతంగా గడపడానికి ఇష్టపడతారు.
ఇలియానా నవంబర్‌ 1

ప్రేక్షకులను ఇట్టే ఆకర్షించే శక్తి ఇలియానా సొంతం. తెరపై ఎంతో ఆత్మవిశ్వాసంతో కనిపిస్తారామె! అయితే... ఇతరుల మాటలకు ప్రభావితమవుతారు. అది ఇప్పుడు కాదులెండి. ఒకప్పుడు! గతంలో తన శరీర సౌష్టవం గురించి ఏ విధంగా దిగులు పడిందీ మొన్నామధ్య ఇన్‌స్టాగ్రామ్‌ పోస్టులో వివరించారు. తనలో లోపాలను అందంగా మలుచుకున్నానని చెప్పుకొచ్చారు. ఇప్పుడామె ఏ విషయాన్నైనా ముక్కుసూటిగా మాట్లాడతారు.


నివేదా థామస్‌ నవంబర్‌ 2


కోరుకున్నదాని కోసం ఎంతైనా కష్టపడటం నివేదా థామస్‌ నైజం. నటి కావాలనేది ఆమె కోరిక. చిన్నతనంలో ఓ వైపు చదువుకుంటూనే, మరోవైపు బాలనటిగా చిత్రాలు చేశారు. రాష్ట్ర పురస్కారమూ అందుకున్నారు. నటన అంటే ఇష్టంతో కష్టపడ్డారు. కథానాయికగా నివేదాకి హోమ్లీ ఇమేజ్‌ ఉంది. ‘వి’లో ట్రెండీ గాళ్‌ క్యారెక్టర్‌ కావడంతో తొలి పాటలో డ్యాన్స్‌ చేయాల్సి వచ్చింది. అందుకోసం, ముందుగా డ్యాన్స్‌లో ట్రైనింగ్‌ తీసుకుని, కష్టపడి మరీ చేశారు.


షారూఖ్‌ ఖాన్‌ నవంబర్‌ 2


 బాలీవుడ్‌లో కొందరు షారూఖ్‌ను ముక్కోపి అంటుంటారు. కోపం వస్తే ఎవ్వరినీ లెక్క చేయరని చెబుతుంటారు. తన కోపమే తనకు శత్రువు అన్నట్టు... షారూఖ్‌ కోపమే అతనికి కొన్నాళ్లు శత్రువుగా మారింది. స్నేహితులు సల్మాన్‌ ఖాన్‌, ఆమిర్‌ ఖాన్‌కు అతణ్ణి దూరంగా ఉంచింది. తన మాట నెగ్గించుకోవడానికి కొన్ని చిత్రాలు చేశాడని టాక్‌.

మెహరీన్‌ నవంబర్‌ 5


ముక్కుసూటిగా మాట్లాడటం మెహరీన్‌ కౌర్‌ ఫిర్జాదా తత్వం. అందువల్ల, ఓ సమస్యనూ ఎదుర్కొన్నారు. ‘ఆశ్వత్థామ’ విడుదల సమయంలో ఆమె పారితోషికం, హోటల్‌ బిల్లులు చెల్లింపు వంటి విషయాల్లో నిర్మాతలతో గడబిడ జరిగింది. గొడవ మీడియాకి ఎక్కింది. అప్పుడు మెహరీన్‌ మౌనంగా ఉండలేదు. ముక్కుసూటిగా తాను చెప్పాలనుకున్నది సామాజిక మాధ్యమాల్లో చెప్పారు.

అనుష్క  నవంబర్‌ 7


అనుష్క ఏకాంతంగా గడపడానికి ఇష్టపడతారని చెప్పవచ్చు. సినిమా ప్రచార కార్యక్రమాల్లో మినహా సాధారణంగా సినిమా పార్టీలకు హాజరు కారు. అలాగని, ఆమెకు స్నేహితులు లేరని కాదు. ఖాళీ సమయాల్లో పుస్తకాలు చదవడం, కుటుంబంతో కలిసి దేవాలయాలకు వెళ్లడం చేస్తుంటారు. అనుష్కకు దైవచింతన కూడా ఎక్కువే.

త్రివిక్రమ్‌ నవంబర్‌ 7


దర్శకుడి త్రివిక్రమ్‌కి దైవం పట్ల నమ్మకం ఉంది. ఆయన చిత్రాల్లో అది కనిపిస్తుంటుంది. ‘ఖలేజా’ చిత్రంలో ‘దైవం మానుష రూపేణా’ అనే విషయం చెప్పడానికి ప్రయత్నించారు. ఆచారాలు పాటించడానికి, తన చిత్రాల ద్వారా విలువలు చెప్పడానికి ప్రయత్నిస్తారు. సాయం చేయడానికి ముందుంటారు. వీరు ఇతరులకు చక్కటి స్నేహితులుగా ఉంటారు. త్రివిక్రమ్‌తో ఎవరు పని చేసినా... ఆయన స్నేహం గురించే చెబుతారు. హీరో పవన్‌ కల్యాణ్‌, త్రివిక్రమ్‌ స్నేహం గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. చిత్రసీమలో వాళ్లిద్దర్నీ ఆప్తమిత్రులుగా పేర్కొంటారు. అలాగే, ఆయనకు మహేశ్‌బాబు, అల్లు అర్జున్‌, నితిన్‌ తదితరులతోనూ మంచి స్నేహ సంబంధాలు ఉన్నాయి.

నయనతార నవంబర్‌ 18

నయనతారకు ఆకర్షణ శక్తి, తెలివితేటలు, ఆత్మవిశ్వాసం ఎక్కువ. అయితే... అన్నిటికంటే ముఖ్యంగా ఇతరులను అభిమానించి కొన్నిసార్లు మోసపోయిన నైజం ప్రేక్షకులకు ఎక్కువ గుర్తుంటుంది. ప్రేమలో రెండుసార్లు నయనతార మోసపోయారు. ప్రభుదేవాతో ప్రేమ పెళ్లి పీటలు ఎక్కుతుందని భావించారంతా! అందుకోసం, ఆమె మతం కూడా మార్చుకున్నారు. కానీ, పెళ్లి పీటల వరకూ రాకుండా ప్రేమకు ఫుల్‌ స్టాప్‌ పడింది. ఆ తర్వాత శింబుతో ప్రేమ వ్యవహారం కూడా సుఖాంతం కాలేదు. ప్రేమ వ్యవహారాల్లో తొందరపాటు నిర్ణయాల వల్ల ఇబ్బందులు పడ్డారు.

నాగచైతన్య అక్కినేని నవంబర్‌ 23


ఏయన్నార్‌ మనవడు, నాగార్జున కుమారుడిగా తెలుగు చిత్ర పరిశ్రమలో హీరోగా నాగచైతన్య అడుగుపెట్టారు. ఆయనతో పని చేసినవారంతా చెప్పేది ఒక్కటే... ‘చైతూది మంచి నడవడిక’ అని! అతడిలో ఆకర్షణ శక్తి కూడా ఎక్కువే. రొమాంటిక్‌ ప్రేమకథలతో ప్రేక్షకుల మనసు దోచారు.

 రాశీ ఖన్నా నవంబర్‌ 30


రాశీ ఖన్నాకి దైవభక్తి ఎక్కువే. ఆమె శివుడికి మహా భక్తురాలు. ఆచారాలు పాటించే ప్రయత్నం చేస్తారు. ఆమెలో దానగుణమూ ఉంది. అయితే, చేసిన దానం గురించి చెప్పుకోకూడదని అంటారామె. నటిగా పేరు ప్రఖ్యాతల కోసం ఎంతో కష్టపడ్డారు. బరువు తగ్గారు. పాత్రలకు తగ్గట్టు తనను తాను మలుచుకున్నారు. ఆత్మవిశ్వాసంతో కనిపిస్తారు.

Advertisement
Advertisement