Abn logo
Sep 18 2021 @ 01:21AM

- జోగి రమే్‌షపై చర్యలు తీసుకోవాల్పిందే

చిత్తూరులో రాస్తారోకో

 జిల్లావ్యాప్తంగా తెలుగు తమ్ముళ్ల నిరసనలు


తిరుపతి, సెప్టెంబరు 17 (ఆంధ్రజ్యోతి): గుంటూరు జిల్లా ఉండవల్లిలోని మాజీ ముఖ్యమంత్రి, ప్రతిపక్షనేత చంద్రబాబు ఇంటిపై వైసీపీ ఎమ్మెల్యే జోగి రమేష్‌ బృందం దాడి చేయడాన్ని ఖండిస్తూ శుక్రవారం జిల్లావ్యాప్తంగా టీడీపీ శ్రేణులు రోడ్లపైకి వచ్చి పెద్దఎత్తున ఆందోళనలు చేపట్టారు. రౌడీమూకలతో రాళ్లదాడి చేయిస్తే భయపడి పారిపోయే పార్టీ టీడీపీ కాదంటూ హెచ్చరించారు.మంత్రి పదవికోసం జోగి రమేష్‌ రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడ్డారని విమర్శించారు. జోగిపై కేసు నమోదుచేసి చర్యలు తీసుకోకపోతే ఆందోళనలు మరింత వుధ్రుతం చేస్తామంటూ తెలుగు తమ్ముళ్లు హెచ్చరించారు. తిరుపతిలో మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ, నేతలు నరసింహ యాదవ్‌, పుంగనూరు ఇన్‌చార్జి అనీషా రెడ్డి, ఆర్సీ మునికృష్ణ, సూరా సుధాకర రెడ్డి, దంపూరి భాస్కర్‌ మీడియాతో మాట్లాడారు. హింస లేనిదే వైసీపీ నేతలకు పూటగడిచేటట్టు లేదన్నారు. దాడి చేసినవారిని వదిలేసి దాడిని ఖండించిన టీడీపీ నేతలపై కేసులు పెట్టడం ఏమిటని ప్రశ్నించారు. చిత్తూరులో ఎమ్మెల్సీ దొరబాబు, నగర అధ్యక్షురాలు కటారి హేమలత, తెలుగు రైతు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాచిగుంట మనోహరనాయుడు, కాజూరు బాలాజి, కోదండ యాదవ్‌ తదితరులు గాంధీ విగ్రహం వద్ద రాస్తారోకో చేపట్టారు. జోగి రమే్‌షను వెంటనే అరెస్ట్‌ చేయాలని డిమాండు చేశారు.పోలీసులు అడుకడకోవడంతో కొంతసేపు తోపులాట జరిగింది. ఈక్రమంలో ఎమ్మెల్సీ స్వల్ప అస్వస్థతకు గురవడంతో 108 వాహనంలో చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. రొంపిచెర్ల క్రాస్‌లో టీడీపీ కార్యనిర్వాహక కార్యదర్శి చల్లా రామచంద్రా రెడ్డి ఆధ్వర్యంలో జాతీయ రహదారిపై బైఠాయించారు. దాడుల సంస్కృతి మంచిది కాదని పుంగనూరు టీడీపీ సమన్వయకర్త ఎన్‌.శ్రీనాథరెడ్డి హెచ్చరించారు. తిరుపతి రూరల్‌ మండల అధ్యక్షుడు ఈశ్వర్‌ రెడ్డి, మాజీ ఎంపీటీసీ అమిలినేని మధు తదితరులు తిరుచానూరు సమీపంలోని తనపల్లె క్రాస్‌ వద్ద జాతీయ రహదారిపై నల్లజెండాలతో నిరసన వ్యక్తంచేశారు. పుత్తూరులో పట్టణ అధ్యక్షుడు జీవరత్నం నాయుడు, ధనపాల్‌, గణేష్‌ తదితర నేతలు రోడ్డుపైకి వచ్చి నిరసన చేపట్టారు. నగరిలో పట్టణ అధ్యక్షుడు రమేష్‌ బాబు, బాలాజీ మీడియా సమావేశంలో జోగి చర్యలను తప్పుబట్టారు. తిరుపతి పార్లమెంటు నియోజకవర్గ తెలుగు యువత అధ్యక్షుడు రవినాయుడు ఆధ్వర్యంలో తిరుపతిలోని అంబేడ్కర్‌ విగ్రహం వద్ద జోగి రమేష్‌ ఫొటోను అతికించిన ఫుట్‌బాల్‌ను తొక్కుతూ చంద్రబాబు జోలికొస్తే ఫుట్‌బాల్‌ ఆడతామంటూ హెచ్చరించారు.ఇంకా పలు మండల కేంద్రాల్లో టీడీపీ శ్రేణులు పెద్దఎత్తున నిరసన కార్యక్రమాలు చేపట్టాయి. 

తిరుపతిలో జోగి రమేష్‌ పోస్టర్లకు తెలుగుయువత నిప్పు

జోగి రమేష్‌పై హత్యాయత్నం కేసు పెట్టాలి!


టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి మద్దిపట్ల సూర్యప్రకాష్‌


చంద్రబాబు ఇంటిపై దాడికి పాల్పడిన వైసీపీ ఎమ్మెల్యే జోగి రమేష్‌పై హత్యాయత్నం కేసు నమోదు చేయాలి. రాష్ట్రంలో శాంతిభద్రతల తీరుపై గవర్నర్‌ తక్షణం జోక్యం చేసుకుని కేంద్రానికి నివేదిక పంపాలి. ప్రధాన ప్రతిపక్ష నేత ఇంటిపై అధికార పార్టీ ఎమ్మెల్యేలు, నాయకులు దాడి చేస్తుంటే పోలీసు యంత్రాంగం ఏంచేస్తోంది?

వి.కోటలో కొవ్వొత్తులు వెలిగించి నిరసన

ప్రజలు తిరగబడే రోజులు దగ్గరపడ్డాయి: టీడీపీ మీడియా కో ఆర్డినేటర్‌ శ్రీధర్‌ వర్మ


చంద్రబాబు ఇంటిపై దాడికి పాల్పడడం వైసీపీ నేతల దిగజారుడుతనానికి పరాకాష్ట. దీన్నిబట్టి టీడీపీ అంటే వైసీపీ నేతల్లో ఎంత అభద్రతా భావం నెలకొని వుందో తెలిసిపోతోంది. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలమైన నేపధ్యంలో సీఎం జగన్‌ నాటకాలన్నీ ప్రజలకు తెలిసిపోయాయి. వైసీపీ ప్రభుత్వంపై ప్రజలు తిరగబడే రోజులు దగ్గరపడ్డాయి.


రొంపిచెర్ల క్రాస్‌లో టీడీపీ రాస్తారోకో

 ప్రభుత్వానికి సిగ్గుచేటు: నల్లారి 


 రాష్ట్రానికి సుదీర్ఘకాలం ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు ఇంటిపై వైసీపీ నేతలు దాడికి పాల్పడడం ఆ పార్టీకే కాకుండా ప్రభుత్వానికి కూడా సిగ్గుచేటు. రెండున్నరేళ్ళుగా జరుగుతున్న వైసీపీ దౌర్జన్యాలకు, దాడుల పరంపరకు తాజా ఘటన పరాకాష్ట.ఇలాంటి చౌకబారు చర్యలకు పాల్పడే కంటే ఉద్యోగులకు సకాలంలో జీతాలు చెల్లించడంపైన, ఇచ్చిన హామీలు నెరవేర్చడంపైనా దృష్టి సారిస్తే మంచిది.


 చెత్త పాలకులంటే తప్పేంటి : మాజీ మంత్రి  అమర్‌ 


  చెత్తపై పన్నువేసే వాళ్లను చెత్త పాలకులని కాకుండా ఇంకేమనాలి?రెండేళ్లుగా ప్రజలపై ఇష్టానుసారంగా పన్నులు వేస్తూ వారి రక్తం పీల్చుతున్న ముఖ్యమంత్రిని ఏమనాలి? బీసీలంటే ప్రభుత్వానికి ఎందుకంత చులకన?మారణాయుధాలతో ప్రతిపక్ష నాయకుడి ఇంటిపైకి వచ్చే సంస్కృతికి వైసీపీ నేతలు తెరలేపడం మంచి పద్ధతి కాదు.