Abn logo
May 12 2020 @ 00:36AM

జవాబుదారీ లేని పాలీమర్స్ పాపాలు

అనేక నేరాలకు పాల్పడుతూ, దేశ చట్టాలను  ఉల్లంఘిస్తూ, ప్రభుత్వాన్నీ తప్పు దారి పట్టిస్తూ, ఆఖరుకు ప్రజల ప్రాణాలను బలిగొంటున్న ఎల్‌జి పాలీమర్స్ కంపెనీ ఎట్టి పరిస్థితులలోనూ జనావాసాల మధ్య ఉండడం సమర్థనీయంకాదు. భద్రతా ప్రమాణాలు పాటించకపోవడమే గ్యాస్ లీక్‌కు దారితీసిందని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ స్పష్టం చేయడం గమనార్హం. ఈ దారుణానికి కారణమైన యాజమాన్యాన్ని కట్టడి చేయడం కాకుండా అలా కోరిన ప్రజలనే అరెస్టులు చేయడం దేనిని సూచిస్తుంది?


విశాఖ నగరంలోని ఎల్‌జి పాలిమర్స్ కంపెనీలో జరిగిన ఘోర దుర్ఘటన దేశంలోనే కాకుండా ప్రపంచవ్యాపితంగా సంచలన వార్త అయింది. ఒక్కసారిగా ప్రమాదకర గ్యాస్ లీకవడంతో, కంపెనీని ఆనుకునే ఉన్న గ్రామ ప్రజలు ఒక్క ఉదుటున ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని, ఇళ్లకు తాళాలు కూడా వేయకుండా కట్టు బట్టలతో పరుగులు తీశారు. కళ్ళు మంటలు, ఊపిరి సలపకపోవడంతో ప్రజలు ఉక్కిరిబిక్కిరయ్యారు. 12మంది ప్రాణాలు కోల్పోయారు. 350మంది చికిత్సకై ఆసుపత్రులలో చేరారు. అనేక మూగ జీవాలు చనిపోయాయి. అపార వృక్ష సంపద నాశనమైంది. సుమారు 10 కిలోమీటర్ల మేరకు ఈ గ్యాస్ లీక్ ప్రభావం ఉండడంతో లక్షలాది ప్రజలు భయంతో పరుగులు తీశారు. స్థూలంగా చెప్పాలంటే విశాఖ నగరమంతా భయంతో వణికిపోయింది.


ఇలాంటి ఘోర దుర్ఘటనకు కారణమైన యాజమాన్యాన్ని వెంటనే అరెస్టు చేయాలని, ప్రమాదకర పరిశ్రమను తరలిస్తామని ముఖ్య మంత్రి ప్రకటించాలని ఆ ప్రాంత ప్రజల నుండే కాకుండా విశాఖ నగర వాసులందరి డిమాండుగా ముందుకు వచ్చింది. ముఖ్యమంత్రి విశాఖకు వెంటనే వచ్చి, వెళ్లారు కానీ అదేం చిత్రమో ప్రజల డిమాండ్ల మీద ఏ రకమైన ప్రకటనా చేయలేదు. దీనితో ప్రజలలో సహజంగానే అసంతృప్తి మొదలైంది. ఆ గ్రామ ప్రజలు మృతుల కుటుంబాలతో ఈ నెల 9న కంపెనీ గేటు వద్ద నిరసన చేపట్టారు. రాష్ట్ర మంత్రులు, ప్రభుత్వ అధికారులు ఆ సమయంలో కంపెనీలోకి వచ్చి యాజమాన్యాన్ని కలిసారు. సహజంగానే తమ డిమాండ్లపై మంత్రులు ప్రకటన చేస్తారని ప్రజలు భావించారు.


అయితే అలాంటిదేమీ రాకపోవడంతో ప్రజలు వారిని నిలదీశారు.ఇంకేముంది? పోలీసులను రంగంలోకి దింపి భర్తను కోల్పోయిన మహిళ, బిడ్డను కోల్పోయిన తల్లి అని కూడా చూడకుండా అందరిని విచక్షణారహితంగా లాగి పారేశారు. వైరస్ నేపథ్యంలో ప్రభుత్వమే చెప్పిన భౌతిక దూరం, మొహానికి మాస్కులవంటివన్నీ గాలికి పోయాయి. ఇది చాలదన్నట్లు స్థానిక గ్రామస్తులతోపాటు, వారికి మద్దతుగా నిలిచిన వామపక్ష నాయకులను అరెస్టు చేశారు. మొత్తం 50మందికి పైగా కేసులు పెట్టారు. నేరం చేసి, ప్రజల ప్రాణాలను బలిగొన్న యాజమాన్యాన్ని వదిలేసి, వారి సమక్షంలోనే బాధితులపై విరుచుకుపడడం రాష్ట్ర ప్రభుత్వం ఎవరివైపుందనేది స్పష్టం చేస్తోంది. కరోనా మహమ్మారిని ఎదుర్కోవడంలో సముచితపాత్ర నిర్వహిస్తున్న పోలీసు వ్యవస్థపై ప్రజలకు ఏర్పడిన సదభిప్రాయాన్ని కూడా చెరిపేసేలా వ్యవహరించడం ప్రభుత్వానికి తీరని కళంకమే.


ఎల్‌జి పాలీమర్స్ కంపెనీలో ఉత్పత్తికి స్టైరీను, పెంటేను, పెరాక్సైడు వంటి హానికర రసాయనాలే ముడి పదార్థాలు. ఈ ముడి పదార్థాలను సింగపూర్, గల్ఫ్ దేశాల నుండి కంపెనీ దిగుమతి చేసుకుంటుంది. వీటిని నిలవ చేసుకోవడానికి కంపెనీలో 12ట్యాంకర్లు ఉన్నాయి. వీటి కెపాసిటీ సుమారు 5,500 టన్నులు. మన ప్రెషర్ కుక్కర్ టెక్నాలజి లాంటిదే ఈ ట్యాంకర్లలో కూడా ఉంటుంది. స్టైరీను ద్రవ రూపంలో ఉంటుంది. దీనిని ఆ రూపంలో ఉంచడానికి నిర్దిష్ట ఉష్టోగ్రత అంటే 20 డిగ్రీల సెంటీగ్రేడ్ కంటే తక్కువలోనే ఎప్పుడూ దానిని ఉంచాలి. అలా చేయకపోతే ట్యాంకులోని ఉష్టోగ్రత పెరిగి ద్రవ రూపంలో ఉన్న స్టైరీను వాయు రూపంలోకి మారి ట్యాంకు నుండి బయటకు వచ్చే మార్గం చూసుకుంటుంది. ఈ సారి దానిని సకాలంలో చల్లార్చలేకపోవడంతో సేఫ్టీ వాల్వు పగిలి గ్యాసంతా ఒక్కసారి బయటకు వచ్చేయడంతో పెద్ద ప్రమాదానికి దారితీసింది. ఈ సేఫ్టీ వాల్వు కూడా పనిచేయకపోతే ట్యాంకే పేలిపోయే ప్రమాదం కూడా ఉంది. అదే గాని జరిగితే ఇంకా పెద్ద ప్రమాదం జరిగి ఉండేది. 


ఈ స్టైరీన్ కంటే ఇంకో ప్రమాదకరమైన ముడి పదార్థం కూడా ఈ కంపెనీ వాడుతోంది. అదే పెంటేన్. ఇది సుమారు 40 టన్నుల కెపాసిటీ కలిగిన బులెట్ ట్యాంకర్లలో నిలవ చేసి ఉంటుంది. ఇది కాని లీకయితే ప్రమాదం మరింత భయంకరంగా ఉంటుంది. ఇవి కాక వివిధ పెరాక్సైడులు నాలుగు టన్నుల సామర్థ్యంతో నిల్వ ఉంటున్నాయి. ఇవన్నీ చూస్తే మనకు ఒక విషయం స్పష్టంగా తెలుస్తుంది. అత్యంత అపాయకరమైన రసాయనాలతో నిండిన కుంపటి పక్కనే లక్షలాది ప్రజలు నివసిస్తున్నారనేది ఆ కఠోర సత్యం. 


1961లో ఈ కంపెనీ స్థాపించినప్పుడు ఈ ప్రాంతం నగరానికి దూరంగా జనావాసాలు లేని ప్రాంతం. చిన్న గ్రామం మాత్రమే ఉండేది. నేడు నగరాభివృద్ధిలో భాగంగా జన సాంద్రత భారీగా పెరిగిన ప్రాంతంగా మారింది. అనేక అపార్టుమెంట్లు నేడు వెలిశాయి. కంపెనీకి ఐదు కిలోమీటర్ల వ్యాసార్ధంలో నేడు దాదాపు మూడు లక్షల మంది జనాభా ఉన్నారు. ఇంత జనాభా మధ్య ఇటువంటి అపాయకరమైన పరిశ్రమ ఉండవచ్చా అనేది నేడు ప్రశ్నార్థకమైంది. ఈ పరిశ్రమను 1978లో విజయ్ మాల్యా ఆధ్వర్యంలోని యునైటడ్ బెవరేజస్ స్వాధీనం చేసుకుంది. 1997 జూలైలో దక్షిణ కొరియాకు చెందిన బహుళజాతి ఎల్‌జి కంపెనీ 216 ఎకరాల భూమితో సహా దీనిని కేవలం 100కోట్ల రూపాయలకు కొనుక్కుంది. నేడు ఆ భూమి విలువే దాదాపు వేల కోట్ల రూపాయలు. గత రెండు దశాబ్దాలకు పైగా ఈ కంపెనీ తన బహుళజాతి సంస్థ విధానాలను అనుసరిస్తూ, విపరీతంగా లాభాలు గడిస్తూ వచ్చింది. 1997లో ఎల్‌జి స్వాధీనం సమయంలో సుమారు 150 టన్నుల ఉత్పత్తి ఉన్నప్పుడు యూనియనైజ్డ్ కార్మికుల సంఖ్య 526 మంది ఉండగా నేడు ఉత్పత్తి రెండున్నర రెట్లు పైగా పెరిగినా ఈ తరహా కార్మికులు ఇప్పుడు కేవలం 42 మంది మంది మాత్రమే ఉన్నారు. కార్మికుల స్థానంలో రోబోలను ప్రవేశపెట్టింది.


ఈ కంపెనీలో జిపిపిఎస్ (జనరల్ పర్పస్ పోలీస్టరిన్), హెచ్‌ఐపిఎస్ (హై ఇంపేక్టు పోలీస్టరిన్), సిపిఎస్ (కలర్డ్ పోలీస్టరిన్), ఇపిఎస్ (ఎక్సేండబుల్ పోలీస్టరిన్), ఇపిసి (ఇంజనీరింగ్ ప్లాస్టిక్స్ కాంపౌండ్స్) అనే ఉత్పత్తులను తయారు చేస్తారు. ఇపిఎస్ బరువు తక్కువగా ఉండే బలమైన విద్యుత్ బంధకం. మనం వాడే ధర్మోకోల్ దీని నుండే తయారు చేస్తారు. వీటిని ఎలక్ట్రికల్, ఎలక్రానిక్స్ వస్తువుల ప్యాకింగుకు, కోల్డ్ స్టోరేజీలకు, వ్యవసాయ ఉత్పత్తుల, చేపల ఎగుమతులకు, పారిశ్రామిక, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్స్ తయారీకి ఉపయోగిస్తారు. 1997లో రోజుకు 150 టన్నుల ఉత్పత్తి సామర్థ్యంతో దేశీయ మార్కెట్‌లో నాల్గవ స్థానంలో ఉండగా నేడు 415 టన్నుల సామర్థ్యంతో మార్కెట్ మొదటి స్థానానికి చేరుకుంది. ఇవన్నీ ఒక దగ్గర పెట్టి చూస్తే, మార్కెట్ విస్తరణ, ఉత్పత్తి సామర్థ్యం పెంపు, ఖర్చుల తగ్గింపు, కార్మికుల సంఖ్య కుదింపు, యూనియన్లు లేకుండా చేయడం వంటివన్నీ ఏక కాలంలో చేయడమే ఈ బహుళజాతి సంస్థ ఘనత. ఏ రకమైన భద్రతా ప్రమాణాలు పాటించకుండా ప్రమాదాలకు గురిచేయడం కూడా దీని ప్రత్యేకతే సుమా! 


తక్కువ స్థలంలో అత్యంత అపాయకరమైన అనేక విస్తరణలను కూడా ఈ కంపెనీ చేపట్టింది. ఉదాహరణకు ఇపిఎస్ ప్లాంటు సామర్థ్యాన్ని, ఎటువంటి స్థల విస్తరణ లేకుండానే 20 టన్నుల నుంచి 102 టన్నులకు పెంచింది. ఇప్పుడు మరో 103 టన్నుల అదనపు సామర్థ్యానికి అనుమతులు కోరింది! గతంలో చేసిన అనేక విస్తరణలకు రాష్ట్ర ప్రభుత్వం నుండి గాని, కేంద్ర పర్యావరణ సంస్థ నుండి గాని అనుమతులు లేకుండానే చేపట్టిన చరిత్ర ఈ కంపెనీది. కాలుష్య కారక పరిశ్రమల జాబితాలో ‘రెడ్’ కేటగిరి కిందకు వచ్చే ఈ పరిశ్రమ పర్యావరణ అనుమతులు పొందకుండానే ఈ విస్తరణలను కేవలం కాలుష్య నియంత్రణ మండలి అధికారులను మేనేజ్ చేయడం ద్వారా చేపట్టింది.


పర్యావరణ ప్రభావ అంచనా నోటిఫికేషన్, 2006కి లోబడి తీసుకోవలసిన పర్యావరణ అనుమతి కూడా ఈ కంపెనీ తీసుకోలేదు. ఇప్పుడు మరో 240 టన్నుల సామర్థ్యాన్ని పెంచుకోవడానికి సన్నాహాలు చేస్తోంది. ఈ విస్తరణకై మే 2019లో ప్రభుత్వానికి చేసుకున్న అభ్యర్థన వీటి ఉత్పత్తిలో ప్రమాదకరమైన రసాయనాలు వాడినా ప్రజల ప్రాణాలకేమీ ప్రమాదం లేదని అసత్యాలను పేర్కొంది. అప్పటి రాష్ట్ర ప్రభుత్వం ఈ విస్తరణకు అనుమతులివ్వకూడదని కేంద్ర ప్రభుత్వానికి సిఫారసు చేసింది. ప్రాణాలకు ప్రమాదం ఉందో, లేదో ఇప్పుడు అందరూ గమనించారు.


ఈ కంపెనీ విస్తరణంతా ప్రభుత్వం నుండి అన్ని అనుమతులతోనే జరిగిందా? ఇప్పుడు లాక్‌డౌన్ తరువాత తిరిగి ప్రారంభించడానికి అనుమతులున్నాయా? వంటి ప్రశ్నలకు సమాధానాలు తెలియవలసి ఉంది. అనేక నేరాలకు పాల్పడుతూ, దేశ చట్టాలను ఉల్లంఘిస్తూ, ప్రభుత్వాన్ని కూడా తప్పుదారి పట్టిస్తూ, ఆఖరుకు ప్రజల ప్రాణాలను బలిగొంటున్న ఈ కంపెనీ ఎట్టి పరిస్థితులలోనూ జనావాసాల మధ్య ఉండడం సమర్థనీయంకాదు. 50 కోట్ల రూపాయలు జమ చేయమని ఎల్‌జీ పాలీమర్స్‌ను ఆదేశించడమే కాక, గ్యాస్ లీక్‌పై అంతర్జాతీయ నిపుణలతో విచారణ జరిపిస్తామని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ పేర్కొంది. అదే సందర్భంలో కంపెనీ భద్రతా ప్రమాణాలు పాటించకపోవడమే ప్రమాద కారణమని కూడా తెలిపింది. రాష్ట్ర హైకోర్టు కూడా సుమోటోగా జోక్యం చేసుకుంది. రాష్ట్ర ప్రభుత్వం దీనిపై విచారణకై ఒక కమిటీని వేసింది.


కేవలం ఈ ఒక్క ప్రమాదాన్ని ఒంటరిగా చూడడం కాకుండా ఈ కంపెనీ పాల్పడిన అన్ని వ్యవహారాలపై సమగ్రమైన విచారణ నిపుణులతో చేయిస్తేనే వాస్తవాలన్నీ బయటకు వస్తాయి. తూతూ మంత్రం కమిటీలుగా కాకుండా ప్రజల ప్రాణాలు, పర్యావరణాన్ని కాపాడుతూ అబివృద్ధి సాధన సంకల్పంతో ప్రభుత్వం పటిష్ఠ చర్యలు తీసుకోవాలి. గ్యాస్ లీక్‌కు కారణమైన యాజమాన్యాన్ని కట్టడి చేయడం కాకుండా అలా కోరిన ప్రజలనే అరెస్టులు చేయడం దేనిని సూచిస్తుంది? రాష్ట్ర ప్రభుత్వానికి నిజంగా చిత్తశుద్ధి ఉంటే ప్రజలపై పెట్టిన కేసులు ఎత్తివేయాలి. ఈ పరిశ్రమ జనావాసాల మధ్య ఉండవలసినది కాదు అనేది స్పష్టంగా గమనంలో ఉంచుకుని కంపెనీని తరలించి, యాజమాన్యాన్ని తక్షణం అరెస్టు చేసి, ఉత్తుత్తి కేసులతో సరిపెట్టకుండా కఠినంగా శిక్షించాలి.

ఎ. అజ శర్మ

ఎల్‌జి పాలిమర్స్ గుర్తింపు యూనియన్ పూర్వ అధ్యక్షులు

Advertisement
Advertisement
Advertisement