desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Oct 26 2016 @ 06:53AM

యుద్ధప్రాతిపదికన గవర్నమెంట్‌ కాంప్లెక్స్‌ శంకుస్థాపన పనులు

  • భారీగా యంత్రాల మోహరింపు, రేయింబవళ్లు సన్నాహకాలు 
  • 50,000మంది పైగా హాజరవుతారనే అంచనాతో ఏర్పాట్లు
(ఆంధ్రజ్యోతి, అమరావతి)
అమరావతికి మకుటాయమానంగా నిలవనున్న గవర్నమెంట్‌ కాంప్లెక్స్‌కు ఈ నెల 28వ తేదీన కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్‌ జైట్లీ చేతులమీదుగా జరగనున్న శంకుస్థాపనోత్సవానికి సంబంధించిన పనులు యుద్ధప్రాతిపదిన సాగుతున్నాయి. రాజధాని గ్రామాలైన లింగాయపాలెం-రాయపూడిల మధ్య దాదాపు 120 ఎకరాల్లో నిర్వహించనున్న ఈ కార్యక్రమానికి రాజధాని ప్రాంత ప్రజలతోపాటు రాష్ట్రంలోని ఇతర ప్రదేశాలతో కలుపుకొని దాదాపు 50,000 నుంచి 60,000 మంది హాజరవుతారన్న అంచనాతో సీఆర్డీయే ఆధ్వర్యంలో ఆయా భూముల్లోని మొక్కలు, చెట్లను తొలగించడంతోపాటు నేల చదును కార్యక్రమాన్ని చేపట్టింది. గురువారం రాత్రికల్లా సభాస్థలిని పూర్తిస్థాయిలో సిద్ధం చేసే ఉద్దేశ్యంతో అహర్నిశలు పనులు చేస్తున్నారు. సీఆర్డీయే సీఈ డి.కాశీవిశ్వేశ్వరరావు ఆధ్వర్యంలో సంస్థ ఇంజినీరింగ్‌ అధికారులు, సిబ్బందితోపాటు వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు, ఉద్యోగులు పనులను పర్యవేక్షిస్తున్నారు.
పరస్పరం సమన్వయంతో..
ఇప్పటి వరకూ మొక్కలు, చెట్లతో నిండి ఉన్న దాదాపు 120 ఎకరాలను 4, 5 రోజుల వ్యవధిలో అన్ని విధాలుగా సిద్ధం చేయడం సవాలే అయినప్పటికీ సమష్టిగా, పరస్పర సమన్వయంతో పనిచేయడం ద్వారా దానిని విజయవంతంగా అధిగమించేందుకు ముమ్మరంగా యత్నిస్తున్నారు. సుమారుగా 35 భారీ పొక్లెయిన్లు, జేసీబీలు, బుల్‌డోజర్లతోపాటు ఆరు వైబ్రో రోలర్లను ఇందుకోసం నియోగిస్తున్నారు. ఇవికాకుండా పలు ట్రాక్టర్లు కూడా పనుల్లో పాలుపంచుకుంటున్నాయి. సుమారు 20 ఎకరాల్లో బహిరంగసభకు ఏర్పాట్లు జరుగుతుండగా మరో 80 నుంచి 100 ఎకరాలను పార్కింగ్‌, హెలిప్యాడ్‌ తదితరాల కోసం కేటాయించారు. సభావేదికను కేంద్ర మంత్రులు అరుణ్‌జైట్లీ, ఎం.వెంకయ్యనాయుడితోపాటు ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, ఆయన మంత్రివర్గ సహచరులు, తదితర వీవీపీలు కూర్చునేందుకు అనువుగా 40 ఇంటూ 45 అడుగుల కొలతలతో భారీఎత్తున నిర్మించనున్నట్టు తెలుస్తోంది. ప్రజలు, వాహనాలు సభాస్థలికి చేరుకునేందుకు వీలుగా గుంటూరు, విజయవాడల వైపు వరుసగా రాయపూడి, వెలగపూడిల వద్ద ప్రవేశద్వారాలు నిర్మిస్తున్నారు. ప్రజలు, ప్రముఖుల వాహనాలు కలసి వందలాది రానున్నందున వాటిని సజావుగా నిలుపుకునేందుకు, వాటి వల్ల ఎటువంటి ట్రాఫిక్‌ ఇబ్బందులు ఎదురవకుండా ఉండేందుకు సువిశాలమైన పార్కింగ్‌ ప్రదేశాలను వివిధ దిశల్లో ఏర్పాటు చేస్తున్నారు. కేంద్ర మంత్రులు, ముఖ్యమంత్రి సభాస్థలికి రోడ్డు మార్గంలోనే వస్తారని భావిస్తున్నప్పటికీ ముందు జాగ్రత్తగా సభావేదికకు చేరువలో హెలిప్యాడ్‌ను సిద్ధం చేస్తున్నారు.
పలువురు ఉన్నతాధికారుల పరిశీలన..
ఈ ప్రాంగణాన్ని, అందులో జరుగుతున్న పనులను పరిశీలించేందుకు పోలీసు, వివిధ ప్రభుత్వ శాఖలు, సీఆర్డీయే ఉన్నతాధికారులు పలువురు మంగళవారం ఉదయం నుంచే రావడం ప్రారంభించారు. గుంటూరు జిల్లా కలెక్టర్‌ కాంతిలాల్‌ దండే, రూరల్‌ ఎస్పీ నారాయణ నాయక్‌, సీఆర్డీయే కమిషనర్‌ డాక్టర్‌ చెరుకూరి శ్రీధర్‌, పలు ప్రభుత్వ శాఖల ఉన్నతాధికారులు వీరిలో ఉన్నారు. పనుల్లో మరింత వేగం పెంచి గురువారం సాయంత్రానికల్లా పూర్తి చేయడం, కట్టుదిట్టమైన భద్రతాచర్యలు తీసుకోవడం, రద్దీ నియంత్రణకు పటిష్టమైన బ్యారికేడ్లను ఏర్పాటుపై పలు సూచనలిచ్చారు.