Server-153
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Oct 26 2016 @ 06:52AM

ఏపీ రాజధానిలో నిఘా పెంపు

  • ఏవోబీ ఎన్ కౌంటర్‌తో అప్రమత్తమైన పోలీసులు 
  • స్ర్టైకింగ్‌కు అవకాశాలు ఉంటాయనే అనుమానాలు 
  • విజయవాడ, అమరావతిలో పటిష్ట భద్రత
(ఆంధ్రజ్యోతి, విజయవాడ) : ఆంధ్రా ఒడిశా బోర్డర్‌ (ఏఓబీ)లో జరిగిన ఎనకౌంటర్‌ నేపథ్యంలో నవ్యాంధ్ర రాజధాని ప్రాంతంలో హైఅలర్ట్‌ను ప్రకటించారు. విజయవాడ, గుంటూరు, అమరావతి (తుళ్లూరు సబ్‌డివిజన్‌) ఏరియాలో నిఘాను పెంచారు. గతంలో ఈ ప్రాంతంలో మావో కదలికలు ఉండటం, రాజధాని అయిన తర్వాత ఇటీవల పలువురు మావోలు ఈ ప్రాంతంలో సంచరించారనే వార్తలు రావటంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. దేశచరిత్రలో అత్యంత సమర్థవంతమైన ఎనకౌంటర్‌ను ఏపీ గ్రేహౌండ్స్‌ చేపట్టిన క్రమంలో.. రాజధాని ప్రాంతంలో మావోలు స్ర్టైకింగ్‌కు పాల్పడే అకాశాలు ఉన్నాయనే అనుమానాలు ఉండటంతో ముందస్తు భద్రతగా పోలీసులు పటిష్ఠచర్యలు చేపడుతున్నారు.
రాజధానిలో పటిష్ట నిఘా..
రాష్ట్ర పరిపాలన అంతా ప్రస్తుతం రాజధాని ప్రాంతం నుంచే జరుగుతోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు కార్యకలాపాలు, ఇతర మంత్రుల కార్యక్రమాలు, వీఐపీ, వీవీఐపీ మూమెంట్‌ అంతా ఇక్కడ నుంచే కొనసాగుతున్నాయి. దీంతో విజయవాడ, గుంటూరు రీజియన్‌లో భద్రత పరంగా పటిష్టచర్యలు తీసుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. గతంలోనే విజయవాడ నగరం మొత్తాన్ని సీసీ కెమెరాల నిఘాలోకి తీసుకొచ్చారు. అయితే రాజధాని ప్రాంతంపై మావోల కన్నుపడిందని, ఇక్కడ పలుమార్లు మావోలు, మావో సానుభూతిపరులు పర్యటనలు చేసి, మొత్తం అంతా పరిశీలించారనే వార్తలొచ్చాయి. అంతేకాక రాజధాని అమరావతి రీజియనలో మూడునెలల క్రితం మాజీ మహిళా మావోయిస్టును పోలీసులు పట్టుకున్నారు.ఆమెకు అనారోగ్యంగా ఉండటంతో.. చికిత్స నిమిత్తం బంధువుల ఇంట్లో ఉంటూ చికిత్స తీసుకుంటున్నట్టు పోలీసులు గుర్తించారు. ఆ తర్వాత కూడా అప్పుడప్పుడు రాజధాని ప్రాంతంలో మావోలు తిరిగినట్టు వార్తలు వెలువడ్డాయి. రెండురోజుల క్రితం ఏఓబీలో గ్రేహౌండ్స్‌ చేపట్టిన ఎనకౌంటర్‌కు ప్రతిగా మావోలు దాడులకు తెగపడవచ్చని ఇంటిలిజెన్స్‌ వర్గాలు అంచనా వేస్తున్నాయి. దీంతో రాజధాని ప్రాంతంలోని పోలీసులు మరింత అప్రమత్తమై నిఘాను పెంచారు.
ప్రత్యేక తనిఖీలు
ఈ నేపథ్యంలో విజయవాడ, అమరావతి రీజియనలో పోలీసులు ప్రత్యేక తనిఖీలకు తెరలేపారు. కసిమీద ఉన్న మావోలు ఏ రూపంలోనైనా ఈ ప్రాంతంలో దాడులకు తెగబడతారనే అనుమానంతో పోలీస్‌ వ్యవస్థను అప్రమత్తం చేశారు. రైల్వే, బస్‌స్టేషన, ఇతర కీలకప్రాంతాల్లో పోలీ్‌సనిఘాను పెంచారు. రాజధాని గ్రామాల్లోనూ ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపినట్టు తెలిసింది. అంతేకాక అనుమానం ఉన్న వ్యక్తుల సంభాషణలు, మావో సానుభూతిపరులు, బ్యాంకు ఖాతాల లావాదేవీలపై కూడా నిఘా పెట్టినట్టు తెలిసింది. అలాగే మావోల ఫోటోలను, వారి గుర్తులను తెప్పించుకుని.. వారి కదలికలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నట్టు సమాచారం. బయటకు తెలియకుండా నిగూఢంగా దీనికి సంబంధించి అనేక చర్యలను పోలీసులు అమలుపరుస్తున్నట్టు తెలిసింది. ఏదేమైనా అత్యంత ప్రశాంతతకు మారుపేరుగా నిలుస్తున్న ఈ నవ్యరాజధాని ప్రాంతంలో ఎటువంటి అరాచకశక్తులనైనా ఉక్కుపాదంతో అణచివేసేందుకు పోలీసులు మరింత వేగవంతంగా, సాంకేతికంగా ముందడుగు వేస్తున్నారు.