Server-91
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Oct 26 2016 @ 06:43AM

బంగారు దుర్గమ్మకు 5,00,000 గాజుల వైభవం

  • పసిడి కాంతుల ఝరి
ఇంద్రకీలాద్రిపై కొలువుతీరిన కనకదుర్గమ్మ మంగళవారం పంచరంగుల గాజుల మధ్య పసిడి కాంతులు వెదజల్లుతూ భక్తులకు దర్శన మిచ్చింది. ఆలయ అధికారులు దుర్గమ్కకు తొలిసారి గాజుల మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఆలయ ప్రధానార్చకుడు బదరీనాథ్‌ బాబు మూలవిరాట్టుకు అలంకరించిన బంగారు జరీ నేత చీర, బంగారు రంగు గాజులతో దీపపు కాంతుల నడుమ సౌభాగ్యప్రదాయిని మరిం త శోభాయమానంగా భక్తులకు దర్శనమిచ్చింది. భక్తులను గాజుల మహోత్సవంలో భాగస్వాములను చేసేందుకు దుర్గగుడి అధికారులు నగదు రూపంలోనూ, 2/6 సైజుగల చెక్కుడు గాజులను దాతల నుంచి సేకరించారు. ఎరుపు, పచ్చ, ఊదా, పసుపు, బంగారు వర్ణాల్లో ఉన్న దాదాపు అయిదు లక్షల గాజులతో అమ్మవారిని అలంకరించారు. అమ్మవారి అంతరాలయంలో కూడా పంచరంగుల గాజులను దండలుగా వేలాడదీశారు. మల్లికార్జున మహామండపంలోని ఆరో అంతస్థులో కుంకుమార్చనలు జరిగే ప్రదేశంలో ఏర్పాటు చేసిన వేదికపై అమ్మవారిని పంచరంగుల గాజులతో ప్రత్యేకంగా అలంకరించారు. ఇక్కడ అమ్మవారిని భక్తులు తనివితీరా దర్శించుకునే అవకాశం కలిగింది. దాదాపు 4 లక్షల గాజులను భక్తులనుంచి సేకరించగా, లక్ష గాజులను దేవస్థానం కొనుగోలు చేసినట్లు తెలిసింది. అమ్మవారిని దర్శించుకునేందుకు వేకువజాము నుంచే మహిళలు తరలివచ్చారు. గాజుల మహోత్సవం సందర్భంగా అంతరాలయంలో ప్రతి రోజూ ఉదయం జరిగే దేవీ ఖడ్గమాల స్తోత్రాన్ని రద్దు చేశారు. శాకంబరీ మహోత్సవాల సమయంలో దేవస్థానం భక్తుల నుంచి విరివిగా కూరగాయలను సేకరించినట్లే ఇప్పుడు గాజుల మహోత్సవంలో తమను భాగస్వాములను చేయటం అదృష్టంగా భావిస్తున్నామని భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.0