Server-91
desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
Oct 26 2016 @ 01:55AM

రాంచీలోనే పట్టేద్దాం

  • సీరిస్‌పై కన్నేసిన భారత్
  • సమం చేయాలని న్యూజిలాండ్‌
  • కివీస్‌తో నాలుగో వన్డే నేడు
  • ధోనీపైనే అందరి దృష్టి
రెండో వన్డే ఓటమి నుంచి టీమిండియా అద్భుతంగా పుంజుకుంది. మొహాలీలో భారీ లక్ష్యాన్ని ఛేదించి సీరిస్‌లో 2-1తో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. విరాట్‌ మరోసారి వీరవిహారం చేయగా.. కెప్టెన్‌ ధోనీ చాన్నాళ్ల తర్వాత ధనాధన్‌ బ్యాటింగ్‌తో అలరించడం మనకు బోనస్‌..! ఇప్పుడు భారత్‌ లక్ష్యం సీరిస్‌ను పట్టేయడమే..! రాంచీలోనే ఆ లాంఛనం ముగిస్తే.. మరీ హ్యాపీ! పైగా.. సొంతఊళ్లో సిరీస్‌ నెగ్గిన ఘనత జార్ఖండ్‌ డైనమైట్‌ ధోనీకి మధుర జ్ఞాపకంగా మిగిలిపోతుంది..! మరి అచ్చొచ్చిన రాంచీలో ధోనీ అండ్‌ కో... కివీస్‌ను రఫ్ఫాడిస్తుందా..!


రాంచీ: బ్యాట్స్‌మన్‌గా తనను తాను నిరూపించుకునే ఇన్నింగ్స్‌ ఆడిన కెప్టెన్‌ మహేంద్ర సింగ్‌ ధోనీ.. అదే ఉత్సాహంతో సీరిస్‌ను కైవసం చేసుకోవాలని భావిస్తున్నాడు. ఐదు వన్డేల సీరిస్‌లో భాగంగా బుధవారం తన సొంతగడ్డ రాంచీలో జరిగే నాలుగో వన్డేలో జట్టును గెలిపించాలని చూస్తున్నాడు. కెరీర్‌ చివరి దశలో ఉన్న నేపథ్యంలో జార్ఖండ్‌ డైనమైట్‌ ధోనీకి.. రాంచీలో ఆడే చివరి మ్యాచ్‌ ఇదే అయ్యే అవకాశం కనిపిస్తోంది. ఇక్కడ జరిగిన మూడు వన్డేలు, ఒక టీ-20లో భారత్‌ ఓటమి ఎరుగకపోవడం విశేషం. ఇదే వేదికపై గత రెండు మ్యాచ్‌ ల్లో కోహ్లీ (77 నాటౌట్‌, 139 నాటౌట్‌) మ్యాచ్‌ విన్నింగ్‌ ఇన్నింగ్స్‌లు ఆడాడు. మొహాలీలో భారీ శతకంతో విజృంభించిన విరాట్‌ అచ్చొచ్చిన రాంచీలోనూ రెచ్చిపోవాలని చూస్తున్నాడు.
 
క్రీజులో కుదురుకుంటే తన ను ఆపడం ఎవరి తరమూ కాదని మరోసారి నిరూపించిన విరాట్‌ వన్డేల్లో 26 సెంచరీలు నమోదు చేశాడు. ఇందులో 22 మ్యాచ్‌ల్లో భారత్‌ నెగ్గగా.. 14 శతకాలు ఛేదనలో చేసినవే. దీంతో, 27 ఏళ్ల ఈ ఢిల్లీ బ్యాట్స్‌మన్‌ను అడ్డుకునేందుకు కివీస్‌ ఏం మంత్రం వేస్తుందో చూడాలి. ధోనీ ఫామ్‌లోకి రావడం కివీ స్‌ను మరింత ఆందోళనకు గురిచేస్తోంది. రాంచీలోనూ మహీ నాలుగో నెంబర్‌లో కొనసాగే అవకాశం కనిపిస్తోంది. మరోవైపు ఇప్పటికే టెస్టుల్లో వైట్‌వా్‌షకు గురైన న్యూజిలాండ్‌.. వన్డే సిరీస్‌ ఆశలు సజీవంగా ఉంచుకోవాలంటే ఈ మ్యాచ్‌లో తప్పక నెగ్గాల్సిందే కనుక ఒత్తిడంతా ఆ జట్టుపైనే ఉండనుంది.
 
ఓపెనర్లపైనే ఆందోళన..
ముగ్గురు స్టార్‌ బౌలర్లు అశ్విన్‌, షమి, జడేజాకు విశ్రాంతినిచ్చినప్పటికీ.. భారత బౌలింగ్‌ విభాగం అద్భుత ప్రదర్శన చేస్తోంది. ముఖ్యంగా పార్ట్‌ టైమర్‌ కేదార్‌ జాదవ్‌ సీరిస్‌లో ఆరు వికెట్లు పడగొట్టడం ఆకట్టుకుంది. ఫిట్‌నెస్‌ సమస్యలతో సురేశ్‌ రైనా సీరిస్‌కు దూరమవడంతో దక్కిన అవకాశాన్ని జాదవ్‌ రెండు చేతులా ఒడిసిపట్టుకున్నాడు. నాణ్యమైన బ్యాట్స్‌మన్‌ అయిన జాదవ్‌.. చాంపియన్స్‌ ట్రోఫీకి ఇతర ప్లేయర్లకు గట్టి పోటీ ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక, హార్దిక్‌ పాండ్యా అరంగేట్రం సీరిస్‌లోనే బ్యాటింగ్‌, బౌలింగ్‌తో ఆకట్టుకుంటున్నాడు. ధర్మశాలలో మ్యాచ్‌ విన్నింగ్‌ స్పెల్‌ వేసిన అతను ఢిల్లీలో బ్యాట్‌తో సత్తా చాటాడు. అయితే, ఓపెనింగ్‌ ద్వయం రోహిత్‌, రహానె ప్రదర్శనపై జట్టు ఆందోళన చెందుతోంది. సీరిస్‌లో ఇప్పటివరకూ మంచి ఆరంభం ఇవ్వలేకపోయిందీ జోడీ. గత మూడు మ్యాచ్‌ల్లో (49, 21, 13)నూ ఓపెనర్లు విఫలమయ్యారు. దీంతో, రాంచీలోనైనా వీరిద్దరూ సత్తా చాటి మిడిలార్డర్‌పై అదనపు భారం పడకుండా చూడాలని మేనేజ్‌మెంట్‌ కోరుకుంటోంది. ధవన్‌, లోకేశ్‌ రాహుల్‌ గైర్హాజరీ నేపథ్యంలో.. భారీ స్కోరు చేసి ఓపెనర్‌గా జట్టులో స్థానం సుస్థిరం చేసుకోవాలని రహానె ఉవ్విళ్లూరుతున్నాడు. అతనితో పాటు రోహిత్‌ బ్యాట్‌ ఝుళిపిస్తే భారత్‌కు ఎదురుండకపోవచ్చు. ఈ మ్యాచ్‌లోనూ తుది జట్టులో మార్పులేమీ ఉండకపోవచ్చు.
 
గెలిచి నిలుస్తుందా..
ఢిల్లీలో గెలుపు జోరును కొనసాగించలేకపోయిన కివీస్‌.. భారత పర్యటనలో మరోసారి చతికిలపడింది. ఇప్పుడు సిరీస్‌ ఆశలు సజీవంగా ఉంచుకోవాలంటే రాంచీలో తప్పక నెగ్గాల్సిన పరిస్థితి ఏర్పడింది. నిలకడ లేమి ఆ జట్టును వేధిస్తోంది. ముఖ్యంగా బ్యాట్స్‌మెన్‌ వైఫల్యం కివీస్‌ అవకాశాలకు గండికొడుతోంది. లాథమ్‌, విలియమ్సన్‌ తప్ప ఏ ఒక్క బ్యాట్స్‌మన్‌ కూడా పరుగుల వేటలో ముందుకెళ్లడం లేదు. సీనియర్‌ ద్వయం మార్టిన్‌ గప్టిల్‌, రాస్‌ టేలర్‌కు ఈ పర్యటన చేదు జ్ఞాపకంగా మారేలా కనిపిస్తోంది. సీరిస్‌ను సానుకూల దృక్పథంతో ముగించాలంటే వారిద్దరూ బ్యాట్‌కు పని చెప్పాల్సి ఉంటుంది. కీలక మ్యాచ్‌లో కివీస్‌ తుది జట్టులో మార్పులు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. నెట్‌ సీరిస్‌ను తీవ్రంగా శ్రమించిన వాట్లింగ్‌ను.. కీపర్‌ రోంచీ స్థానంలో జట్టులోకి తీసుకోవచ్చు. అయితే, గత మ్యాచ్‌లో మిడిలార్డర్‌లో కుదురుకోవడం ఆ జట్టుకు సానుకూలాంశం. జేమ్స్‌ నీషమ్‌, మాట్‌ హెన్రీ తొమ్మిదో వికెట్‌కు రికార్డు భాగస్వామ్యం నెలకొల్పి జట్టును ఆదుకున్నారు. ఫ్లాట్‌ ట్రాక్‌లపైన మిగతా మ్యాచ్‌ల్లోనైనా టాపార్డర్‌ పటిష్ట పునాది వేయాలని కెప్టెన్‌ ఆశిస్తున్నాడు. మరి, రాంచీలో బ్లాక్‌క్యాప్స్‌ జట్టు ధోనీసేనపై గెలిచి సీరిస్‌లో నిలుస్తుందో లేదో చూడాలి.

జట్లు (అంచనా)
భారత్‌: రోహిత్‌, రహానె, కోహ్లీ, మనీష్‌, కేదార్‌, ధోనీ (కెప్టెన్‌/కీపర్‌), హార్దిక్‌, అక్షర్‌, మిశ్రా, ఉమేశ్‌, బుమ్రా.
 
న్యూజిలాండ్‌: గప్టిల్‌, లాథమ్‌, విలియమ్సన్‌ (కెప్టెన్‌), టేలర్‌, వాట్లింగ్‌/రోంచీ (కీపర్‌), అండర్సన్‌, నీషమ్‌/ డెవిసిచ్‌, శాంట్నర్‌, సౌథీ, బౌల్ట్‌, హెన్రీ.
 
పిచ్‌/వాతావరణం
రాంచీ వికెట్‌ ఫ్లాట్‌గా కనిపిస్తోంది. పిచ్‌పై ఏ మాత్రం పచ్చిక లేదు. ఇది బ్యాటింగ్‌తో పాటు కొద్దిగా స్పిన్‌కు కూడా అనుకూలించొచ్చు. ఇక బుధవారం సాయంత్రం ఆకాశం మేఘావృతం అయ్యే అవకాశాలున్నా వర్షం కురిసే సూచనలు కనిపించడం లేదు.